Acharya Athreya : మనసుమీద మనసుపడ్డ మహామనిషి ఆచార్య ఆత్రేయ
మనసు మీద మనసు పడ్డ మనసున్న మనిషాయన. మనసు పడే వేదన అక్షరరూపం పొందితే ఆయన రూపమే దాలుస్తుంది. ఆయనకీ మనసుకు అంత దగ్గర సంబంధం వుంది...
Acharya Athreya : మనసు మీద మనసు పడ్డ మనసున్న మనిషాయన. మనసు పడే వేదన అక్షరరూపం పొందితే ఆయన రూపమే దాలుస్తుంది. ఆయనకీ మనసుకు అంత దగ్గర సంబంధం వుంది. మనసును టోటల్‌గా అటాప్సీ చేసిన హార్ట్ స్పెషలిస్టాయన. ఆయనే కిళాంబి వెంకట నరసింహాచార్యులు. కొందరాయన్ను రాత్రేయన్నారు. ఇంకొందరు బూత్రేయన్నారు. అందరూ నిండు మనసుతో ఆత్రేయ అని పిలుచుకున్నారు. ఇవాళ ఆయన శత జయంతి. మనిషి, మనసు, మమత, దేవుడు, విధి, ప్రేమ, విరహం ఇవి ఆత్రేయ కవితా వస్తువులు. వాటితోనే మనసును తాకే పాటలు రాశారు. విచిత్రమేమిటో కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాటయ్యేది. మామూలు పదాలు రాసినా పదికాలాల పాటు నిలిచే గీతమయ్యేది. అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. పేరు చివరిభాగాన్ని ముందుకు తీసుకొచ్చి దానికి గోత్రనామాన్ని తగిలించేసుకుని ఆచార్య ఆత్రేయ అయ్యారు. నెల్లూరు జిల్లా సూళ్లురుపేట తాలూకా ఉచ్చూరుకు దగ్గరగా ఉన్న మంగళంపాడులో మే 7, 1921న సీతమ్మ, కృష్ణాచార్యుల దంపతులకు జన్మించారు. మేనమామ వదదాచార్యలు దగ్గర తెలుగు సాహిత్యాన్ని నేర్చుకున్నారు. నాటకాలు, నాటికలు, కథలు, సినిమాకు పాటలు, కొన్నింటికి మాటలు అన్నీ రాశారు. వాగ్దానం సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన తెలుగు నాటకరంగానికి ఎంతో చేశారు. మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబించే అనేక నాటకాలు, నాటికలు రాశారు. ఈనాడు, పరివర్తన, ఎన్జీవో, కప్పలు, భయం, ఆంత్మార్పణ, విశ్వశాంతి, వాస్తవం, గౌతమబుద్ధ, అశోక సమ్రాట్, మనసు వయసు, అంతర్యుద్ధం, అంత్యార్పణ, అశ్వగోషుడు వంటి నాటకాలను ఎవరు మాత్రం మర్చిపోగలరు? దసరాబుల్లోడు, ప్రేమ్‌నగర్, మూగ మనసులు, మంచి మనసులు, వెలుగునీడలు, ఆరాధన, ఆత్మబలం మొదలైన చిత్రాలకు రాసిన మాటలు ఎంతగానో పాపులరయ్యాయి. రచయితను బట్టి సినిమాకు ప్రేక్షకులు వెళ్లడం అనేది మొదలయ్యిందే ఆత్రేయ నుంచి! చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించడం ఆత్రేయకే సాధ్యం. సినిమా పాటకు రంగు, రుచి, వాసన కలిగించింది ఆత్రేయనే! సినిమా పాటకు సరికొత్తఊపిరి పోసి, దానికి సరికొత్త ఒరవడిని దిద్దింది కూడా ఆయనే! కే.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన దీక్షతో ఆయన సినిమారంగంలో అడుగుపెట్టారు. మొదటి పాట పోరా బాబు పో, పోయి చూడు లోకం పోకడ అన్న పాటతోనే పాపులరయ్యారు.
ఆత్రేయ మనసుకవి. మన సుకవి. మనిషి, మనసు, ప్రేమ, దు:ఖం, బ్రతుకు, మరణం, ప్రేయసీప్రియుల ప్రణయం, అందులోని వేదన, విరహం, కోపతాపాలు, అలకలు, కినుకులు ఆత్రేయ పాటల్లో ఒదిగిపోయాయి. మనసు గురించి ఎంతగా మనసు పెట్టి రాస్తారో వయసు గురించి, ఆ వయసు పులకరింతల గురించీ, ఆ వయసు చేసే తుంటరిపనుల గురించీ అంతే గడుసుతనంగా రాస్తాడు. మరో చరిత్రలోని పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు పాట వింటే అర్థమవుతుంది. గుప్పెడుమనసు సినిమాలో మూగ మనసును ఎన్నో రకాలుగా వర్ణించారు. మనసు మాయల దయ్యమట! ఉన్నది వదిలేస్తుందట. లేనిది కోరుతుందట. ఊహల ఉయ్యాలలొ ఊగుతుందట! మనసుతోటి ఆటలాడుకోవద్దని, పగిలిపోతే అతకదని చాలా పాటల్లో చాలా సార్లు చెప్పాడు. ఎవ్వరికీ ఇవ్వనంత వరకే హృదయం విశాలంగా వుంటుంది. ఒకసారి ఇచ్చాక ఇరుకై పోతుంది. ఇంకెవ్వరికీ చోటివ్వనంటుంది అంటారు ఆత్రేయ ప్రేమనగర్‌లో. ఆ ఇరుకైన హృదయం ఎంత వేదనను అనుభవించిందో తెలియదు కానీ. ఆ వేదనలోంచి వచ్చిన పాటలన్నీ చిరస్మరణీయాలయ్యాయి… దు:ఖం కమ్మేసినప్పుడు ఓదార్పు కావాలి. కంటి నిండా నిదురరావాలి. అప్పుడే కాస్త తేరుకోగలం. మూగమనసులు సినిమాలో పాడుతా తీయగ చల్లగా అనే ఒక్క పాటలో ఆత్రేయ మొత్తం సారమంతా చెప్పేశారు. జోలపాటల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్న ఆ పాటలో ఆర్ర్దతను, అనురాగాన్ని చక్కగా ఇమడ్చారు మన సుకవి. ఆత్రేయలో శ్రీశ్రీ పరకాయప్రవేశం చేసి రాస్తే ఎలా వుంటుంది? అచ్చంగా తోడికోడళ్లు సినిమాలో కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పాటలా ఉంటుంది. సోషలిస్ట్ భావాలతో కూడిన అద్భుతమైన పాట అది. అందుకే ఇప్పటికీ నిలిచిపోయింది.
చిలిపిపాటలు రాశారు. వలపు పాటలూ రాశారు. శభాష్ వదిన సినిమాలోని ఓ పాటలో పడుచుదనం పందెమెత్తి వలపు జూదం ఆడుకోవాలి, నాకు నువ్వు నీకు నేను రోజు రోజూ ఓడిపోవాలి అని అంటారు. నిజమే మిగతా అన్ని చోట్ల గెలవటం విజయం. శృంగారంలో మాత్రం అవతలివారిని గెలిపించడమే విజయం. దీన్ని ఎంతబాగా సూత్రీకరించారో. అలాగే మంచిచెడు సినిమాలోని రేపంటి రూపం కంటి పాటలో నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి వేయించి నన్నునేనే ఓడిపోమ్మంటి…నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిల్లు రోజు రానీ రమ్మంటి అంటారు. ఆత్మబలం సినిమాలోని తెల్లవారనీకు ఈ రేయిని పాటలో తేటి ఎగిరిపోతుంది. పువ్వు మిగిలిపోతుంది. తేనె వున్న సంగతి తేటి గురుతు చేస్తుంది అంటారు. ఎంత అద్భుత భావన… తేలికైన పదాలతో బరువైన భావాలను పలికించడంలో ఆత్రేయకు మించిన వారు లేరు. ఆయన కష్టపడి ఏనాడు రాసింది లేదు. పదాలే ఇష్టపడి ఆయన పాటయ్యాయి. రామపాదాలు సోకిన రాయి అహల్య అయినట్టు ఆత్రేయ పదాలు అల్లుకున్న పాట పడుచుపిల్ల పయ్యెదలయ్యాయి. పలచని వెలుగును పరిచాయి.
మనిషికీ మనసుకీ వున్న అనుబంధాన్ని ఆత్రేయంత గొప్పగా చెప్పిన కవి మరొకరు లేరు. ఆయన రాసిన పాటల్లోని కొన్ని వాక్యాలు తెలుగునాట నానుడిగా మారాయంటే అది ఆ కలం బలం మహిమే! మనసు లేకుండా బతికేయడమంటే అది నరకంతో సమానం..అలాగే మరుపులేని మనసు కూడా అంతే..లేకపోతే జ్ఞాపకాలు తరుముకుని వచ్చి గులాబిముళ్లులా పదే పదే గుచ్చుతుంటాయి అని అంటారు సెక్రటరీలోని మనసులేని బతుకొక నరకం పాటలో! స్వీయానుభవమో మరోటో కాని ఆత్రేయ ప్రియురాలి సొగసును ఎంతగా వర్ణించారో అంతకు రెట్టింపు ఆమెను ఘాటుగా విమర్శించారు. అందుకు బోలెడన్ని ఉదాహరణలు. కన్నెమనసులోని ఓ హృదయం లేని ప్రియురాల, అభినందన సినిమాలోని ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ఆడబ్రతుకు సినిమాలోని తనువుకెన్ని గాయాలైనా అన్న పాటలు వింటే ప్రియురాలును ఎంతగా ఆడిపోసుకున్నారో అర్థమవుతుంది. బహుశా ఇవి ఆత్రేయ మనసుకు తగిలిన గాయాలేమో, వాటి ఫలితమే ఈ గేయాలేమో! ప్రేమనగర్‌లోని ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం పాట కూడా ఇలాంటిదే! ఆడవాళ్ల మనసును అర్థం చేసుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదంటారు ఆత్రేయ…మనిషై పుట్టి ఎవరినో ఒకరిని ప్రేమిస్తే కాని దేవుడికి అర్థం కాదన్నది ఆయన భావన. తేనెమనసులు సినిమాలో దేవుడు నేనై పుట్టాలి దేన్నో తాను ప్రేమించి అన్న పాటే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.
ఇంధ్రధనుస్సులోని నేనొక ప్రేమ పిపాసిని పాట ఆత్రేయకు బాగా నచ్చిన పాట.. ప్రేయసి కోసం ఎదురుచూసి చూసి నిరాశ చెందిన ప్రేమికుడి ఆవేదనను ఇంతకంటే ఎవరండీ బాగారాయగలరు? ఇది ఆయన జీవితానికి సంబంధించినది కాబట్టే ఆయనకు అత్యంత ఇష్టమైనదయ్యింది. ఆత్రేయ పాటరాయడానికి చాలా టైమ్ తీసుకునేవారు. అనుకున్నటైమ్‌కి పాట ఎప్పుడూ నిర్మాతకి ఇచ్చేవారు కాదు. కానీ మంచి చమత్కారి. ఓ నిర్మాత ఆత్రేయకోసం చోళ హోటల్ బుక్ చేసి, అక్కడ ఉండి తన సినిమాకి పాటలు రాసిపెట్టమన్నాట్ట. ఎంత కాలమైనా ఒక్క పల్లవీ రాసి ఇవ్వలేదట ఆత్రేయ. ఏమని అడిగితే, ఇది చోళ హోటల్. ఇక్కడ పల్లవులు రావడం ఎలా సాధ్యం? అన్నాట్ట. కానీ ఆత్రేయ కలం కదిలించి పాట రాస్తే మాత్రం అది ప్రేక్షకుల హృదయాల్ని కదిలించేది. అందుకే అంటారు. ఆత్రేయ రాయక నిర్మాతల్నీ రాసి ప్రేక్షకుల్నీ ఏడిపిస్తాడని.. ఆత్రేయది అంతరంగ కవిత్వం. అది స్వీయానుభవాల వ్యక్తీకరణ. ఆర్ర్దత వుంటుంది.. నైరాశ్యం వుంటుంది. ప్రణయ పిపాసా వుంటుంది. మనిషి. మనసు. మమత వీటి మీదే కాదు మనసున్న మనిషి పడే ఆవేదన. సంఘర్షణకు సంబంధించీ ఆయన రాశారు. మనసును ఆయన పరిశోధించారు. పలకరించారు. విశ్లేషించారు. మనసును ఉపశమింపచేసేవి, మనిషిని ఓదార్చేవీ రాశారు. మూగమనసులులోని ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులో, ఆరాధనలోని అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి, డాక్టర్ చక్రవర్తిలోని ఎవరో జ్వాలను రగిలించారు, మంచి మనసులులో అహో ఆంధ్ర భోజా, బడి పంతులులో నీ నగుమోము నా కనులారా పాటలు ఇలాంటివే!
గుండెపోటొచ్చి ఆస్పత్రిలో చేరారు ఆత్రేయ. ఇది తెలిసి సన్నిహితులంతా ఆయన చుట్టూ చేరారు. ‘చూశారా. ఇన్నాళ్లూ ఆత్రేయ హృదయం లేని మనిషని ఆడిపోసుకున్నారు కదా! ఇప్పుడు నాకూ హృదయముందని రుజువైంది’ అని అన్నాట్ట నవ్వుతూ. పరిహాసానికి అన్నా నిజంగానే ఆత్రేయది నిండు హృదయం. ఆ హృదయం చిలిపితనం కురిపించింది. వలపుదనం పండించింది. భక్తిని పారించింది. ప్రేయసి ప్రియుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ. సర్వం మర్చిపోయిన వేళ. మబ్బులు కమ్మిన ఆకాశం నుంచి వానచినుకులు కురిస్తే. ఆ ప్రేమికుల ఆనందానికి అవధులు వుంటాయా? ఉండవంటే ఉండవు. ఆత్మబలం సినిమాలోని చిటపట చినుకులు పడుతూ వుంటే పాట అదే చెబుతుంది. జోల పాటలకి మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా తల్లి తన పాపాయికోసం పాడే ఈ పాటలు ఎంతో ప్రేమతో నిండి ఉంటాయి. మేనత్తపాడే పాటలు ఇంకానూ.. తోడు నీడ సినిమాలో ఆత్రేయ రాసిన అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా పాట వింటే మీకే తెలుస్తుంది. ఇందులో అమ్మలు కన్నుల్లు తమ్మి పువ్వుల్లు అని ఆత్రేయ చేసిన ప్రయోగం అద్భుతం. ఆత్రేయ కలం నుంచి భక్తి రసం తరాల కొద్దీ పాడుకునేలా సిరాల కొద్దీ ఒలికింది. కలియుగాంతం వరకు తిరుమలవాసుని భక్తులు పాడుకునే పాటలు చాలానే రాశారాయన! శ్రీవేంకటేశ్వర మహత్య్మంలోని శేష శైల వాసా శ్రీ వెంకటేశ పాట, వాగ్దానంలో వెలుగుచూపవయ్య మహిలో పాట, శ్రీ వేంకటేశ్వరవైభవంలో తెర తీయరా తిరుపతి దేవరా పాట మచ్చుకు కొన్ని. కలడందురు కలడు కలడను వాడు కలడో లేడో, గజేంద్రమోక్షంలో మకరి బారిన పడిన కరికొచ్చిన సందేహం. అచ్చంగా పోతనామాత్యుడిలాగే ఆత్రేయకూ వచ్చింది ఈ అనుమానం. అందుకే భక్తు తుకారం సినిమాలో ఉన్నావా అసలున్నావా అంటూ నిలదీస్తారు. నీ పేరిట ఇన్నేసి హింసలు. ఆరాచకాలు. అన్యాయాలు జరుగుతుంటే అసలు నువ్వున్నావా దేవుడా అంటూ నిందిస్తాడు. శ్రీవేంకటేశ్వరమహత్యం సినిమాలో ఎప్పుడైనా ఎన్నాళ్లని నా కన్నులు కాయక ఎదురుచూతురా అన్న పాటను మనసు పెట్టి విన్నారా? చిన్ని కృష్ణుడి కోసం ఎదరుచూస్తూ వున్న వకుళాదేవి నిజంగానే పాటపాడితే అది ఇంత గొప్పగా వుండదేమో! దేశభక్తి పాటలకైతే లెక్కేలేదు. బడిపంతులు సినిమాలోని భారత మాతకు జేజేలు అందులో ప్రథమస్థానం. ఇప్పటికీ మననోళ్లలో నానుతున్న పాటల గురించి కూడా చెప్పుకుందాం! రేపంటి రూపం కంటి (మంచీచెడూ), ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా (సిరిసంపదలు), ఎవరికి ఎవరు కాపలా (ఇంటికిదీపం ఇల్లాలు), చెంగావి రంగు చీర (బంగారుబాబు), పాహి రామప్రభో (వాగ్దానం), నీవు లేక వీణ పలకలేనన్నది (డాక్టర్ చక్రవర్తి), దేవుడనే వాడున్నాడా (దాగుడు మూతలు), ఎక్కడ ఉన్నా ఏమైనా (మురళీకృష్ణ), మాను మాకును కాను (మూగమనసులు), పాండవులు పాండవులు తుమ్మెద (అక్కా చెల్లెలు), కనులు కనులతో (సుమంగళి), తాగితే మరచిపోగలను (ప్రేమనగర్), ఈ జీవన తరంగాలలో (జీవన తరంగాలు), బూచాడమ్మ( బడిపంతులు), తెరతీయరా తిరుపతి దేవరా (శ్రీ వేంకటేశ్వర వైభవం), ఎవరో జ్వాలను రగిలించారు (డాక్టర్ చక్రవర్తి), బలే బలే మొగాడివోయ్ (మరో చరిత్ర), నువు లేక అనాథలం (షిర్డిసాయిబాబా మహత్యం), దేవుడే ఇచ్చాడు ఇక వీధి, ఏమిటి లోకం పలుగాకుల లోకం, తాళికట్టు శుభవేళ (అంతులేని కథ)..ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు సరిపోవు.
స్వతంత్రదేశంలోని అసమానతలను. స్థితిగతులను ఆకలిరాజ్యం సినిమాలో సాపాటు ఎటూ లేదు అన్న పాటలో ఆత్రేయ విడమర్చి చెప్పారు. ఆత్రేయ ఎక్కువగా రాత్రుళ్లే పాటలు రాస్తారు కాబట్టి కొందరాయన్ను రాత్రేయ అన్నారు. కొన్ని పాటల్లో ద్వందార్ధాలు నింపాడు కాబట్టి ఇంకొందరాయన్ను కాస్త పచ్చిగా బూత్రేయ అన్నారు. నిర్మాతల బలవంతమో, దర్శకుల పంతమో తెలియదు కానీ..ఆయన కొన్ని చిలిపి పాటలూ రాశారు. గమ్మత్తేమిటంటే..అప్పటి తరాన్ని అవి గట్టిగా ఆకర్షించాయి. మత్తులా ఆవరించాయి. నాకూ చావుకి అస్సలు పడదు…నేనున్నచోటకి అదిరాదు…అదొస్తే నేనుండను అని ఛలోక్తులు విసిరేవారు ఆత్రేయ. కానీ మరణం ఆయనకి దగ్గరయ్యింది. ఆయన మనకు దూరమయ్యారు. కానీ పాటలతో మనకు రోజురోజుకీ దగ్గరవుతున్నారు. నిజంగానే ఆత్రేయకి టైమ్‌సెన్స్ లేదు. అందుకే ఆ మహారచయిత అప్పుడే మనకి దూరమైపోయారు. టైమ్‌కి పాటలు రాయకపోయినా ఆల్‌టైమ్ హిట్స్ ఇచ్చారు. అందరినీ ఏడిపించినా ఆనందబాష్పాలు కురిపిస్తున్నారు. ఆత్రేయ అన్నట్టుగా పోయినోళ్లందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు.