
ఇందులో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. ప్రస్తుతం ట్రెండ్ అయిన పాన్ ఇండియా సినిమా కూడా కాదు. వీఎఫ్ఎక్స్ హంగులు, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లు, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా లేవు. భారీ బడ్జెట్ సినిమా కూడా కాదాయే.. కానీ కంటెంట్ తోనే కోట్ల రూపాయలు రాబట్టిందీ సినిమా. చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైనా కేజీఎఫ్ వంటి సినిమాలను సైతం అధిగమించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఒరిజినిల్ కన్నడ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? ఇటీవల కన్నడ బాగా వార్తల్లో నిలిచిన సినిమా ‘ప్రేమద ఊరలి’. తెలుగులో ప్రేమనే ఊరిలో పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్, రంగాయన రఘు, రమిక శివు, తపస్విని పూనాచ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడలో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి, చందు శ్రీనివాస్, మమతా దేవేంద్ర తెలుగు ప్రేక్షకులకు అందించారు. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులోనూ ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడీ బాక్సాఫీస్ సెన్సేషన్ ఓటీటీలోకి రానుంది.
ప్రేమనే ఊరిలో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుందని సమాచారం. ఈ డీల్ కు సంబంధించి సినిమా నిర్మాతలకు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నవంబర్ 13 నుంచి ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి రానుందని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కుమారుడు సంతోష్‌ను (శ్రీరామ్) అల్లారుముద్దుగా పెంచుతాడు. వ్యవసాయం చేసుకునే సంతోష్‌ను చూసి మరదలు వసంత (రమిక శివు) మనసు పడుతుంది. కానీ తండ్రి మాత్రం కొడుక్కి బాగా చదువుకున్న పిల్లను భార్యగా తేవాలని ఆశపడతాడు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చి ప్రేమలో మోసపోయిన రుక్మిణి (తపస్విని పూనాచ)ని చూసి సంతోష్ ప్రేమలో పడతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ స్నేహితుడి కూతుర్ని పెళ్లి చేసుకోమని తండ్రి సంతోష్‌ను కోరతాడు. మరి తండ్రి పరువు నిలపడం కోసం సంతోష్ ఆ పెళ్లి చేసుకున్నాడా? తన మనసులోని ప్రేమను వదులుకున్నాడా? ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఏ తీరానికి చేరింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి