Dadasaheb Phalke award winner Rajnikanth: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajnikanth) ఎంపికవడంతో ఇపుడు చర్చంతా ఆ అవార్డు గురించే జరుగుతోంది. తమిళనాడు (Tamilnadu)లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రజనీకాంత్‌కు దాదాసాహెబ్ అవార్డు (Dadasaheb Award) ప్రకటించడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని అందరూ అనుకుంటున్నారు. తమిళనాట విశేష ప్రభావం చూపే వ్యక్తిగా రజనీకాంత్‌కు పేరుంది. ప్రతీ సారి ఎన్నికల వేళ ఆయన ఎవరికి మద్దతు ప్రకటిస్తారా అని మీడియా సంస్థలతోపాటు పలువురు ఎదురు చూస్తు వుంటారు. ఎవరికో మద్దతివ్వడమేంటి ఆయనే స్వయంగా రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు కదా అనుకున్న వారు.. ఆయన్ని ఒప్పంచేందుకు యధాశక్తి యత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్ ఫ్యాన్స్ (Rajnikanth Fans)కు గాలమేసేందుకు కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం ఆయనకు అకస్మాత్తుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిందన్న ప్రచారమూ గట్టిగానే జరుగుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో మే 2న గానీ తేలదు. అయితే.. ఇదే సందర్భంలో దాదాసాహెబ్ ఫాల్కే పుట్టుపూర్వోత్తరాల గురించి చర్చ మొదలైంది.
దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఏమిటి..? ఎందుకీ అవార్డు ఇస్తారు..? ఏమిస్తారనే చర్చ తాజాగా జోరందుకుంది. ప్రస్తుతం ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 51వ దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఇస్తున్నారు. పోయినేడాది ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్ఛన్ (Amitab Bachchan)ను ఈ అవార్డు వరించింది. తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు (Tamilnadu Assembly Elections) జరుగుతున్న సమయంలో కేంద్రం రజనీకాంత్‌కు ఈ అవార్డు ప్రకటించడం పొలిటికల్ చర్చకు దారి తీసింది. తమిళనాడులో ఏఐఏడీఎంకే (AIADMK)తో పొత్తు పెట్టుకుంది కమలం పార్టీ. రజనీకాంత్ కూడా సొంత పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినా అనారోగ్య కారణంతో వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. కానీ తాను ఎవరికి మద్దతు ఇస్తున్నట్లు కానీ… వ్యతిరేకిస్తున్నట్లు గానీ రజనీకాంత్ ప్రకటించలేదు. రజనీ అభిమానులు కొందరు ఇటు డిఎంకే అటు ఏఐడిఎంకే పార్టీల్లో చేరినా ఏం మాట్లాడలేదు. ఈ సందర్బంలోనే బీజేపీ ప్రభుత్వం అనూహ్యంగా రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.
దాదాసాహెబ్ ఫాల్కే ఎవరంటే…
మూవీ మొఘల్ (Movie Moghal)గా పేరు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఆంగ్లేయుల పాలనా కాలంలో 1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని టింబక్ అనే ఊరిలో జన్మించారు పాల్కే. భారతీయ సినిమాకు పితామహుడిగా భావిస్తారు పాల్కేను. తొలి భారతీయ సినిమాను రూపొందించిన ఘనుడు ఫాల్కే. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్నతనం నుంచే ఫాల్కేకు కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. తన కలలను నెరవేర్చుకునే ఆలోచనతో పాల్కే 1885లో ముంబై (Mumbai)లోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ (Sir JJ School of Art)లో చేరారు. అక్కడే ఫొటోగ్రఫీ (Photography), లిథోగ్రఫీ (Lithography), ఆర్కిటెక్చర్(Architecture) , డ్రామా (Drama)లు వేయడం నేర్చుకున్నారు. ఇక్కడే మ్యాజిక్ ఎడ్యుకేషన్ ను నేర్చుకున్నారు. కొన్నాళ్లు పెయింటర్‌గా, సినిమా సెట్లకు డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు పాల్కే.
ప్రముఖ చిత్రకారుడు రవివర్మ (Ravi Varma)కు చెందిన ప్రెస్‌లో పనిచేశాడు పాల్కే. అక్కడే వర్మ గీసిన హిందూ దేవుళ్ల బొమ్మలను చూసిన ఫాల్కే వాటినుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు. 1908లో ‘ఫాల్కేస్ ఆర్ట్ ప్రింటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ వర్క్స్’ అనే పేరుతో ప్రారంభించాడు. కానీ భాగస్వామితో వచ్చిన విభేదాలతో మధ్యలోనే అది ఆగిపోయింది. ఆ తర్వాత ఫాల్కేకు సినిమానే జీవితమైంది. 1910లో మూకీ చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ను చూడడం ఫాల్కే జీవితాన్ని మార్చేసింది. ఎప్పటికైనా సినిమా నిర్మాణాన్ని భారత్‌కు తీసుకురావాలని అప్పుడే అనుకున్నాడు పాల్కే. అనుకోవడమే కాదు ఆచరణలో భాగంగా 1912లో సినిమాలకు సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ఇంగ్లండ్ కు పయమనమయ్యాడు. లండన్ వెళ్లిన పాల్కే అక్కడే సినిమా నిర్మాణ మెలకువలు నేర్చుకున్నాడు.
ఆ తర్వాత భారత్‌కు వచ్చిన పాల్కే భారత తొలి మూకీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ (Raja Harischandra)ను తీసి విడుదల చేశారు. ఈ చిత్రానికి స్టోరీ, డైరెక్షన్, డిస్ట్రిబ్యూషన్, నిర్మాణం వంటి బాధ్యతలన్నీ ఫాల్కేనే నిర్వహించారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగానే భావించాలి. అనుకున్నట్లుగానే ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. సినిమాల్లో మహిళలు నటించడం అప్పట్లో అరుదు. కానీ 1913లో తన తదుపరి సినిమా ‘భస్మాసుర్ మోహిని’లో ఓ మహిళను ప్రధాన పాత్రలో నటింపజేసి అందరినీ ఆశ్చర్యపరిచారు దాదాసాహెబ్ పాల్కే. 1917లో హిందుస్తాన్ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు పాల్కే. ఇక అప్పటి నుంచి వెనక్కు తగ్గలేదు. ఆ సంస్థ నుంచి ఎన్నో సినిమాలు నిర్మించారు. లంకా దహన్ (1917), శ్రీ కృష్ణ జన్మ (1918), సైరంధ్రి (1920), శకుంతల (1920) వంటి ఎన్నో పౌరాణిక సినిమాలను నిర్మించారు పాల్కే. 1930 నుంచి సినిమాలు నిర్మించడం ఆపేశారు పాల్కే. భారతీయ సినిమాకు ఎన్నో సేవలందించిన పాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో తుది శ్వాస విడిచారు.
ఫాల్కే కుటుంబ నేపథ్యం..
ఫాల్కే భార్య సరస్వతి భారతీయ తొలి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో తన వంతు సేవలందించారు. తొలి భారతీయ సినిమా టెక్నీషియన్ ఆమెనే. షూటింగ్ సమయంలో వెలుతురు కెమెరాపై పడకుండా బెడ్ షీట్‌ను అడ్డుగా పట్టుకుని ఉండేవారట సరస్వతి. సినిమా షూటింగ్‌కు కావలసినవన్నీ ఆమెనే సమకూర్చేవారు. రాత్రి పూట క్యాండిల్ వెలుగులోనే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించేవారట. సినిమా బృందంలో 60-70 మందికి ఓపికగా సరస్వతినే వంట చేసి పెట్టేవారు. రాజా హరిశ్చంద్రలో హరిశ్చంద్రుని కుమారునిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించారు. తొలి భారతీయ బాలనటుడు బాలచంద్రనే. శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్‌లో బాల శ్రీకృష్ణునిగా మందాకిని నటించారు. ఆమె ఫాల్కే పెద్ద కూతురు. తొలి భారతీయ బాలనటి మందాకిని. ఫాల్కేకు సొంత ఇల్లు లేకపోవడంతో శాంతారాం ఆయనతో నాసిక్ లో ఒక ఇంటిని కొనిపించారు. చివరకు ఆ ఇంటిలోనే తుది శ్వాస విడిచారు.
బొంబాయి జూబ్లీ ఉత్సవాల సందర్భంగా బహుమతి పొందిన తర్వాత ఫాల్కే స్వగ్రామం టింబక్ చేరుకున్నాడు. 90 సినిమాలను నిర్మించిన భారతీయ సినిమా పితామహుడు చాలా పేదరికంతో కన్నుమూశాడు. భారతీయ సినీ రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలకు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అందుకే పాల్కే పేరుమీద ఓ అవార్డుని ప్రకటిస్తోంది. తొలిసారిగా ఈ అవార్డును 1969లో ప్రముఖ నటి దేవికారాణి(Devika Rani)కి అందించారు. భారతీయ సినీ పరిశ్రమ(Indian Film Industry)కు ఓ వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డునిచ్చారు. రాష్ట్రపతి (President of India) చేతుల మీదుగా ఈ అవార్డునిస్తారు తెలుగు సినీరంగం (Tollywood) నుంచి కె.విశ్వనాథ్ (K Vishwanath), అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageshwar Rao), డి.రామానాయుడు (D Ramanaidu) వంటి వారికి ఈ అవార్డు వరించింది.
ALSO READ: ఎన్ఐఏ దాడుల కలకలం.. ఇంతకీ దాడులకు దారి తీసిన కేసు పూర్వపరాలేంటో తెలుసా?
ALSO READ: మయన్మార్‌లో ఆగని మారణకాండ.. మిలిటరీ హత్యాకాండలో 500 మందికిపైగా మృతి!