
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వీవీ వినాయక్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సారథ్యంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రం ఒక అరంగేట్ర నటుడికి చిరస్మరణీయ అనుభవాన్ని అందించింది. ఆ నటుడు ఎవరో కాదు సాయాజీ షిండే. ఈ నటుడు తన మొదటి సినిమా ఠాగూర్ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లను, చిరంజీవి గారి నుండి లభించిన అపూర్వమైన మద్దతును ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఠాగూర్ చిత్రంలో విలన్ పాత్రకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సినిమా ప్రముఖ బాలీవుడ్ చిత్రానికి రీమేక్ అని, చిరంజీవి గారు వంటి బిగ్ స్టార్ సినిమాలో, అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాత ఆధ్వర్యంలో, వీవీ వినాయక్ దర్శకత్వంలో పనిచేయడం ఒక పెద్ద అవకాశం అని వివరించారు. ఛోటా కె. నాయుడు కెమెరామెన్‌గా వ్యవహరించిన ఈ చిత్రం చాలా పెద్ద ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. షూటింగ్ మొదటి రోజు చిరంజీవి గారు తనను “మీరు సౌకర్యంగా ఉన్నారా.?” అని అడిగారని, దానికి తాను “లేదు, కంఫర్టబుల్‌గా లేను” అని స్పష్టంగా చెప్పానని సాయాజీ షిండే గుర్తుచేసుకున్నారు. దీనికి కారణం తాను 17 సంవత్సరాలుగా రంగస్థల నటుడిగా ఉండటమేనని వివరించారు సాయాజీ షిండే.
థియేటర్‌లో మాటలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, మాటలు లేకుండా భావ వ్యక్తీకరణ సాధ్యం కాదని, ముఖ కవళికల కంటే స్వర వ్యక్తీకరణే ముఖ్యమని తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఎక్కువగా స్వరం అలాగే డైలాగ్స్ పై పని చేస్తానని, కానీ సినిమాలో ప్రాంప్టింగ్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. సాయాజీ షిండే ఇబ్బందిని అర్థం చేసుకున్న చిరంజీవి గారు వెంటనే దర్శకుడు వీవీ వినాయక్‌తో మాట్లాడారు. వెంటనే ఒక అసోసియేట్ డైరెక్టర్‌ను ఆ నటుడు బస చేసిన హోటల్‌కు పంపి, మరుసటి రోజు షూటింగ్ చేయాల్సిన సన్నివేశాన్ని పూర్తిగా వివరించమని ఆదేశించారట. ఈ మద్దతుతో ఆ నటుడు ప్రతి డైలాగ్‌ను బైహార్ట్ చేసి, దాని అర్థాన్ని పూర్తిగా గ్రహించి, ఒక్కో డైలాగ్‌ను మూడుసార్లు రాసి, ఆపై ఫాస్ట్, మీడియం, లో స్పీడ్‌లలో రికార్డ్ చేసుకుని, సరైన భాషా శైలిని అలవరచుకుని షూటింగ్‌లో పాల్గొనేవారట సాయాజీ షిండే. ప్రాంప్టింగ్ వల్ల తాను చాలా డిస్టర్బ్ అవుతానని, అందుకే ప్రతి డైలాగ్‌ను థియేటర్‌లో మాదిరిగానే గుర్తుంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, డబ్బింగ్ విషయంలో కూడా తనకు ఒక ఆసక్తికరమైన అనుభవం ఎదురైందని ఆ నటుడు తెలిపారు. మొదట ఒకరిద్దరు డబ్బింగ్ ఆర్టిస్టులతో ప్రయత్నించినప్పటికీ, తన పైలట్ ట్రాక్‌లో ఉన్న తన స్వరం చిత్ర బృందానికి బాగా నచ్చిందని చెప్పారు. తన స్వరం ఒక వ్యక్తిత్వానికి ఆత్మ వంటిదని, పాత్రకు ప్రాణం పోయగలదని నమ్ముతానని, తాను డబ్బింగ్ చెబితే పాత్ర మరింత సహజంగా ఉంటుందని అన్నారు సాయాజీ షిండే. ఆ రంగస్థల అనుభవంతో, తన గళంలో ఆత్మ అలాగే హృదయం ఉంటుందని బలంగా చెప్పారు. చివరికి, ఠాగూర్ చిత్రానికి స్వయంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశం లభించింది. ఒక్కో సన్నివేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒకటి లేదా రెండు రోజులు తీసుకుని, ఎంతో శ్రద్ధగా డబ్బింగ్ పూర్తి చేశారట సాయాజీ షిండే. ఈ అనుభవం ఆయన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.