‘అవతార్’ సీక్వెల్స్‌ మళ్లీ వాయిదా.. జోకులేస్తోన్న నెటిజన్లు

అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై కూడా కరోనా ప్రభావం అధికంగా పడింది

అవతార్ సీక్వెల్స్‌ మళ్లీ వాయిదా.. జోకులేస్తోన్న నెటిజన్లు

Edited By:

Updated on: Jul 24, 2020 | 11:39 AM

అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై కూడా కరోనా ప్రభావం అధికంగా పడింది. ఈ మహమ్మారి నేపథ్యంలో చాలా దేశాల్లో షూటింగ్‌లకు బ్రేక్ పడింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఒకప్పటిలా షూటింగ్‌లు జరుపుకునే పరిస్థితి రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అవతార్‌ 2‌ వాయిదా పడింది. మామూలుగా వచ్చే ఏడాది డిసెంబర్‌లో అవతార్‌ 2 రావాల్సి ఉండగా.. అది మరో సంవత్సరానికి వాయిదా పడింది. ఈ విషయాన్ని డిస్నీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2022 డిసెంబర్‌లో అవతార్ 2 రానుందని వెల్లడించింది. అలాగే అవతార్‌ 3- 2024, డిసెంబర్‌ 20, అవతార్‌ 4- 2026, డిసెంబర్‌ 4న, అవతార్‌ 5- 2028 డిసెంబర్‌ 22న రానున్నాయి.

కాగా అవతార్‌ 2 రిలీజ్‌ వాయిదా పడటం ఇది తొలిసారేం కాదు. 2009లో అవతార్‌ విడుదలైన తరువాత సీక్వెల్‌ని ప్రకటించిన జేమ్స్ కామెరూన్‌ 2014లో అవతార్‌ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. ఇక 2016లో ఐదు భాగాలుగా అవతార్‌ రానుందని తెలిపిన జేమ్స్ కామెరూన్.. వాటికి  2018, 2020, 2022, 2023 సంవత్సరాలను ఖరారు చేశారు. ఇక ఈ మూవీల‌ నిర్మాణంలోకి డిస్నీ భాగం అయిన తరువాత సీక్వెల్స్‌లకు 2021, 2023, 2025, 2027 సంవత్సరాలను విడుదల తేదీలుగా అధికారికంగా ప్రకటించారు. ఇక కరోనా నేపథ్యంలో అవతార్‌ సీక్వెల్స్‌ మరోసారి వాయిదా పడ్డాయి. కాగా డిస్నీ కొత్త డేట్లను ప్రకటించడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆ సీక్వెల్స్ వచ్చే లోపు ఎవరు ఉంటారో..? ఎవరు ఉండరో..? తెలీదంటూ కామెంట్లు పెడుతున్నారు.