Sampath Nandi: డైరెక్టర్ సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కిష్టయ్య కన్నుమూశారు. మంగళవారం రాత్రి తన నివాసంలో కిష్టయ్య తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ సినీప్రిముఖుల సంతాపం తెలుపుతున్నారు. సంపత్ నంది తెలుగులో ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు.

Sampath Nandi: డైరెక్టర్ సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్..
Sampath Mandi

Updated on: Nov 26, 2025 | 10:09 AM

తెలుగు దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కిష్టయ్య (73) మరణించారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కిష్టయ్య మృతిపై పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఏమైందీ ఈవేళ సినిమాతో తెలుగులోకి దర్శకుడిగా తెరంగేట్రం చేశారు సంపత్ నంది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తండ్రి మరణంపై సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు సంపత్ నంది.

“బాపు.. నువ్ లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా..

నువ్ లేకుండానే తెల్లారింది..
నువ్ లేకుండానే ఓదెల లేచింది..
నువ్ లేకుండానే ఇల్లూ లేచింది.
కల్లాపి తో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది..
“ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు..
“ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు
ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు!

చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది..
గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నెన్నే కదా అనిపిస్తోంది..

నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక..
మనం దున్నిన జంబు అరక..
పత్తి మందుకు పంపు..
పల్లి చేను లో సద్ది..
మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు..
ఇక అన్నీ జ్ఞాపకాలేనా?

దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు..
మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు..
ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా?

ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి..
నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో..

కానీ మళ్లీ రా..” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

సంపత్ నంది తెలుగులో రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2, బ్లాక్ రోజ్ వంటి చిత్రాలకు కథ అందించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న భోగి సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

 

Follow Us