బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి నటనకు స్వస్తి చెప్పి దేశసేవకు శ్రీకారం చుట్టింది. పలు సినిమాల్లో నటిగా మెప్పించిన ఆమె ఇప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస్ అధికారిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోంది. ఆమె పేరు సిమల ప్రసాద్. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ఆడియెన్స్ కు ఈ నటి బాగా పరిచయం. భోపాల్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ అందానికి బాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఈ నటి తన అందాలతో సినీ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. సిమలకు చిన్నప్పటి నుంచి కళలంటే ఇష్టం. చిన్నతనంలో నాట్యం, నటన పాఠాలు నేర్చుకుంది. బి.కామ్ చదువుతున్నప్పుడే పలు నాటకాల్లో నటించింది. ఇక 2019లో విడుదలైన ‘నకాష్’, 2017లో ‘అలీఫ్’ చిత్రాల్లో సిమల ప్రధాన పాత్రలు పోషించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. బహుశా దీని తర్వాత సిమలకు ఇంకా మంచి సినిమాలు వచ్చి ఉండేవి. కానీ ఆమెకు కళతో పాటు రాజకీయాలు, సామాజిక శాస్త్రంపై కూడా ఆసక్తి ఉంది. కాబట్టి ఆమె పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. అలా తొలి ప్రయత్నంలోనే సిమల పీఎస్సీలో ఉత్తీర్ణత సాధించింది. DSP గా పోస్టింగ్ కూడా వచ్చింది. అయితే ఆమె కళల ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఐపీఎస్ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు మరింత ముందుకు సాగింది.
ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించింది. ఇది ఖచ్చితంగా ఆమెను ప్రశంసించాల్సిన విషయం. నటి నుండి IPS అధికారిగా మారిన సిమల ప్రయాణం నిజంగా చాలా ఆసక్తికరం అలాగే ప్రశంసనీయమైనది. ‘నేను ఈ ఐపీఎస్ యూనిఫాంలో నన్ను నేను చూసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు’.. కానీ ఇప్పుడు నా మనసెంతో సంతోషంగా ఉంది’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది సిమల.
సిమల ప్రసాద్ భోపాల్ నగరంలో 1980 అక్టోబర్ 8న జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమె తన అభిరుచులైన డ్యాన్స్, యాక్టింగ్‌ని కొనసాగించేది. వివిధ పోటీలలో పాల్గొనేది. కాగా సిమల తండ్రి డా. భగీరథ్ ప్రసాద్ ఐఏఎస్ అధికారి. ఆయన అడుగుజాడల్లోనే నడిచిన ఆమె ఐపీఎస్ అధికారిగా స్థిరపడ్డారు.