స్టార్ నటులతో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలు సహజంగానే జనాలను థియేటర్లకు రప్పిస్తాయి. ఓ స్టార్ హీరో, గ్లామర్ నటి, బాలీవుడ్ నుంచి వచ్చిన విలన్, అయిదారు ఫైట్స్, పాటలు .. ఇవన్నీ సినిమాలో ఉంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంటుంది. అయితే ఈ తరహా ఫిక్స్‌డ్ క్యాంప్లెట్ లేకుండా కేవలం మంచి కథతో, నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాల సంఖ్య చాలా తక్కువ. తాజాగా అలా విడుదలైన సినిమా పేరు ‘అమరన్’. సాయి పల్లవి, శివకార్తికేయన్ జంటగా నటించిన ఈ తమిళ చిత్రానికి విడుదలైన మూడు వారాల తర్వాత భారీ వసూళ్లు వస్తున్నాయి. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ‘అమరన్’ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఏ మాత్రం తగ్గకపోవడంతో గురువారం (నవంబర్ 14) విడుదలైన తమిళ చిత్రం ‘కంగువ’కు భారీ స్థాయిలో థియేటర్లు దక్కలేదు. కాగా థియేటర్లలో చూసే అవకాశం లేని మంది సినీ ప్రేక్షకులు ఇప్పుడు OTTలో సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అమరన్ సినిమాను ఓటీటీలో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. ముందుగా అనుకున్న ప్రకారం, సినిమా విడుదలైన 28 రోజుల తర్వాత అంటే నవంబర్ 26న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. కానీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది. ఇందుకు సినీ నిర్మాణ సంస్థే కారణమని అంటున్నారు.
తమిళనాడులోని ముఖ్యమైన నగరాల్లో ‘అమరన్’ సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తుండడంతో ఓటీటీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నార్త్ ఇండియన్ సిటీస్‌లో సినిమాని ప్రమోట్ చేయడం ద్వారా ముంబై, గుజరాత్, యూపీ మరికొన్ని రాష్ట్రాల్లో షోల సంఖ్యను పెంచాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది. కాబట్టి అమరన్ సినిమా OTT విడుదలను వాయిదా వేస్తున్నారు. మేజర్ ముకుందన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. ఈ చిత్రంలో శివకార్తికేయన్ ఆర్మీ మేజర్‌గా నటించగా, అతని భార్య ఇందూ రెబెక్కా వర్గీస్‌గా సాయి పల్లవి యాక్ట్ చేసింది. ఈ చిత్రానికి రాజకుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్‌తో కలిసి నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సో.. అమరన్ సినిమాను ఓటీటీలో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.