తెలుగు తెరపైన విజయవంతంగా కొనసాగుతోన్న షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికీ ఈ షో మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్‌కు అందరిలో ఆదరణ పెరగడంతో పాటు టీఆర్పీ రేటింగ్‌లు కూడా మంచిగా వస్తుండటంతో ఈ షోను ఇలానే కంటిన్యూ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌కు సంబంధించిన పనులు అప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు హోస్ట్‌గా మళ్లీ ఎన్టీఆర్‌ను సంప్రదించారట నిర్వాహకులు. అంతేకాదు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారట. కానీ ఈ షోకు మళ్లీ హోస్ట్‌గా వచ్చేందుకు జూనియర్ అంతగా ఆసక్తిని చూపలేదట. దీంతో నిర్వాహకులు మహేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు సూపర్‌స్టార్ కూడా ఆసక్తిని చూపుతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్ ఫార్మాట్‌ను నిర్వాహకులు మారుస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సారి బిగ్‌బాస్ మరింత క్రేజీగా మారడం ఖాయం. కాగా ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ మొదటి సీజన్ ప్రారంభమైంది. ఆ తరువాత రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌లుగా చేశారు. హోస్ట్‌లుగా ఈ ముగ్గురికి మంచి మార్కులే పడిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్.. ఆ మూవీతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించిన సూపర్‌స్టార్.. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్యలోనూ మహేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
Read This Story Also: విక్రమ్, సల్మాన్‌లపై ‘కరోనా’ ఎఫెక్ట్.. ఏం జరిగిందంటే..!