Bengal Elections: బెంగాల్ ప్రచారానికి తారల మెరుపులు.. స్టార్ల క్యాంపెయిన్‌‌తో గ్లామరస్‌‌గా ఎన్నికల పర్వం

|

Mar 10, 2021 | 7:56 PM

మార్చి 27న తొలి విడత పోలింగ్ జరగనుండడంతో బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తారలు తళుక్కుమంటున్నారు. అధికార తృణమూల్, బీజేపీల తరపున సినీ తారలు పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దిగారు.

Bengal Elections: బెంగాల్ ప్రచారానికి తారల మెరుపులు.. స్టార్ల క్యాంపెయిన్‌‌తో గ్లామరస్‌‌గా ఎన్నికల పర్వం
Follow us on

Star attraction in Bengal Elections: దేశంలో అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నవి బెంగాల్ ఎన్నికలే అంటే అతిశయోక్తి కాదు. మూడో టెర్మ్ కోసం యధాశక్తి ప్రయత్నిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ అధినాయకత్వం.. వెరసి బెంగాల్ పోల్ పర్వం ఆసక్తికరంగా మారింది. దానికి తోడు ఎన్నికల హింసకు పెట్టింది పేరైన బెంగాల్‌లో ఇపుడు హోరాహరీ ప్రచారం కొనసాగుతోంది. మార్చి 27న తొలి విడత పోలింగ్ జరగనుండడంతో బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తారలు తళుక్కుమంటున్నారు. అధికార తృణమూల్, బీజేపీల తరపున సినీ తారలు పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దిగారు.

అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ.. బెంగాలీ సినీ తారలను తమ తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేర్చుకున్నారు. ఒకవైపు ఇంకా చేరికలు కొనసాగుతుండగా.. ఆల్‌రెడీ చేరిన వారు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటి దాకా స్రవంతి చటర్జీ, పాయల్ సర్కార్, యశ్ దాస్ గుప్తా, హిరెన్ చటర్జీ తదితరులు బీజేపీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్‌లో సంయుతికా బందోపధ్యాయ్, సయానీ ఘోష్, కాంచన్ మల్లిక్, రాజ్ చక్రవర్తి, జూనె మలియా, సుదేష్ణ రాయ్, మనాలి డే, దర్శకుడు రాజ్ చక్రవర్తి తదితరులు చేరారు. సినీ తారలు ప్రచారానికి గ్లామర్‌ను తెస్తుండగా.. తమ వాడీ వేడీ ప్రసంగాలతో ఆకట్టుకునే పలువురు రాజకీయ, సినీ తారలతో బీజేపీ ఓ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రూపొందించింది. వారి ప్రచార షెడ్యూలును ప్లాన్ చేసేందుకు, పర్యవేక్షించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది బీజేపీ.

బీజేపీ ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, తారలున్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 40 మంది దాకా వున్నారు. ఈ జాబితాలో ఆరేడుగురు జాతీయ స్థాయి నేతలు కాగా.. మిగిలిన వారి రాష్ట్రానికి చెందిన వారు. జాతీయ స్థాయి నేతల్లో… ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, నితిన్ గడ్కరీ, దర్మేంద్ర ప్రధాన్, కైలాశ్ విజయ్ వర్గీయ, దిలీప్ గోష్ తదితరులున్నారు. ప్రముఖ బాలీవుడ్ వెటరన్ యాక్టర్, రాజకీయ నేత మిథున్ చక్రవర్తి, ఉషా ప్రకాశ్, ముఖుల్ రాయ్, దిలీప్ ఘోష్, జువెల్ రాము, సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీ, అమిత్ మాలవ్యా, బాబుల్ సుప్రియో, దేవాషిష్ చౌదరీ, రూపా గంగూలీ, లోకేష్ చటర్జీ, రాజు బెనర్జీ తదితరులు బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుమారు పదహేనేళ్ళ పాటు కాంగ్రెస్ పాలనలో వున్న బెంగాల్‌ ఆ తర్వాత పదేళ్ళ పాటు పలు మార్లు రాష్ట్రపతి పాలనలతో కొనసాగింది. ఆ తర్వాత 1977లో మొదలైన కమ్యూనిస్టుల హవా 2011 దాకా కొనసాగింది. బెంగాల్‌ను సుదీర్ఘ కాలంపాటు సీపీఎం దిగ్గజం జ్యోతిబసు పాలించారు. 2011లో తొలిసారిగా కమ్యూనిస్టుల ఖిల్లాను హస్తగతం చేసుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ. 2011 నుంచి రెండు విడతలుగా దీదీ బెంగాల్ రాణిగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కమ్యూనిస్టుల కాలంలో అన్నిరంగాల్లోను వామపక్ష భావజాలం గల వ్యక్తులనే చొప్పించిన నేపథ్యంలో పూర్తి ప్రక్షాళణకు దీదీ నడుం కట్టారు. అయితే ఎర్ర సోదరుల స్థానంలో తమ పార్టీ మద్దతు దారులను ప్రభుత్వ విభాగాల్లో చొప్పిస్తూ వస్తున్నారు మమతా బెనర్జీ.

బెంగాల్‌ను చేజిక్కించుకుని పదేళ్ళ అవుతున్న నేపథ్యంలో మమతాబెనర్జీ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే.. గతానికి భిన్నంగా ఆమె పార్టీ నుంచి పలువురు సీనియర్లు ఆమె ఆధిపత్య ధోరణితో విసిగి వెళ్ళిపోయారు. వీరిలో పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎట్టి పరిస్థితుల్లో అటు కమ్యునిస్టులు- కాంగ్రెస్ కూటమికి, ఇటు బీజేపీకి అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో ప్రచారంలో ధీటుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైన తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి.. బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది.

ALSO READ: 90 రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణకు సన్నాహాలు

ALSO READ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వింత ధోరణి.. ఒకటి కాకపోతే రెండివ్వాలంటున్న అభ్యర్థులు

ALSO READ: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరం.. మండళ్ళలో నెమ్మదిగా మారుతున్న సమీకరణాలు

ALSO READ: 21ఏళ్ళలో 10మంది ముఖ్యమంత్రులు.. పూర్తి టెర్మ్ వున్న సీఎం ఒక్కరే.. ఇదీ ఉత్తరాఖండ్ హిస్టరీ