ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీల్లో సందడి చేసేందుకు బ్లాక్‌బస్టర్ మూవీస్ వచ్చేశాయ్. ఉగాది పండుగను పురస్కరించుకుని ఇవాళ(మార్చి 22) మూడు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలలోకి రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో చూసేద్దామా..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న షారుఖ్‌కు బాక్సాఫీస్ దగ్గర బంపర్ బొనంజాను అందించింది ఈ సినిమా. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జనవరి 25వ తేదీన విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది. కేవలం హిందీలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ టాక్ సొంతం చేసుకుందీ సినిమా. ఇక ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేసేందుకు వచ్చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 22 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశీ హీరోహీరోయిన్లుగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా డీసెంట్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేసింది. మార్చి 22 నుంచి అటు ‘ఆహా’.. ఇటు ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ది వీకెండ్ షో సమర్పణలో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై హర్ష పులిపాక దర్శకత్వంలో అఖిలేష్ వర్ధన్, స్రుజన్ ఎరబోలు ఈ సినిమాను నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 9న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీని మార్చి 22 నుంచి ఈటీవీ విన్ యాప్‌లో చూడొచ్చు.