Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు ముంబాయిలో రెక్కీ.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..
వీరు బెంగాల్ లోని ఇండో, నేపాల్ సరిహద్దు నుంచి నేపాల్ కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు.. సెంట్రెల్ ఏజెన్సీలతోపాటు ఏజీటీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

గత కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు (Salman Khan) హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య చేసిన నిందితులు సల్మాన్ను చంపేందుకు ముంబాయి రెక్కీ నిర్వహించినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకే సల్మాన్ హత్యకు రెక్కీ జరిగినట్లుగా ఆదివారం వెల్లడించారు. ఈ క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బెంగాల్ లోని ఇండో, నేపాల్ సరిహద్దు నుంచి నేపాల్ కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు.. సెంట్రెల్ ఏజెన్సీలతోపాటు ఏజీటీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం.. సల్మాన్ ఖాన్ ను.. అతడి తండ్రిని హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ డీజీపీ మాట్లాడుతూ.. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన కపిల్ పండిట్ ను విచారించగా.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకు సల్మాన్ కాన్ లక్ష్యంగా మరో ఇద్దరితో కలిసి రెక్కీ నిర్వహించినట్లు అంగీకరించాడు. ఇక ఆ ఇద్దరిని కూడా విచారిస్తాం అని తెలిపారు. ఇక సల్మాన్ ను హత్య చేసేందుకు సంపత్ నేహ్రాతో ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు సిద్దూ హత్య కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 23కి చేరుకుంది. అమృత్ సర్ లోని భక్నా గ్రామంలో పోలీసు ఎన్ కౌంటర్ లో ఇద్దరు షూటర్లు మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మను కుస్సా, జగ్రూప్ సింగ్ అలియాస్ రూప హతమయ్యారు. సిద్ధూను హత్య చేసిన తర్వాత తమ గ్యాంగ్ స్టర్ ఆదేశాల మేరకు కపిల్.. మరో ఇద్దరు షూటర్లు హర్యానా, రాజస్థాన్, గుజరాత్, యూపి, పశ్చిమ బెంగాల్ లో తమ స్థానాలను మారుస్తూ వచ్చారు. వీరంతా నకిలీ పాస్ పోర్ట్ లను ఉపయోగించి దుబాయ్ లో స్థిరపడతామని వీరంతా నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. విక్కీ మిద్దుఖేరా హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆదేశానుసారం సిద్ధూ మూసేవాలాను చంపడానికి ముందు తాను అనేక ప్రదేశాలను కూడా సర్వే చేశానని పండిట్ వెల్లడించాడు. విదేశాలకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్లను భారత్‌కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ తెలిపారు.
