Sirivennela: సిరివెన్నెల తెలుగు సినీ కవి కావడం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం.. వైరల్‌ అవుతోన్న త్రివిక్రమ్‌ పాత స్పీచ్‌.

|

Dec 01, 2021 | 6:49 AM

Sirivennela Seetharama Sastry: అశేష అభిమానులను తీవ్ర శోక సంద్రంలో ముంచి తనువు చాలించారు సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతరామశాస్త్రి. ఆయన లేరన్న వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు...

Sirivennela: సిరివెన్నెల తెలుగు సినీ కవి కావడం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం.. వైరల్‌ అవుతోన్న త్రివిక్రమ్‌ పాత స్పీచ్‌.
Trivikram About Sirivennela
Follow us on

Sirivennela Seetharama Sastry: అశేష అభిమానులను తీవ్ర శోక సంద్రంలో ముంచి తనువు చాలించారు సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతరామశాస్త్రి. ఆయన లేరన్న వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన మంగళవారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలుగు పాట స్థాయిను పెంచుతూ, అద్భుతమైన రచనలతో తనదైన శైలిలో ఎన్నో అద్భుత పాటలకు ప్రాణం పోశారు సిరివెన్నెల. ఆయన కలం నుంచి జాలు వారిన ప్రతీ పాట ఒక్క అద్భుతమే. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఆయన కలం మారుతూ వచ్చింది. నిగ్గదీసి అడుగు అంటూ సమాజాన్ని ప్రశ్నించినా.. ప్రేయసి, ప్రియుల ప్రేమ బంధాన్ని వివరించే పాటలు రాసినా ఆయనకే చెల్లింది. ఇదిలా ఉంటే సిరివెన్నెల భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు ఇంకా సజీవంగా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సిరివెన్నెలకు సంబంధించిన పాత వీడియోలు కొన్ని నెట్టింట మళ్లీ వైరల్‌ అవుతున్నాయి.

అలాంటి వీడియోల్లో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ది ఒకటి. గతంలో జరిగిన మా మ్యూజిక్‌ అవార్డ్స్‌లో పాల్గొన్న త్రివిక్రమ్‌ సిరివెన్నెల గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పిన ఓ స్పీచ్‌ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో సిరివెన్నెల సాహిత్యం గొప్పదనాన్ని త్రివిక్రమ్‌ అద్భుతంగా వివరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ‘సీతారామశాస్త్రిగారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే ‘సిరివెన్నెల’సినిమాలో రాసిన ‘ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన’ ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని ‘శబ్ద రత్నాకరం’ అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ అంటే ఏంటి? మయూఖం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి.

ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచంమీద వేటాడటానికి బయలుదేరతాడు. రండి నాకు సమాధానం చెప్పండి అంటాడు. మన ఇంట్లోకి వచ్చి మనల్ని పశ్నిస్తాడు. ఓటమిని ఒప్పుకోవద్దు అంటాడు. ఒక మనిషిని ఇంతలా కదిలించే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది. సిరివెన్నెల తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టం.. తెలుగు వారి అదృష్టం’అంటూ త్రివిక్రమ్‌ పలికిన మాటలను సిరివెన్నెల అభిమానులు మళ్లీ మళ్లీ వింటున్నారు.

Also Read: Mumbai Indians IPL 2022 Retained Players: ముంబై ఇండియన్స్ టీమ్ నుంచి ఆ ముగ్గురు ఔట్.. ఎవరు రిటైన్ అయ్యారంటే..

Unemployment: ఇంకా తగ్గని కరోనా ఎఫెక్ట్!.. దేశంలో పెరిగిన నిరుద్యోగం..

SRH IPL 2022 Retained Players: ఎస్ఆర్‌హెచ్ సంచలన నిర్ణయం.. వార్నర్, భువీ, రషీద్ ఖాన్ రిలీజ్..