చిన్న సినిమాకు కొండంత క్రేజ్.. జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ! దుమ్మురేపుతున్న సినిమా
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల కంటెంట్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో చూడలేని సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూసేందుకు యూత్ బాగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది .

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన సత్తా చాటుతోంది. పెద్దగా హడావుడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ సినిమా.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం ఊహించని స్థాయిలో ఆదరణ అందుకుంటోంది. ముఖ్యంగా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి వీకెండ్‌లోనే ఈ మూవీ భారీ వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం.. డిజిటల్ రిలీజ్ తర్వాత మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతోంది. కేవలం మలయాళ ప్రేక్షకులకే పరిమితం కాకుండా ఇతర భాషల ఆడియన్స్ కూడా సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, పక్కింటి గాసిప్స్, గ్రామీణ వాతావరణం, హాస్యం అన్నీ కలగలిపి ఉంటాయి. కథకు ప్రధానంగా నిలిచే పాత్రలు యాష్లే, జస్టిన్.
యువతి అయిన యాష్లే తనకు పరిచయమైన జస్టిన్‌పై మనసు పారేసుకోవడంతో కథలో అసలు ఆసక్తికరమైన పరిణామాలు మొదలవుతాయి. ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం వారి ప్రేమకు అడ్డంకిగా మారడంతో.. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఎలా స్పందిస్తారు? ఆ పరిస్థితులను ఈ ఇద్దరూ ఎలా ఎదుర్కొంటారు? అనేదే సినిమా కథను ముందుకు నడిపిస్తుంది. ప్రేమకథను సీరియస్‌గా మాత్రమే చూపించకుండా దర్శకుడు దానికి చక్కటి కామెడీ, కుటుంబ భావోద్వేగాలను జోడించారు. దీంతో సినిమా ఎక్కడా భారంగా అనిపించకుండా సరదాగా సాగుతుంది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మొదటి వీకెండ్‌లోనే భారీ సంఖ్యలో వీక్షణలు నమోదవడంతో ఈ చిత్రం మలయాళ సినిమాల ఓటీటీ మార్కెట్‌లో మరోసారి చర్చకు వచ్చింది.
మలయాళ సినిమాలకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఏర్పడింది. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారనే విషయాన్ని బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ మరోసారి నిరూపించినట్లు అభిమానులు చెబుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉండటం సినిమాకు అదనపు ప్రయోజనంగా మారింది. దీంతో మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా ఈ కథను సులభంగా ఆస్వాదించే అవకాశం లభించింది. ఈ సినిమాలో యాష్లే పాత్రలో మమితా బైజు కనిపించగా.. జస్టిన్‌గా నివిన్ పాలీ నటించారు. ఇద్దరి పాత్రల మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ వారి మధ్య సాగే సన్నివేశాలను దర్శకుడు సహజంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. మమితా బైజు తన పాత్రలోని అమాయకత్వం, చిలిపితనాన్ని చక్కగా ప్రదర్శించగా.. నివిన్ పాలీ తన పాత్రకు తగ్గ పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రధాన బలంగా నిలుస్తాయి. ఈ సినిమాకు కథతో పాటు దాని నేటివిటీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒక చిన్న కమ్యూనిటీలో జరిగే సంఘటనలను, అక్కడి మనుషుల ఆలోచనా విధానాన్ని దర్శకుడు సహజంగా తెరపైకి తీసుకొచ్చారు. ఓటీటీలో సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ సినిమాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న సమయంలో.. ఒక సింపుల్ ఫ్యామిలీ కథ కూడా భారీగా ప్రేక్షకులను ఆకట్టుకోగలదని ఈ సినిమా మరోసారి చూపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
