రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 20వ సినిమా సెట్స్ మీదకు వెళ్లి దాదాపుగా ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది సమ్మర్‌లో విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇంతవరకు టైటిల్‌పై మాత్రం స్పష్టత రాలేదు. ఆ మధ్య ఈ సినిమాకు జాన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. వాటిని చిత్రయూనిట్ ఖండించింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ నుంచి కొన్ని టైటిళ్లు బయటకు వచ్చాయి. వివిధ నిర్మాణ సంస్థలు తమ వద్ద రిజిస్టర్ చేయించుకున్న టైటిళ్లను ఫిలిం ఛాంబర్ విడుదల చేసింది. అందులో యూవీ క్రియేషన్స్ పేరిట ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిళ్లు ఉన్నాయి. దీంతో ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రభాస్ కోసమన్న టాక్ నడుస్తోంది. అలాగే మేర్లపాక గాంధీ, సుజీత్‌లతో కూడా యూవీ క్రియేషన్స్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆచార్య అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. దీంతో ఈ టైటిల్ చిరంజీవి-కొరటాల చిత్రం కోసమేనని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి గోవింద ఆచార్య అనే టైటిల్‌ను పెట్టానుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు రాగా.. ఇప్పుడు ఆచార్యను ఫైనల్ చేసినట్లు సమాచారం. దీంతో చిరు 152వ చిత్రం టైటిల్ ఆచార్య అని ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. కాగా ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.