Jabardasth Rajamouli: ఆయన నాకోసం ప్రొడ్యుసర్ కాళ్ల మీద పడ్డారు.. లేదంటే చనిపోయేవాడిని.. జబర్దస్త్ రాజమౌళి కామెంట్స్..

బుల్లితెరపై ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో. అందులో రాజమౌళి ఒకరు. తనదైన కామెడీ పంచ్ డైలాగ్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో, కోవిడ్ కష్టకాలంలో బోలే అందించిన అపూర్వ సహకారాన్ని వెల్లడించారు. సినిమా అవకాశం కోసం నిర్మాత కాళ్లు పట్టుకోవడం నుండి, కోవిడ్ సమయంలో లక్షల రూపాయలు, ఆహారం అందించి ప్రాణాలు కాపాడటం వరకు, వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది.

Jabardasth Rajamouli: ఆయన నాకోసం ప్రొడ్యుసర్ కాళ్ల మీద పడ్డారు.. లేదంటే చనిపోయేవాడిని.. జబర్దస్త్ రాజమౌళి కామెంట్స్..
Jabardasth Rajamouli

Updated on: Oct 30, 2026 | 9:03 PM

జబర్దస్త్ రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ తన జీవితంలోని ఒక మరచిపోలేని సంఘటనను పంచుకున్నారు. 16 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి ప్రవేశించాలనే కోరికతో ఒక సినిమా ఆఫీస్‌కు వెళ్ళిన రాజమౌళికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని లోపలికి అనుమతించకుండా బయటికి నెట్టేశారు. బోలే గారు తనను పరిచయం చేసేందుకు ముందు వెళ్ళగా, రాజమౌళి ఆయన వెనుక వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. చివరికి, బోలే తాను నటుడని చెప్పడంతో లోపలికి అనుమతించారు. లోపల, నిర్మాత, దర్శకుడు, బోలే గారు మాట్లాడుతుండగా రాజమౌళి సరదాగా “బోలే సార్ వచ్చాడా?” అని అడిగారు. అది బోలే గారు ఏర్పాటు చేసిన ఒక పరీక్ష అని తెలియని నిర్మాత, దర్శకుడు రాజమౌళిని బయటికి పంపించమని ఆగ్రహించారు. ఆ సమయంలో బోలే గారు వారి కాళ్లు పట్టుకుని, “క్షమించండి సార్. తమ్ముడు మంచి ఆర్టిస్ట్. మీ ముందు తన నటనను చూపించడానికే ఇలా చేశాను. దయచేసి ఈ అబ్బాయికి అవకాశం ఇవ్వండి” అని వేడుకున్నారు. ఆ మహానుభావుడు తన కోసం నిర్మాత, దర్శకుల కాళ్లు మొక్కడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని రాజమౌళి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన తర్వాత శ్రీహరి గారి “యమహో యమ” చిత్రంలో నటించే అవకాశం లభించిందని, ఆ చిత్ర దర్శకుడు జితేందర్ గొప్పవారని ఆయన ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు యలందర్ సంగీత దర్శకత్వంలో “జాతరకొచ్చిన హీరోలు” అనే మినీ మూవీలోనూ నటించారు.

బోలే గారు కేవలం కెరీర్ ఆరంభంలోనే కాకుండా, రాజమౌళి జీవితంలోని అత్యంత క్లిష్ట పరిస్థితులలోనూ అండగా నిలిచారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, రాజమౌళికి కరోనా సోకి పరిస్థితి విషమంగా మారినప్పుడు, రాత్రి 12 గంటల సమయంలో వర్షం పడుతున్నా లక్ష రూపాయల అడ్మిషన్ ఫీజు చెల్లించి కూకట్‌పల్లి పద్మజ హాస్పిటల్‌లో చేర్పించారు. అంతేకాకుండా, ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు ఇచ్చి వెళ్లారు. అప్పుడు ఆయనకు షుగర్ స్థాయిలు 573 శాతానికి పెరిగి చికిత్సకు శరీరం సహకరించడం లేదు. అలాంటి సమయంలో బోలే గారి భార్య పచ్చజొన్నలు కొనుక్కొచ్చి, గ్రైండ్ చేసి గడక వండి, మటన్ లేదా చికెన్ కూర చేసి రాజమౌళికి తినిపించారు. దీనివల్ల షుగర్ స్థాయిలు తగ్గి, చికిత్సకు శరీరం స్పందించడం మొదలైంది.

ప్రతిరోజూ బోలే గారు, భయం లేకుండా కోవిడ్ హాస్పిటల్‌కు వచ్చి రాజమౌళికి ఆహారం అందించారు. ఆయన రాలేని సమయాలలో తన అసిస్టెంట్ లేదా డ్రైవర్‌ను పంపేవారు. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కు బాధ్యత వహించే ప్రభు సురేష్‌తో మాట్లాడి, రాజమౌళికి సరైన చికిత్స అందేలా చూశారు. “ఈ అబ్బాయికి ఏమైనా అయితే, రెండు రాష్ట్రాల్లో ఉన్న తన అభిమానులు వచ్చి మీ ఆసుపత్రిని కూలుస్తారు. మీకు పైసలు ఎలా ముఖ్యమో, ఆయన ప్రాణం అంతే ముఖ్యం. ఆయనకు సరైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలి” అని గట్టిగా చెప్పిన బోలే గారి మాటలు తన ప్రాణాలను నిలబెట్టాయని రాజమౌళి వెల్లడించారు. రుణం తిరిగి చెల్లించే సందర్భంలో బోలే గారు చూపిన మానవత్వం రాజమౌళిని మరింత కదిలించింది. “నువ్వు ఏడుస్తూ డబ్బులు తీసుకుపోయావు. నవ్వుతూ వచ్చి నాకు ఇవ్వు, అప్పటిదాకా నాకు ఇవ్వద్దు” అని బోలే గారు అన్నప్పుడు రాజమౌళి కళ్లల్లో నీళ్లు నిండాయి. తను డబ్బులు తిరిగి ఇచ్చి, బోలే గారు, వారి భార్య ఆశీర్వాదం తీసుకుని, “నాకు పునర్జన్మనిచ్చారు సార్” అని చెప్పినప్పుడు, వారిరువురూ భావోద్వేగానికి లోనయ్యారు. బోలే గారు గొప్ప అన్నదాత అని, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడమే తన ధ్యేయమని రాజమౌళి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Loading...
Unable to load recommendations.
Follow Us