
టాలీవుడ్ దర్శకులు అద్భుతమైన సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మన డైరెక్టర్స్, నటీనటులకు విశేష గుర్తింపు వచ్చింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి లాంటి వాళ్లు ఆట్టుకున్నారు. తాజాగా మరో టాలీవుడ్ డైరెక్టర్ కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేసింది. అందులో సినిమా రంగం నుండి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య ఆనందం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు.
అమెరికన్ డాక్టరేట్ గౌరవాన్ని తల్లిదండ్రులకు డెడికేట్ చేస్తున్నానని అన్నారు. ఇండస్ట్రీలో కాకుండా మరో ఉన్నతమైన హోదాలో ఉండేలా తన తల్లి కోరుకుందని, అయితే చివరకు ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం తనకు ఎంతోగానో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తనకే కాకుండా తన తల్లికి కూడా మిక్కిలి సంతోషం ఇచ్చిందన్నారాయన. తన సేవలను గుర్తించినందుకు అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ కు ఆదిత్య థ్యాంక్స్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ Mr నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ, టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. “మనసంతా నువ్వే” “నేనున్నాను” వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్.