1983 సంవత్సరం భారత క్రికెట్ కు అత్యంత ముఖ్యమైన ఏడాది. ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం అది. ఎందుకంటే ఆ రోజు 1983లో టీమిండియా మొదటి ప్రపంచ కప్ గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్స్ వెస్టిండీస్ ను ఓడించి మొదటి ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది. తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు స్వదేశానికి తిరిగి వస్తుంది. ఆ సమయంలో వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. కానీ అప్పుడు బీసీసీఐ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు సరిపడా డబ్బు లేదు. దీంతో వారంతా ఢిల్లీలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కచేరీ నిర్వహించి నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని లతా మంగేష్కర్ కు చెప్పగా.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆమె సంగీత కచేరిలో పాల్గొన్నారు.
ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు నిధులను బీసీసీఐ సేకరించింది. ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్‌కు బీసీసీఐ పెద్ద కానుక ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు.
కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాట రాయడం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.