Jaya Prakash Reddy: నాన్న కరోనాతో చనిపోలేదు.. నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణంపై షాకింగ్ విషయం చెప్పిన కూతురు
సుమారు 3 దశాబ్దాలు.. దాదాపు 300 కు పైగా సినిమాలు.. విలన్ గా, కమెడియన్ గా, సహాయ నటుడిగా మెప్పించారు జయప్రకాశ్ రెడ్డి. తన దైన యాస, నటన, హావభావాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలో జయప్రకాష్ రెడ్డి జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండడంతో 22 ఏళ్లకే గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం పొందారు. అయితే నటనపై మక్కువ ఉండడంత ఉద్యోగం చేస్తూనే రంగ స్థలం నటుడిగా రాణించారు. ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నల్గొండలో ‘ గుప్చుప్’ నాటకంలో జయ ప్రకాశ్ రెడ్డి నటనను చూసిన దాసరి నారాయణ రావు ఆయనకు ‘బ్రహ్మ పుత్రుడు ‘ (1988) చిత్రంలో ఒక పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారాయన. అయితే 1999లో రిలీజైన సమర సింహారెడ్డి సినిమా జయ ప్రకాశ్ రెడ్డి సినిమా కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారాయన. ‘జయం మనదే రా’ ‘చెన్నకేశవ రెడ్డి’ , ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘సీమ సింహం’, ‘కబడ్డీ కబడ్డీ’, ఆయుధం, ఇంద్ర.. ఇలా సుమారు 300 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు జయప్రకాశ్ రెడ్డి. ఎక్కువగా విలన్ గానే నటించినా ఎవడిగోల వాడిది వంటి సినిమాల్లో కమెడియన్ గానూ మెప్పించారాయన. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు పొందిన జయప్రకాశ్ రెడ్డి 2020 సెప్టెంబర్ 08న కన్నుమూశారు. అప్పుడు ఆయనకు సుమారు 74 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే అప్పుడే కరోనా మహమ్మారి ఉండడంతో జయ ప్రకాశ్ రెడ్డి కూడా కోవిడ్ తోనే చనిపోయారని చాలా మంది అనుకన్నారు. అయితే అందులో నిజం లేదంటోంది ఆయన కూతురు మల్లికా రెడ్డి. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు.
‘నాన్న కరోనా టైమ్ లో కన్నుమూశారు. కానీ కరోనాతో చనిపోలేదు. అందరూ ఆయన కోవిడ్ తో చనిపోయారని అనుకున్నారు. ఆ సమయంలో మా తమ్ముడు ఫ్యామిలీకి కరోనా వచ్చింది. దాంతో నాన్న అదే ఇంట్లో పైన పెంట్ హౌస్ లో సింగిల్ గా ఉండేవారు. ఆయనకు కూడా కొన్ని హెల్త్ సమస్యలు ఉన్నాయి. అయితే మా తమ్ముడు ఫ్యామిలీకి కరోనా సోకిందన్న బాధ తో ఆయన డిప్రెషన్ కి వెళ్లారు. ఆ రోజు ఉదయం కూడా బాగానే ఉన్నారు. కానీ అనుకోకుండా సడెన్ గా చనిపోయారు. నాన్న చనిపోయినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేదు. అందరూ నాన్నకు కరోనా వచ్చి చనిపోయారనున్నారేమోనని రాలేదు. గుంటూరులోనే నాన్న అంత్యక్రియలు జరిగాయి. నాన్న దగ్గర 13 ఏళ్ళు మేనేజర్ గా చేసిన ఒక అంకుల్ మాత్రమే నాన్న అంత్యక్రియలకు వచ్చారు. నాన్న చనిపోయారని తెలిసి కొంతమంది సినీ పరిశ్రమ నుంచి కాల్స్ చేసారు. అయితే హీరోలు ఎవరూ కాల్స్ కూడా చేయలేదు’ అంటూ బాగా ఎమోషనల్ అయ్యారు మల్లికా రెడ్డి. ప్రస్తుతం జయ ప్రకాశ్ రెడ్డి కూతురు కామెంట్స్ నెట్టింటవైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




