
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. తొలుత భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా శ్రీలంక జట్టు మొత్తం కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ కేవలం 6 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్ విజయంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఒక్క రోజు ముందే వినాయక చవితి వచ్చిందంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్లు కూడా ఈ విజయంలో భాగమయ్యారు. అనుష్క శర్మ నుండి విక్కీ కౌశల్ వరకు అందరూ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సంచలన బౌలింగ్ తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌ను పొగిడేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కి కూడా అభిమానిగా మారారు. బౌలింగ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూసి సిరాజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘మా టోలీ చౌకీ కుర్రాడు సిరాజ్ మియాన్ ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్లు తీసి మెరిశాడు’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా టీమిండియా విజయంపై స్పందించాడు.’టీమ్ ఇండియా తన బౌలింగ్ పదును చూపించింది. ఈ అద్భుతమైన విజయం సాధించినందుకు మీకు అభినందనలు’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కూడా మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా ‘వాట్ ఏ స్పెల్’ అని పోస్ట్ పెట్టాడు. విరాట్ కోహ్లీ సతీమణి, నటి అనుష్క శర్మ కూడా మొహమ్మద్ సిరాజ్‌ను ప్రశంసించింది. ‘క్యా బాత్ హై మియాన్ మ్యాజిక్’ అని సిరాజ్‌కు అభినందనలు తెలిపింది. అలాగే కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి కూడా టీమిండియాను అభినందించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.