
తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఒక చెన్నై భామ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. మన దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా, ఆమెలోని ప్రతిభను గుర్తించిన బాలీవుడ్ మేకర్స్ ఏకంగా ఒక స్టార్ హీరో సరసన అవకాశం ఇస్తున్నారు. భరతనాట్యం తెలిసిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ముంబై ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రష్మిక, సమంత లాంటి వారు ఉత్తరాదిన జెండా పాతగా.. ఇప్పుడు ఈ ‘నెమలి’ కూడా అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
చెన్నైకి చెందిన ప్రీతీ ముకుందన్ టాలీవుడ్‌లో ‘కన్నప్ప’ సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ పాన్ ఇండియా సినిమాలో ఆమె ‘నెమలి’ అనే పాత్రలో కనిపించి తనవంతు ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ప్రీతీకి రావాల్సిన గుర్తింపు రాలేదు. నిజానికి ఆమె మొదటి సినిమా శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ భుష్’. ఆ సినిమాలో నటించినా చాలామందికి ఆమె పేరు తెలియదు. తమిళ, మలయాళ భాషల్లో కూడా ప్రయత్నాలు చేసినా ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. అయితేనేం, ఈ భామకు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.
Preity Mukhundhan
బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆయన సరసన నటించే హీరోయిన్లకు అక్కడ మంచి డిమాండ్ ఉంటోంది. ప్రస్తుతం కార్తీక్ హీరోగా రెండు పెద్ద సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం కాగా, మరొకటి ‘నాగ్ జిల్లా’ అనే మూవీ. ఈ రెండింటిలో ఒక సినిమాలో హీరోయిన్ గా ప్రీతీ ముకుందన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బాలీవుడ్ మేకర్స్ సౌత్ హీరోయిన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రష్మిక మందన్న, సమంత, కీర్తి సురేష్, శ్రీలీల వంటి భామలకు అక్కడ మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పుడు అదే జాబితాలో ప్రీతీ ముకుందన్ కూడా చేరబోతున్నారు. బాలీవుడ్ లో ఒక చిన్న ఛాన్స్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రీతీకి ఏకంగా కార్తీక్ ఆర్యన్ సినిమాలో అవకాశం రావడం నిజంగా విశేషమే.
Kartik Aaryan And Preity Mukhundhan
ఈ అవకాశం గనుక సద్వినియోగం చేసుకుంటే ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగే అవకాశం ఉంది. ప్రీతీ ముకుందన్ కేవలం అందగత్తె మాత్రమే కాదు, మంచి విద్యావంతురాలు కూడా. ప్రతిష్టాత్మకమైన నిట్ (NIT) లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువుతో పాటు చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ పొందారు. ఒక ఇంజనీర్ గా, క్లాసికల్ డ్యాన్సర్ గా ఆమెకు ఉన్న క్రమశిక్షణే ఆమెను ఇక్కడి వరకు తీసుకువచ్చాయి.
అటు చదువును, ఇటు కళను సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న ఈ చెన్నై బ్యూటీ బాలీవుడ్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఒక ప్రయాణం. ‘కన్నప్ప’లో నెమలి పాత్రతో సరిగ్గా రీచ్ అవ్వలేకపోయినా, బాలీవుడ్ లో తన గమ్యాన్ని వెతుక్కుంటున్న ప్రీతీ ముకుందన్ కు అదృష్టం కలిసి రావాలని ఆశిద్దాం. కార్తీక్ ఆర్యన్ లాంటి హిట్ హీరో సరసన ఆమె జోడీ కుదిరితే అక్కడ పాగా వేయడం ఖాయం.