Sonu Sood: మరొకరి ప్రాణాలు నిలబెట్టిన సోనూసూద్.. కరీంగనర్ చిన్నారికి సర్జరీ విజయవంతం
Telangana: కరోనా సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోన్న వేళ నేనున్నానంటూ ముందుకొచ్చాడు సినీ నటుడు సోనూసూద్ (Sonu Sood). ఆపత్కాలంలో అడిగిన వారందరికీ ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా మారిపోయాడు. కరోనా సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆపదలో ఉన్నవారికి తనవంతు సహయం అందజేసి వార్తల్లో నిలిచాడీ హ్యాండ్సమ్ యాక్టర్. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ (Sood Charity Foundation) స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమందికి తనవంతు సహాయ సహకారాలు అందించాడీ నటుడు. తన సామాజిక సేవతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ ట్యాలెంటెడ్ హీరో తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
కరీంనగర్ కి చెందిన మహ్మద్ సఫన్ అలీ అనే ఏడు నెలల చిన్నారి అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. బైలియరీ అట్రీసియా అనే వ్యాధి బారిన ఆ బాలుడు కాలేయం దెబ్బతింది. దీంతో కామెర్లతో పాటు సిర్రోసిస్ కూడా సోకింది. చిన్నారి ప్రాణాలు దక్కాలంటే కాలేయమార్పిడి తప్పని సరని వైద్యులు సూచించారు. అయితే ఖర్చుతో కూడుకున్న చికిత్సను మహ్మద్ సఫన్ అలీ తల్లిదండ్రులు భరించే స్థితిలో లేరు. సోనూసూద్ ని సాయం కోరడంతో ఆయన ముందుకు వచ్చారు. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ సహాయంతో తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో సఫన్ అలీకి చికిత్స అందించారు. ఎస్తేర్ మెడ్ సిటీ హాస్పిటల్ లో ఏడు నెలల బాలుడైన సఫన్ అలీకి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..