జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడం వివాదం ముదురుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం నిజమేనని తేల్చి చెప్పింది. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగాలని ముందే చెబుతారని, అందుకు అంగీకరిస్తేనే సినిమాల్స్ ఛాన్స్ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు. పైగా ఇందుకు ‘అడ్జస్ట్‌మెంట్స్, ‘కాంప్రమైజ్’ అనే పదాలు వాడటం మాలీవుడ్‌లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది. సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడుల నడుమ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
వేదింపుల పరంపరలో నటుడు, రాజకీయ నాయకుడు ముఖేష్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఇక ఇప్పటికే డైరెక్టర్ రంజిత్, నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)కు రాజీనామా చేశారు. తాజాగా AMMA అధ్యక్షుడు మోహన్‌లాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ AMMA ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తున్నట్లు మోహన్‌లాల్ పేర్కొన్నారు. మరో 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించి, కొత్త కమిటీ ఏర్పాటవుతుందని AMMA అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
సీనియర్ నటుడు సిద్దిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఆయన కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలను చేస్తుందని.. కావాలని తన పరువు, మర్యాదలకు భంగం కలిగిస్తుందని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడు రంజిత్ కూడా.. కొద్ది రోజుల క్రితం బెంగాలీ నటి తనపై చేసిన ఆరోపణలకుగానూ తీవ్రంగా స్పందించారు. అయితే హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్‌పై మరికొందరు నటీమణులు మీడియా ముందుకొచ్చి తమ అనుభవాలు పంచుకున్నారు.