రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. రజినీకాంత్ కెరీర్‌లోనే హైయస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రల్లో ఒకటిగా నిలిచిందీ మూవీ. రిటైర్డ్ అయిన ఓ జైలర్ జీవితంలో ఎదురైన సంఘటనలు, వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు ఈ సినిమాలో చూపించారు.
విడుదలైన అన్ని భాషల్లో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ మూవీ ఏకంగా రూ. 700 కోట్లు రాబట్టింది. చాలా రోజుల పాటు సరైన విజయం ఇబ్బందిపడ్డ రజినీకి ఈ సినిమా మంచి బూస్ట్‌ను ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ తెరెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటన చేసింది. అయితే సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ జైలర్2 చిత్రానికి సంబంధించి ఓ కీలక ప్రటకన చేశారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు నెల్సన్.. జైలర్2 సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం అందరూ వేచి ఉండండి అని నెల్స్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఓ వార్త వైరల్ అవుతోంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి జైలర్ 2 షూటింగ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే రజినీకాంత్ ప్రస్తుతం.. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ పతాకంపై యాక్షన్ డ్రామాగా ఇది రూపొందుతోంది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనితోపాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలి’లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు సమానంగా రజినీ జైలర్2 చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..