Balakrishna’s Akhanda Movie Review: సరైన సినిమా ఒక్కటి పడాలి. ఒకే ఒక్కటి పడాలి. ఆ సినిమా జనాలను తండోపతండాలుగా థియేటర్లకు నడిపించాలి. మాటలు, ఫైట్లు మాత్రమే కాదు… కథ కూడా వాళ్లకి గుర్తుండాలి. కర్తవ్యాన్ని బోధించాలి. సొసైటీకి ఏదో మంచి చెప్పాలి. అలాంటివి చెప్పాలంటే కథను మోసే కథానాయకుడు అంతే బలమైన వాడై ఉండాలి. అతన్ని నడిపించే దర్శకుడు అనుభవజ్ఞుడై ఉండాలి. అలా… అన్నీ తోడయ్యాయని ఇండస్ట్రీ సైతం నమ్మిన సినిమా ‘అఖండ’. సినిమా మొదలైన క్షణమే ఏ జోనరో చెప్పేసే ఈ కాలంలో… జోనర్లకు అతీతంగా అన్ని ఎమోషన్స్ నీ సమపాళ్లో కలిపి చేసిన సినిమా ‘అఖండ’. చాన్నాళ్ల తర్వాత థియేటర్ల ముందు ఒక రేంజ్‌లో సందడి తెచ్చిన ఈ సినిమా, స్క్రీన్ మీద కూడా అదే ఎమోషన్‌ని కన్వే చేయగలిగిందా? లేదా? చదివేయండి…!
సినిమా: అఖండ
నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్, శ్రవణ్, ప్రభాకర్ తదితరులు
సంగీతం: తమన్
కెమెరా: సి.రామ్‌ప్రసాద్
మాటలు: ఎం.రత్నం
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
కళ: ఎ.ఎస్.ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టంట్ శివ
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల: డిసెంబర్ 2
మురళీకృష్ణ(బాలకృష్ణ) అనంతపురంలో అందరికీ తల్లో నాలుకలాంటి వ్యక్తి. ఆయుధం కన్నా అక్షరం మిన్న అని నమ్ముతాడు. వ్యవసాయం చేస్తుంటాడు. పొలాలే కాదు, పరిసరాలు కూడా పచ్చగా ఉండాలని కలలు కంటాడు. జనాల సమస్యల్ని అర్థం చేసుకుని, వాటికి పరిష్కారం కూడా అంతే గొప్పగా చూపిస్తాడు. అక్కడ పాఠశాలలు, హాస్పిటల్సే కాదు, రైతులకు లోన్లు ఇప్పించడం వంటి బాధ్యతల్ని కూడా ఇష్టంగా తీసుకుంటాడు. అతనిలాంటి ఆలోచనలున్న అమ్మాయి శరణ్య. ఆ జిల్లాకు కలెక్టర్‌గా వస్తుంది. మురళీకృష్ణ తత్వం చూసి అతనితో ప్రేమలో పడుతుంది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వాళ్లకు పెళ్లవుతుంది. వాళ్లకు ఓ పాప పుడుతుంది. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో స్థానికంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతారు. అదేంటో తెలుసుకుందామని ప్రయత్నిస్తుండగా మురళీకృష్ణ కూతురు కూడా అదే సమస్యకు గురవుతుంది. దానంతటికీ కారణం లోకల్‌గా కాపర్ మైనింగ్ చేస్తున్న వరదరాజులు (శ్రీకాంత్)అని తెలుస్తుంది. వరదరాజులుకు ఓ పీఠాధిపతి అయిన స్వామీజీ అండ ఉంటుంది. వాళ్లు చేసిన కుట్ర వల్ల సెంట్రల్ మినిస్టర్ (సుబ్బరాజు) మరణిస్తాడు. ఆ హత్యా నేరం వల్ల మురళీకృష్ణ జైలుకు వెళ్తాడు. నేరస్తుడి భార్యగా శరణ్యకు కూడా పవర్ పోతుంది. మురళీకృష్ణ కుటుంబాన్ని చంపేయాలనుకుంటాడు వరదరాజులు. ఆ సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలుస్తాడు శివుడు. పురిట్లోనే విడిపోయిన శివుడు, మురళీకృష్ణ మళ్లీ కలిశారా? వాళ్లు విడిపోవడానికి కారణం ఏంటి? ఎన్.ఐ.ఎ. ఆఫీసర్లకు శివుడు చెప్పిన విషయాలేంటి? కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేసే పూర్ణకు జరిగిన అన్యాయం ఏంటి? అందుకు పాల్పడినందుకు వరదరాజులకు పడిన శిక్ష ఏంటి? అసలు అన్ని రోజులు వరద మైనింగ్స్ లో జరిగిన దారుణం ఏంటి?… ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూసి తీరాల్సిందే.
మురళీకృష్ణగా రైతు పాత్రలో పంచెకట్టులో బాలయ్య ఆహార్యం బావుంది. అలాగే టక్ చేసుకుని కలెక్టర్‌తో కనిపించే సీన్లలోనూ లుక్ పర్ఫెక్ట్ గా ఉంది. ఆయుధంతో కాదు, అక్షరంతో మార్పు అని నమ్మిన రైతుగా పర్ఫెక్ట్ గా సూటయ్యారు బాలయ్య. జిల్లా కలెక్టర్‌గా కనిపించే సన్నివేశాల్లో హుందాతనం, చీరకట్టులో తెలుగుదనంతో ప్రగ్యా జైశ్వాల్ స్క్రీన్ మీద పక్కాగా ఫిట్ అయ్యారు. పెద్దింటి కోడలిగా, పాప తల్లిగా, జైలుకెళ్లిన భర్తకు భార్యగా… అన్నీ సీన్స్ లోనూ పర్ఫెక్ట్ ఎమోషన్స్ పండించారు. పక్కా కేరక్టర్ పడితే పూర్ణలో నటన ఎంతగా ఎలివేట్ అవుతుందో ఈ సినిమా మరో ఎగ్జాంపుల్. కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేసే నిజాయతీగల మహిళగా కనిపించారు పూర్ణ. కొడుకు కళ్ల ముందు ఆమెకు జరిగిన అన్యాయం, దానికి శివుడు కేరక్టర్ చేసిన న్యాయం… స్క్రీన్ మీద ఎమోషన్‌ని పండించాయి. జగపతిబాబుని ఈ కేరక్టర్‌లో ఎవరూ ఊహించరు. సినిమాని తన డైలాగులతో డ్రైవ్ చేసే స్వామీజీ కేరక్టర్‌ని భేషుగ్గా పండించారు జగ్గూభాయ్. ధర్మబద్ధుడైన పీఠాధిపతిని చంపి ఆ స్థానాన్ని చేజిక్కించుకున్న దొంగ స్వామీజీ కేరక్టర్ చేసిన వ్యక్తి కూడా క్రూరత్వాన్ని పండించారు. ఈ సినిమాలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన కేరక్టర్ వరదరాజులుగా నటించిన శ్రీకాంత్. అతని కాస్ట్యూమ్స్ నుంచి ప్రతిదీ ఆ కేరక్టర్‌ని ఎలివేట్ చేసింది. జొన్న సంగటి కలుపుకునే తీరు, అక్కడ కూర్చున్న తీరు, అతను చెప్పిన తల భోజనం, పూర్ణ మీద అతను చేసే అఘాయిత్యం, ఇంటర్వెల్‌లో బాలయ్యతో తలపడే సీన్లు… వేటికవే ప్రత్యేకంగా అనిపించాయి.
యాక్షన్‌ని అస్సలు ఇష్టపడని వాళ్ల సంగతి చెప్పలేం కానీ, పక్కా మాస్ సినిమాలో ఉండే యాక్షన్‌ని ఇష్టపడేవారికి బాగా నచ్చుతాయి ఫైట్లు. బాలయ్య పట్టుకున్న శూలం, దాన్ని బేస్ చేసుకుని కంపోజ్ చేసిన ఫైట్లు, కర్రలతోనూ, కత్తులతోనూ, శూలంతోనూ, గన్నులతోనూ బాలయ్య చేసిన ఫైట్లు ఫ్యాన్స్ కి పూనకం తెప్పిస్తాయి. ఫైట్లను స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన క్రెడిట్ కచ్చితంగా తమన్‌దే. ఓ వైపు ఎమోషనల్ సీన్‌కి తగ్గ మ్యూజిక్ ఇస్తూనే, మరోవైపు మాస్‌కి నచ్చిన బీట్స్ ని ట్రెమండస్‌గా ప్లే చేశారు తమన్. పాటలు కూడా సందర్భోచితంగా ఉన్నాయి. శివ తత్వాన్ని, ప్రమథగణాలను, నందిని ప్రస్తావించిన తీరు మెప్పిస్తుంది.
ఆర్‌ఆర్‌లో వినిపించే శ్లోకాలు, గర్భగుడిలో ఉన్న మూర్తులు, దేవుళ్లు, గుళ్ల ప్రాశస్త్యం, ధర్మాన్ని కాపాడాల్సిన తరుణం… ఈ విషయాలన్నిటినీ బాలయ్య చెప్పిన తీరు ఇంకోసారి వినాలనిపించేలా ఉంది. వరదరాజులు మీద అటాక్ చేసినప్పుడు చక్రబంధనం చేయడమనే కాన్సెప్ట్ కూడా స్క్రీన్ మీద కొత్తగా ఉంది. బంధాలకు అతీతమైన వాళ్లు కూడా చిన్న పిల్లల పిలుపుకు కట్టుబడతారని చెప్పిన విధానం కూడా కన్విన్సింగ్‌గా అనిపించింది. తల్లి ప్రేమ, బిడ్డ పిలుపు, కుటుంబం అండ, దేవుడి మీద నమ్మకం, ప్రకృతిని ప్రేమించాలనే ధ్యాస, దుష్టనాశనం…. ఇన్నిటిని సమపాళ్లలో మేళవించి చేసిన సినిమా అఖండ.
డైరక్టర్ బోయపాటి శ్రీను చెప్పాలనుకున్న విషయాన్ని, ఆ మూడ్‌ని… కెమెరా అద్భుతంగా ఎలివేట్ చేసింది. కాస్ట్యూమ్స్, కెమెరా, మ్యూజిక్, డైలాగ్స్… అన్నిటినీ మించి లొకేషన్స్, సెట్స్, ఎలివేషన్స్… సినిమాకు ప్లస్ అయ్యాయి. నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డికి సినిమా మీద ఉన్న ప్యాషన్ స్క్రీన్ మీద కనిపించింది. ప్రతి షాట్‌కోసం పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది.
కొన్ని కాంబినేషన్లు స్క్రీన్ మీదకు వస్తున్నాయంటే ప్రేక్షకుల అంచనాలు ఇంకో రేంజ్‌లో ఉంటాయి. ఆ రేంజ్‌ని పీక్స్ లో చూపించే కాంబినేషన్ బాలకృష్ణ- బోయపాటి శ్రీను సొంతం. వాళ్లిద్దరి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’. ఫస్ట్ రోజు థియేటర్ల ముందు పండగ శోభను రిఫ్లెక్ట్ చేసిన సినిమా. బీబీ కాంబోకి హ్యాట్రిక్ హిట్‌ను ‘అఖండ’ అందించిందనే మాట గట్టిగా వినిపిస్తోంది.
– డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read..
Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’
Jai Bhim Review: ప్రశ్నించే గళం ఉంటే… ఫలితం తప్పకుండా ఉంటుందనే `జై భీమ్`