
సినిమా రివ్యూ: బ్యూటీ
నటీనటులు: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, వీ.కె. నరేష్, వాసుకి, నితిన్ ప్రసన్న, ప్రసాద్ బెహ్రా తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: శ్రీ సాయి కుమార్ దారా
ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్
దర్శకుడు: జె.ఎస్.ఎస్. వర్ధన్
కథ, స్క్రీన్‌ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం
నిర్మాతలు: విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్
కథ:
విశాఖపట్నంలోని మధ్య తరగతి కుటుంబంలో ఉండే అలేఖ్య (నీలఖి పాత్ర) కాలేజ్ స్టూడెంట్. ఈ జనరేషన్ అమ్మాయి.. ఆమె తండ్రి నారాయణ (వీ.కె. నరేష్) క్యాబ్ డ్రైవర్. కూతురి కలలను, కోరికలను తీర్చడానికి తన వంతు కృషి చేస్తుంటాడు. అలేఖ్య తల్లి (వాసుకి) స్ట్రిక్ట్. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తుంది. అలేఖ్య స్నేహితురాలు స్కూటీ కొనడంతో తనకు కూడా కావాలని తండ్రిని అడుగుతుంది. దానికోసం డ్రైవింగ్ నేర్చుకోవడానికి అర్జున్ (అంకిత్ కొయ్య) అనే పెట్ ట్రైనర్‌ను కలుస్తుంది. అర్జున్‌తో సన్నిహితంగా మెలగడంతో ప్రేమలో పడుతుంది. ఈ ప్రేమ కథలో అనూహ్య మలుపులు, మోసాలు, కుటుంబ సంఘర్షణలు మొదలవుతాయి. అలేఖ్య తన ప్రేమ, కుటుంబ విలువల మధ్య ఎలా నలిగిపోతుంది..? తండ్రి కూతురు మధ్య బంధం ఎలా బలపడుతుంది..? అసలు అర్జున్, అలేఖ్య కలిసారా లేదా అనేది పూర్తి కథ..
కథనం:
బ్యూటీ తరహా సినిమాలు తెలుగులోనే చాలానే వచ్చాయి. రోజూ మనం న్యూస్‌లో చూసే కథల్నే ఇందులోనూ చూపించారు దర్శకుడు వర్ధన్. ముఖ్యంగా అమ్మాయిలు ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కాస్త కఠువుగానే చూపించే ప్రయత్నం చేసారు. ఫస్టాఫ్ అంతా యూత్ ఎలా ఉన్నారు.. వాళ్ల లైఫ్ స్టైల్ ఏంటి..? ఎంత ఈజీగా అమ్మాయిలు ప్రేమలో పడిపోతున్నారు.. దానికి తోడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఓ అమ్మాయి ఉంటే అక్కడ తల్లితండ్రులు పడే కష్టం ఎలా ఉంటుంది అనేవి చూపించాడు. పాత్రల పరిచయం, వాటి చుట్టూ జరిగే కథ కాస్త స్లోగానే ఉంటుంది. సెకండాఫ్ అంతా కథలో ఊహించని ట్విస్ట్‌లు, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు జీవం పోస్తాయి. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. అప్పట్లో అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమా కూడా గుర్తుకొస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే. నీలఖి పాత్ర, వీ.కె. నరేష్, వాసుకి నటన ఈ సినిమాకు ప్రధాన బలం. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కథ కావడంతో అక్కడి అందాలను బాగా చూపించారు. తండ్రి-కూతురు ఎమోషనల్ ట్రాక్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ తరహా కథలు చాలా వచ్చేయడంతో బ్యూటీ మనకు కొత్తగా అయితే అనిపించదు. నిబ్బా నిబ్బి కథలు అంటారు కదా.. అలాగే ఉంటుంది ఇది కూడా. దానికి తోడు ఫస్టాఫ్ అంతా కొంత స్లోగా, ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ ఉండదు.. రొటీన్ తెలుగు సినిమా ఫార్ములా పులిహోర కలిపేసారు. స్క్రీన్‌ప్లేలో మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఉంటే మరింత బాగుండేది.
నటీనటులు:
ఈ సినిమాకు ప్రాణం నీలఖి పాత్ర పోషించిన అలేఖ్య క్యారెక్టర్. తొలి సినిమాతోనే అద్భుతమైన నటన కనబరిచింది. ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉంటారనేది చాలా బాగా చూపించారు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగానే నటించింది. అంకిత్ కొయ్య ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ప్రేమికుడిగా, కథలోని ట్విస్ట్‌లలో రెండు విభిన్న షేడ్స్‌లో నటించి మెప్పిస్తాడు. ఈ సినిమాకు మరో బలం సీనియర్ నరేష్ పాత్ర. తండ్రి పాత్రలో హృదయాలను కరిగించాడు. మధ్యతరగతి తండ్రి యొక్క ఆవేదన, ప్రేమ, బాధ్యతను అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతని నటన సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ను జోడిస్తుంది. తల్లి పాత్రలో కఠినంగా ఉంటూనే.. ప్రేమ చూపించే తల్లిగా అద్భుతంగా నటించింది వాసుకి. నితిన్ ప్రసన్న, ప్రసాద్ బెహ్రా లాంటి సోపర్టింగ్ నటులు తమ పాత్రల్లో సమర్థవంతంగా నటించారు.
టెక్నికల్ టీం:
విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద బలం. ‘కన్నమ్మ’ పాట ట్రెండింగ్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్లేదు. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. మధ్యతరగతి కుటుంబ జీవితాలు, యువత రొమాన్స్ సన్నివేశాలు విజువల్‌గా రియలిస్టిక్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఎస్.బి. ఉద్ధవ్ ఎడిటింగ్ పర్లేదు.. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు డ్రాగ్ అయినట్లు అనిపిస్తాయి. దర్శకుడిగా కంటే రైటర్‌గానే ఎక్కువ సక్సెస్ అయ్యాడు జె.ఎస్.ఎస్. వర్ధన్. యువత, కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చక్కగా రాసుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో బాగానే ఉన్నా.. కొన్ని మాత్రం వర్కవుట్ చేయలేకపోయాడు. సందేశం ఇచ్చినా.. అక్కడక్కడా కాస్త బ్యాలెన్స్ తప్పినట్లు అనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా బ్యూటీ.. మరీ అంత బ్యూటీ కాదు కానీ యూత్‌కు వార్నింగ్ బెల్..!