బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ఈఏడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సెషన్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అలియా.. మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకుంది. అలాగే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన గంగూబాయి కతియావాడి చిత్రంలో నటించింది. ఇందులో ఓ వేశ్వ పాత్రలో అలియా నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గంగూబాయి కతియావాడి కాకుండా.. ఆర్ఆర్ఆర్ , డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ ఉన్నాయి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రాలు ఆస్కార్ బరిలో నిలవడం ఇది మొదటిసారి కాదు. గతంలో రూపొందించిన దేవదాస్ చిత్రం కూడా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఇందులో షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం అలియా భట్ బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో రణబీర్ కపూర్, నాగార్జున, మౌనీరాయ్, షారుఖ్ ఖాన్, అమితాబ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.