
గత నెల నుంచే పలు భాషల్లో సీరియళ్ల షూటింగ్‌లు ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను పాటిస్తూ బుల్లితెర నటీనటులు షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. కాగా ఇటీవల ఓ హిందీ సీరియల్ షూటింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ముంబయిలోని చందీవాలీలో ఉన్న కిల్లిక్ నిక్సన్ స్టూడియోలో కుంకుమ్ భాగ్య సీరియల్ షూటింగ్‌లో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది సీరియల్ టీమ్‌ను కాపాడారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ సంఘటనపై సీరియల్ నిర్మాతలు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ”టాలెంట్, ప్రొడక్షన్ సభ్యులు, ఉద్యోగులను కాపాడుకోవడమే మా మొదటి ప్రాధాన్యత. నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటాం. ఇకపై కూడా అన్ని జాగ్రత్తలను తీసుకుంటాం” అని వెల్లడించింది. కాగా రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్‌ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. స్రితి జా షాబ్బీర్ అహ్లూవాలియా, పూజా బెనర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హిందీలో బాగా ఆదరణ పొందుతున్న సీరియల్‌లో ‘కుంకుమ్ భాగ్య’ కూడా ఒకటి.