Kriti Sanon : కృతి సనన్ యాడ్ వివాదం.. కంగనాకు కౌంటరిచ్చిన హీరోయిన్.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?

రాఖీ యాడ్‌.. ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించిన ఈ యాడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కంగనా కామెంట్‌. కృతి కౌంటర్‌. రాహుల్‌ ఎంట్రీ. కంగనా రిప్లై. చివరకు యాడ్‌ తొలగింపు. ఇదంతా కేవలం బాలీవుడ్‌ ఫైట్‌ మాత్రమేనా? లేక సోషల్‌ మీడియా కాలంలో కాంట్రవర్సీనే కొత్త పబ్లిసిటీ గేమా అనే చర్చ సాగుతోంది.

Kriti Sanon : కృతి సనన్ యాడ్ వివాదం.. కంగనాకు కౌంటరిచ్చిన హీరోయిన్.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
Kriti Sanon, Kangana Ranaut

Edited By:

Updated on: Aug 26, 2026 | 6:58 PM

కంగనా మాట్లాడితే వివాదం మొదలవుతుంది. కానీ ఆ వివాదం ఎక్కడ ఆగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ పేరు చెబితే సినిమాల కంటే ముందు ఆమె మాటలు గుర్తొస్తాయి. ఏ విషయం మీదైనా నేరుగా మాట్లాడటం. పెద్ద స్టార్లను ప్రశ్నించడం. సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడం. ఇదే ఆమె స్టైల్‌. తాజాగా కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. జ్యువెలరీ బ్రాండ్‌ GIVA కోసం కృతి సనన్‌ చేసిన రక్షాబంధన్‌ ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. రాఖీ వంటి పండుగకు ఆ లుక్‌ సరిపోదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కంగనా కూడా స్పందించారు. ఆ దుస్తులతో సోదరుడికి రాఖీ కట్టడం ఎందుకని ప్రశ్నించారు. యాడ్‌ను ఇంటెన్షనల్‌గా క్రీపీగా అభివర్ణించారు.

ఇక్కడితో విషయం ముగిసిపోలేదు..
కృతి సనన్‌ కూడా గట్టిగానే స్పందించారు. ఒక మహిళ ఏం వేసుకోవాలనే విషయాన్ని ఇతరులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పండుగ అంటే దుస్తులు కాదు. మనసులో ఉన్న భావం, సంప్రదాయంపై గౌరవం అని చెప్పారు. ఆమె మాటల్లో ప్రధానంగా వ్యక్తిగత స్వేచ్ఛ కనిపించింది. అంటే ఇక్కడ రెండు వాదనలు ఎదురెదురుగా వచ్చాయి. పండుగకు తగ్గట్టు ఉండాలన్న వాదన ఒక వైపు.. మహిళ దుస్తులు ఆమె ఇష్టమన్న వాదన మరో వైపు. ఇంతలో ఈ గొడవలోకి రాజకీయ రంగు వచ్చింది.

రాహుల్ మద్దతు…

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కృతికి మద్దతుగా నిలిచారు. ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలన్నది ఆమె నిర్ణయమేనని పోస్టు చేశారు. ఆన్‌లైన్‌లో మహిళలను టార్గెట్‌ చేయొద్దని సూచించారు. అక్కడితో కంగనా కూడా ఆగలేదు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఆమె వ్యంగ్యంగా స్పందించారు. దీంతో కృతి–కంగనా వివాదం కాస్తా కంగనా–రాహుల్‌ రాజకీయ మాటల పోరుగా మారింది. కంగనా బీజేపీ ఎంపీ కావడంతో ఈ అంశానికి మరింత రాజకీయ రంగు వచ్చింది. చివరకు GIVA ఆ యాడ్‌ను తొలగించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నామని.. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని చెబుతూ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఎవరితో అన్నది పక్కన పెడితే ఇప్పుడు యాడ్ తీసేశారు కాబట్టి సమస్య తొలగింది.

కంగనా కాంట్రవర్సీలు కొత్త కాదు

కంగనా చుట్టూ వివాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2017లో కరణ్‌ జోహార్‌ షోలో పాల్గొన్న కంగనా.. బాలీవుడ్‌లో నెపోటిజంపై గట్టిగా మాట్లాడారు. కరణ్‌ను నెపోటిజానికి పెద్ద ప్రతినిధిగా, సినిమా మాఫియాలో భాగంగా విమర్శించారు. ఆ మాటలు పెద్ద చర్చకు దారి తీశాయి. కరణ్‌ కూడా తర్వాత కంగనాపై ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత IIFA వేడుకలో కరణ్‌ జోహార్‌, వరుణ్‌ ధావన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ కలిసి నెపోటిజంపై చేసిన జోక్‌ వివాదంగా మారింది. సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో వరుణ్‌ క్షమాపణ చెప్పారు. కరణ్‌ జోహార్‌ కూడా ఆ జోక్‌ తప్పుగా వెళ్లిందని అంగీకరించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కంగనా చేసిన ఒక్క కామెంట్‌తో మొదలైన నెపోటిజం చర్చ. తర్వాత బాలీవుడ్‌లో పెద్ద డిబేట్‌గా మారింది.

బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌కు అవకాశాలు ఎక్కువా? బయట నుంచి వచ్చిన వారికి సమాన అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

హృతిక్‌ రోషన్‌తో కంగనా వివాదం మాటల నుంచి కేసుల వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య సంబంధాలపై మొదలైన మాటల యుద్ధం.. తర్వాత ఈమెయిల్స్‌, పోలీస్‌ ఫిర్యాదులు, న్యాయ పోరుగా మారింది. 2016లో ఈ కేసు దర్యాప్తుపై భిన్న వార్తలు వచ్చాయి. ఒక దశలో కేసు ముగిసిందన్న సమాచారం వచ్చింది. తర్వాత హృతిక్‌ తరఫు న్యాయవాదులు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
అంటే కంగనా వివాదం అక్కడ సోషల్‌ మీడియా దగ్గర ఆగలేదు. పోలీసుల వరకు వెళ్లింది.

జావేద్‌ అఖ్తర్‌తో గొడవ .. ఐదేళ్ల తర్వాత ముగింపు

కంగనా–జావేద్‌ అఖ్తర్‌ వివాదం కూడా ఇలాగే సాగింది. 2020లో మొదలైన పరువు నష్టం కేసులు కోర్టుకు వెళ్లాయి. 2024లో కంగనా వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. చివరకు 2025లో ఇద్దరూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకున్నారు. ఐదేళ్లకు పైగా సాగిన న్యాయ పోరుకు తెరపడింది.

రైతు ఉద్యమం.. రాజకీయ మలుపు

రైతు ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదానికి దారి తీశాయి. 2024లో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ CISF మహిళా సిబ్బంది కంగనాను చెంపదెబ్బ కొట్టింది. రైతుల ఉద్యమంపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలే కారణమని ఆ మహిళ చెప్పింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. తర్వాత కూడా రైతుల అంశంపై కంగనా చేసిన కొన్ని వ్యాఖ్యలపై బీజేపీ నుంచి కూడా స్పందన వచ్చింది. సినిమా నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన తర్వాత కంగనా మాటలకు ఇంకో బరువు వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా అది కేవలం సినిమా వార్త కాదు. అది రాజకీయ వార్త కూడా అవుతోంది.

కంగనా తప్పు చేస్తుందా అనే చర్చ లేకపోలేదు. కంగనా లేవనెత్తే ప్రతి ప్రశ్న తప్పు అని చెప్పలేం.

నెపోటిజంపై ఆమె ప్రశ్నలు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి. సినిమా పరిశ్రమలో బయట నుంచి వచ్చే వారికి అవకాశాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆమె మాట్లాడే తీరు.. వ్యక్తిగతంగా చేసే కామెంట్లు.. కొన్నిసార్లు అసలు సమస్యను పక్కకు నెట్టి కొత్త వివాదానికి కారణమవుతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ప్రశ్నించడం ఒక హక్కు.. కానీ ప్రశ్నించే భాష కూడా అంతే ముఖ్యం అన్నది ఇక్కడ కీలకం.

కృతి తప్పు చేసిందా?

ఒక ప్రకటనలో ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించే హక్కు నటికి, బ్రాండ్‌కు ఉంటుంది. అదే సమయంలో పండుగను ఎలా చూపించారనే దానిపై ప్రేక్షకుడికి అభిప్రాయం చెప్పే హక్కు కూడా ఉంది. విమర్శ ఎంత వరక చేయాలి. వ్యక్తిగత తీర్పు ఎందుకనే గీత స్పష్టంగా లేకపోవడం వల్లే సోషల్‌ మీడియా గొడవలు పెద్దవవుతున్నాయి.

ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?

ఇక్కడ మరో కోణం ఉంది. ఒక సాధారణ రాఖీ యాడ్‌ విడుదలైంది. ఎంతమంది చూశారో తెలియదు.
కానీ కంగనా కామెంట్‌ తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడింది. కృతి స్పందించారు.రాహుల్‌ గాంధీ మాట్లాడారు. కంగనా మళ్లీ స్పందించారు. న్యూస్‌ ఛానళ్లలో చర్చ మొదలైంది. సోషల్‌ మీడియాలో పోస్టులు, వీడియోలు పెరిగాయి. చివరకు యాడ్‌ను GIVA తీసేసింది.అంటే యాడ్‌ తీసేసినా దాని‌ పేరు మాత్రం అందరి నోటికి వచ్చింది. ఇదే కాంట్రవర్సీ పబ్లిసిటీకి ఉన్న బలం. అయితే ప్రతి వివాదం సినిమా లేదా బ్రాండ్‌కు లాభం తెస్తుందని మాత్రం చెప్పలేం. కొన్ని సార్లు పేరు వస్తుంది. మరికొన్ని సార్లు బ్రాండ్‌కు నష్టం వస్తుంది. ఇంకొన్ని సార్లు నటుడి ఇమేజ్‌ దెబ్బతింటుంది. అదే వివాదం అతడికి లేదా ఆమెకు మరింత గుర్తింపు తెస్తుంది.

సోషల్‌ మీడియా పోలీసింగ్‌.. కొత్త సమస్య

ఇప్పుడు అసలు చర్చ ఇక్కడే. సెలబ్రిటీలు తమ అభిప్రాయం చెప్పొచ్చు. ప్రజలు కూడా విమర్శించొచ్చు. కానీ సోషల్‌ మీడియా గుంపు ఒక వ్యక్తిని టార్గెట్‌ చేయడం మొదలైతే? ఒక బ్రాండ్‌ యాడ్‌ను తీసేయాలని వేల మంది డిమాండ్‌ చేస్తే? ఒక నటుడు లేదా నటి ఏ దుస్తులు వేసుకోవాలో సోషల్‌ మీడియానే నిర్ణయిస్తే? ఇది ప్రజల అభిప్రాయమా? లేక సోషల్‌ మీడియా పోలీసింగ్‌నా?
ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఈ వివాదంలో ఎవరికీ లాభం?

కంగనాకు మళ్లీ జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కృతికి మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై తన మాట చెప్పే అవకాశం చిక్కింది. రాహుల్‌ గాంధీకి మహిళల హక్కులపై తన రాజకీయ సందేశాన్ని చెప్పే వేదిక దొరికింది. GIVAకు మాత్రం ఒకవైపు నష్టం.. మరోవైపు భారీగా పేరు వచ్చింది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం. ఒక సాధారణ పండుగ యాడ్‌.. దేశవ్యాప్తంగా చర్చగా మారింది.
అందుకే దీన్ని కేవలం కంగనా వర్సెస్‌ కృతి అని చూడటం సరిపోదు. ఇది సెలబ్రిటీ స్వేచ్ఛ వర్సెస్‌ సామాజిక భావాలు. ఇది సంప్రదాయం వర్సెస్‌ కొత్త ఆలోచన. ఇది విమర్శ వర్సెస్‌ సోషల్‌ మీడియా పోలీసింగ్‌ అని చెప్పాలి. ఇదే సమయంలో ఇది కాంట్రవర్సీ వర్సెస్‌ పబ్లిసిటీ కూడా.

ఎవరు గెలిచారు?

కంగనా కాదు. కృతి కాదు. రాహుల్‌ కాదు. ఓడిపోయింది కూడా ఒక్కరే అని చెప్పలేం. గెలిచింది మాత్రం..కాంట్రవర్సీకి ఉన్న పవర్‌. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ప్రకటనను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు. కానీ ఒక సెలబ్రిటీ వివాదం మొదలైతే.. పబ్లిసిటీ మాత్రం ఫ్రీగా వచ్చేస్తుంది. అందుకే బాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ప్రశ్న ఇదే. ఫైట్‌ నిజమా? లేక ఫేమ్‌ కోసం కాంట్రవర్సీ కొత్త షార్ట్‌కట్‌నా అంటే సమాధానం ఒక్కటిగా ఉండకపోవచ్చు. కానీ కంగనా–కృతి వివాదం మాత్రం ఒక విషయం మరోసారి చూపించింది. సోషల్‌ మీడియా కాలంలో ఒక మాటే యాడ్‌ను మార్చగలదు. ఒక కాంట్రవర్సీనే దేశవ్యాప్త చర్చగానూ చేయగలదు.

Loading...
Unable to load recommendations.
Follow Us