Bheemla Nayak Movie Review: ఒక ఘటన.. ఇద్దరు వ్యక్తులు, ఒకరిది అర్థబలం, ఇంకొకరిది స్థాన బలం, ఎవరికి వారు తగ్గని నైజం.. ఇవన్నీ కలిపి మలయాళ అయ్యప్పనుం కోషియుం సినిమాను హైలైట్ చేశాయి. తెలుగులో అదే సినిమా భీమ్లానాయక్‌గా వస్తే కథలో ఎన్ని మార్పులున్నాయి? సినిమా మనవాళ్లకు నచ్చేలా చేయడానికి యూనిట్ ఎంత కష్టపడింది? చదివేయండి…
సినిమా: భీమ్లా నాయక్
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, బ్రహ్మానందం, రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, రఘుబాబు, నర్ర శ్రీను, కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులు
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
స్క్రీన్‌ప్లే- మాటలు: త్రివిక్రమ్
ఒరిజినల్ స్టోరీ: అయ్యప్పనుం కోషియుం
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కెమెరా: రవి.కె.చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: తమన్
విడుదల: ఫిబ్రవరి 25, 2022
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నల్లపట్ల స్టేషన్‌లో ఎస్.ఐ. భీమ్లానాయక్ (పవన్ కల్యాణ్). ఎక్స్ మిలిటరీ, ఎంపీ రేస్‌లో ఉన్న వ్యక్తి డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి). అడవి మార్గాలను ఇష్టపడే డానీ ఒకసారి అడవి రూట్లో నైట్ టైమ్ ట్రావెల్ చేస్తాడు. అదే సమయంలో ఎక్సర్‌సైజ్, పోలీసులు అందరూ కలిసి అక్కడ చెక్‌పోస్టులో వాహనాలను తనిఖీ చేస్తుంటారు. డానీ వెహికల్‌లో 30 లీటర్ల లిక్కర్ దొరుకుతుంది. పోలీసులకు, అతనికీ జరిగిన వాగ్వాదంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత డేని బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుస్తుంది పోలీసులకు. అక్కడి నుంచి ఏం జరిగింది? డానీకి లోకల్ నాగరాజు ఎలా పరిచయమయ్యాడు? డానీ తండ్రికి ఈగో ఎందుకు హర్ట్ అయింది? మధ్యలో కాంట్రాక్టర్ ఎవరు? డానియల్ భార్యకి భీమ్లాకి ఉన్న పరిచయం ఏంటి? భీమ్లా భార్యను పోలీసులు ఎందుకు వెతుకుతుంటారు? వంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
భీమ్లా నాయక్ పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు పవన్ కల్యాణ్. దేవరగా గూడెం ప్రజలకు తెలిసిన పవన్ కల్యాణ్‌కు, ఎస్‌ఐగా మారిన తర్వాత అతను చూపించిన ఈజ్‌కీ తేడా స్పష్టంగా తెలిసింది. డేనియల్ పాత్రలో రానాని చూసిన తర్వాత, ఆయన తప్ప మరే హీరో కూడా ఆ పాత్రకు న్యాయం చేయలేరేమో అనిపిస్తుంది. అంతగా ఆ కేరక్టర్‌లో ఒదిగిపోయారు రానా. నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు నిత్య. సుగుణ, భీమ్లా నాయక్ మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి.
రావు రమేష్ కేరక్టర్ కాసేపే కనిపించినా సినిమాకు పెద్ద రిలీఫ్. ‘అది పేరుకే.. సుగుణ.. వరస్ట్ కేరక్టర్’ అనే డైలాగ్ ఆయనంత బాగా ఇంకెవరూ చెప్పలేరేమో. అజయ్ అండ్ గ్యాంగ్ కాసేపే కనిపించినా పాత్రలకు న్యాయం చేశారు. సముద్రఖనికి స్క్రీన్ మీద మంచి స్పేసే ఉంది. క్లైమాక్స్ లో బ్రహ్మానందం కేరక్టర్‌కి థియేటర్లలో నవ్వులు పూశాయి. కొన్నిసార్లు మంచికి పోయినా చెడు ఎదురవుతుందనే మాట సుగుణ కేరక్టర్ విషయంలో నిజమైంది. ‘నాయక్ పెళ్లామంటే అతనిలో సగం కాదు… అతనికి డబుల్’ అని చెప్పే మాట, ‘నేరస్తుడి తల వంగిపోయి ఎందుకు ఉంటుందో’ చెప్పే డైలాగ్, ‘గెలుపంటే కొన్నిసార్లు తప్పు ఒప్పుకోవడం, తప్పించుకోవడం’ అని సంయుక్త చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
ఇక కథనం విషయానికొస్తే.. మూల కథకు చాలా మార్పులు చేశారు. చేసిన మార్పులన్నీ తప్పక తెలుగు వారికి నచ్చేవే. ఒరిజినల్ ఉన్నదున్నట్టు తీస్తే మన నేటివిటీకి అతికేది కాదేమో. పవన్ కల్యాణ్ లాంటి హీరోతో రానా లాంటి హీరో తలపడితే, నిత్యామీనన్, సముద్రఖని, రావు రమేష్, సంయుక్త మీనన్‌లాంటి ఆర్టిస్టులు జతకలిస్తే… ఎవరికి ఎంత మేర స్పేస్ ఇవ్వాలో…. అందరికీ అంతా ఇచ్చి తీసిన సినిమా.
పాటలు, ఫైట్లు కూడా ఆ కథకు, ఆ నేటివిటీకి సరిపోయేటట్టు ఉన్నాయి. యూట్యూబుల్లో మారుమోగిన ‘అంత ఇష్టమేందయ్యా’ పాట స్క్రీన్ మీద లేదన్న వెలితి కనిపించింది. సాగర్ కె చంద్ర డైరక్టర్‌గా ఇంకోసారి సక్సెస్ అయ్యారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రవి.కె. చంద్రన్ కెమెరా, నవీన్ నూలి ఎడిటింగ్ అన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. మొత్తం మీద భీమ్లా నాయక్… సమ్మర్ సినిమాలకు శుభారంభం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దాడి.. బ్యాగ్ లాక్కొని పరారీ.. చివరకు కటకటాల్లోకి
Vijay Devarakonda: పాన్ ఇండియా చిత్రంగా విజయ్ – శివ సినిమా.? అందుకు ఇదే నిదర్శనమా..?