Premane Oorilo Review : ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. కన్నడ సూపర్ హిట్ తెలుగులో మెప్పించిందా..?
కన్నడలో మంచి విజయం సాధించిన ప్రేమద ఊరలి సినిమాను తెలుగులో ప్రేమనే ఊరిలో పేరుతో సురేష్ కొండేటి విడుదల చేశారు. ఇందులో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ అందుకున్న పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: ప్రేమనే ఊరిలో
నటీనటులు: శ్రీరామ్, రంగాయన రఘు, రమిక శివు, తపస్విని పూనాచ తదితరులు
సంగీతం: సునద్ గౌతమ్
సినిమాటోగ్రఫీ: రాజ్ కాంత్ SK
ఎడిటర్: హర్షిత్ ప్రభు
నిర్మాత: సురేష్ కొండేటి, చందు శ్రీనివాస్, మమతా దేవేంద్ర
దర్శకత్వం: మనోజ్ కుమార్
కన్నడలో మంచి విజయం సాధించిన ప్రేమద ఊరలి సినిమాను తెలుగులో ప్రేమనే ఊరిలో పేరుతో సురేష్ కొండేటి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ అందుకున్న పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
భార్యను కోల్పోయిన నాగన్న (రంగాయన రఘు) తన కుమారుడు సంతోష్‌ను (శ్రీరామ్) అల్లారుముద్దుగా పెంచుతాడు. వ్యవసాయం చేసుకునే సంతోష్‌ను చూసి మరదలు వసంత (రమిక శివు) మనసు పడుతుంది. కానీ తండ్రి మాత్రం కొడుక్కి బాగా చదువుకున్న పిల్లను తేవాలని ఆశపడతాడు. తనకంటూ కొన్ని షరతులు పెట్టుకున్న సంతోష్‌కు ఏ సంబంధం సెట్ అవ్వదు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చి ప్రేమలో మోసపోయిన రుక్మిణి (తపస్విని పూనాచ)ని చూసి సంతోష్ తొలిచూపులోనే ఇష్టపడతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఓ స్నేహితుడి కూతుర్ని పెళ్లి చేసుకోమని తండ్రి సంతోష్‌ను ప్రాధేయపడతాడు. తండ్రి పరువు నిలపడం కోసం సంతోష్ ఆ పెళ్లి చేసుకున్నాడా? తన మనసులోని ప్రేమను వదులుకున్నాడా? ముక్కోణపు ప్రేమకథలో ఎవరి ప్రయాణం ఏ తీరానికి చేరింది అనేది ఈ చిత్ర ఇతివృత్తం.
కథనం:
రక్తపాతం, యాక్షన్ హంగులు లేకుండా స్వచ్ఛమైన ప్రేమకథలొచ్చి చాలా కాలమే అయింది. ఆ లోటును భర్తీ చేసేలా అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రాన్ని మలిచారు. ఒకప్పటి ఫ్యామిలీ, ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్లను గుర్తుకుతెచ్చేలా దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆరంభంలో హీరో పరిచయం, పల్లెటూరి విజువల్స్, అతడి పెళ్లి చూపుల తంతుతో నెరేషన్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. అదే సమయంలో మరదలు వసంత వన్ సైడ్ లవ్ ట్రాక్, విదేశాల నుంచి వచ్చిన రుక్మిణి బ్రేకప్ స్టోరీ సమాంతరంగా నడుస్తాయి. ఈ ముక్కోణపు ప్రేమకథలో తొలిభాగం అంతా ఫన్, క్యూట్ మూమెంట్స్‌తో గడిచిపోతుంది. విరామం సమయంలో వచ్చే బలవంతపు పెళ్లి ట్విస్ట్ ముందే ఊహించినప్పటికీ ఆసక్తి రేకెత్తిస్తుంది.
ఇక ద్వితీయార్థంలో అసలు ఎమోషన్స్ మొదలవుతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలు, సర్దుబాట్లు, అలాగే మరదలి ఎమోషనల్ జర్నీని దర్శకుడు సున్నితంగా డీల్ చేశాడు. తండ్రి గతం తాలూకు ఫ్లాష్‌బ్యాక్ పాత చింతకాయ పచ్చడిలానే ఉన్నా మనసుకు కనెక్ట్ అవుతుంది. అయితే ఈ భాగంలో క్యూట్ సీన్స్ పేరుతో సన్నివేశాలను బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ముగింపుకి వచ్చేసరికి మాత్రం ఎమోషన్స్ పీక్స్‌కి వెళ్తాయి. చివరి 30 నిమిషాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. బరువైన హృదయంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేలా క్లైమాక్స్‌ను చాలా బలంగా డిజైన్ చేశారు. రైతులకు సంబంధించిన సంభాషణలు, ఆడపిల్లల జీవితాల గురించి అంతర్లీనంగా ఇచ్చిన సందేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాస్త సాగదీతను భరిస్తే కుటుంబసమేతంగా, ముఖ్యంగా దంపతులు చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్ ఇది.
నటీనటులు:
సంతోష్ పాత్రలో శ్రీరామ్ ఒదిగిపోయాడు. పల్లెటూరి కుర్రాడిగా, చిక్కుల్లో పడిన ప్రేమికుడిగా, భర్తగా వేరియేషన్స్‌ను చక్కగా చూపించాడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో అతడి నటన మెప్పిస్తుంది. ఇక ఆరంభంలో మగరాయుడి తరహా పాత్రలో కనిపించిన రమిక.. ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో జీవించేసింది. రుక్మిణి క్యారెక్టర్‌లో తపస్విని నటన క్యూట్‌గా ఉంది. వీరందరికంటే తండ్రి పాత్ర చేసిన రంగాయన రఘు పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్. తన అనుభవాన్నంతా రంగరించి పతాక సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించాడు. బామ్మగా చేసిన నటితో సహా మిగతా సహాయక ఆర్టిస్టులు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
టెక్నికల్ టీం విషయానికొస్తే సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు పర్లేదు.. కెమెరామెన్ పల్లెటూరి అందాలను, పచ్చని పొలాలను, గుడి వాతావరణాన్ని అద్భుతంగా తన ఫ్రేమ్స్‌లో బంధించాడు. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా ఉన్నతంగా ఉన్నాయి. అయితే తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించాల్సింది. పెదవుల కదలికలకు, డైలాగ్స్‌కు కొన్ని చోట్ల పొంతన కుదరలేదు. అలాగే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇంకొన్ని కత్తెర్లు పడి ఉంటే.. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అక్కర్లేని ట్రాక్స్ తీసేసుంటే రిజల్ట్ మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా ప్రేమనే ఊరిలో.. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ..!
