AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన టాలెంట్‌తో పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య.. ప్లానింగ్‌లో తనకు తానే సాటి

స్టార్ హీరో భార్య, కోట్లలో సంపాదన అయితేనేం.. తన ఆసక్తికి తగినట్టుగా, టాలెంట్‌, సమయం వృథా చేయరు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో రాణిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే, టూరిస్టులకు మంచి ఫీల్ పంచాలనే ఆలోచన చేసి పాత ఇంటిని లగ్జరీ హౌస్‌గా మార్చేశారు.

తన టాలెంట్‌తో పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య.. ప్లానింగ్‌లో తనకు తానే సాటి
Interior In Luxury House
Nikhil
|

Updated on: Feb 12, 2026 | 10:47 AM

Share

ఆమె బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సతీమణి మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇంటీరియర్ డిజైనర్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లగ్జరీ హోమ్స్, ఆఫీసులను తన డిజైన్లతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఆమె.. ఈసారి ఒక అత్యంత వ్యక్తిగతమైన ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇది కేవలం ఒక డిజైన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఆమె చిన్ననాటి జ్ఞాపకాలకు ప్రతిరూపం. వేసవి సెలవుల్లో తన కజిన్స్‌తో కలిసి కేరింతలు కొట్టిన ఆ పురాతన భవనాన్ని.. ఇప్పుడు ఒక లగ్జరీ రిట్రీట్‌గా మార్చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని మంచు కొండల మధ్య ఉన్న ఈ సుందరమైన భవనం ఇప్పుడు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. అడుగు పెడితే రాజసం ఉట్టిపడేలా, కళ్లు చెదిరే ఇంటీరియర్స్ తో ముస్తాబైన ఆ ఇంటి విశేషాలేంటో తెలుసుకుందాం..

వంద ఏళ్ల వారసత్వం..

డల్హౌసీ నడిబొడ్డున ఉన్న ఈ ఆరు బెడ్ రూమ్ ల విల్లా పేరు ‘ద చెస్ట్ నట్ గ్రోవ్’. ఇది గౌరీ ఖాన్ మేనమామ తేజిందర్ తివారీకి చెందిన ఆస్తి. 1933లో గౌరీ ఖాన్ ముత్తాత సూరజ్ భాన్ తివారీ ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. సుమారు 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం దశాబ్దాలుగా వారి కుటుంబ వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. తన బాల్యంలో ప్రతి వేసవిని గౌరీ ఖాన్ ఇక్కడే గడిపారు. తన తల్లి సవితా చిబ్బాతో కలిసి ఇక్కడ గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, తన కజిన్ రుస్తమ్ తివారీతో కలిసి ఈ ఇంటిని పునర్నిర్మించారు.

Interior In Luxury House 3

Interior In Luxury House 3

లగ్జరీ, ప్రైవసీకి కేరాఫ్..

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంతో పర్యాటకులకు అద్దెకు అందుబాటులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వేదిక. ఇక్కడ ఒక్క రాత్రి బస చేయడానికి సీజన్‌ను బట్టి రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మొత్తం విల్లాను బుక్ చేసుకోవాలంటే రాత్రికి రూ. 1.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం బొటిక్ కేటగిరీలో ఉన్న ఈ ప్రాజెక్ట్.. పర్యాటకులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందిస్తోంది.

పచ్చని చెట్లు, ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఇంటిని గౌరీ ఖాన్ ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ప్రధాన లివింగ్ ఏరియాలో అద్దాల గోడలు ఉండటం వల్ల సహజ సిద్ధమైన వెలుతురుతో పాటు బయట ఉన్న అందమైన కొండలు కనిపిస్తాయి. పెద్ద ఫైర్ ప్లేస్, సౌకర్యవంతమైన సోఫాలు ఇంటికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ప్రతి బెడ్ రూమ్ లోనూ ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రైవేట్ గార్డెన్స్ ఉన్న రూమ్స్, కింగ్ సూట్, అటిక్ సూట్ వంటివి ఇక్కడ ఉన్నాయి. గోడలు, పైకప్పులకు చెక్కతో చేసిన ఫినిషింగ్, రాతి మూలకాలు పాతకాలపు అందాన్ని, ఆధునిక లగ్జరీని ఒకేసారి ప్రతిబింబిస్తాయి. డైనింగ్ ఏరియా పైభాగంలో ఉన్న స్కైలైట్ ద్వారా ప్రకృతిని వీక్షించే వీలుంటుంది.

Gowri Khan

Gowri Khan

జ్ఞాపకాలకు ప్రాణం పోస్తూ..

ఈ ప్రాజెక్ట్ గురించి రుస్తమ్ తివారీ మాట్లాడుతూ.. గౌరీ ఖాన్ కేవలం ఒక డిజైనర్‌గా మాత్రమే కాకుండా, ఈ ఇంటితో ఉన్న భావోద్వేగ బంధాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా పనిచేశారని తెలిపారు. పాత ఇంటి ఆత్మ దెబ్బతినకుండా, ఆధునిక కాలపు అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయడం ఒక సవాలుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కేవలం ఫార్మాలిటీ కోసం కాకుండా, అతిథులకు సొంత ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించడమే ఈ డిజైన్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. చిన్ననాటి జ్ఞాపకాలను విస్మరించకుండా, తన వృత్తి నైపుణ్యాన్ని జోడించి గౌరీ ఖాన్ రూపొందించిన ఈ ‘ద చెస్ట్ నట్ గ్రోవ్’ ఇప్పుడు డల్హౌసీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ తన మూలాలను గౌరవించే ఆమె తీరు నిజంగా అభినందనీయం.