Debashree Roy – West Bengal politics: పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎటుచూసినా ఎన్నికల హాడావుడి నెలకొంది. ఓ వైపు నేతల మాటల తూటాలతో రాజకీయాలు వేడెక్కుతుంటే.. మరో వైపు వలసల ప్రక్రియ మాత్రం ఆగేలా కనపించడం లేదు. ఇప్పటికే బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ నుంచి చాలామంది బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరోషాక్ తగిలింది. టీఎంసీలో కీలక మహిళా నాయకురాలు, నటి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో తాజాగా ప్రముఖ సినీ నటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపించారు.
ఈ రోజుతో తృణమూల్ కాంగ్రెస్‌తో తనకు ఉన్న అన్ని బంధాలు తెగిపోయాయంటూ దేబశ్రీ రాయ్ ప్రకటించారు. పార్టీలో ఏ కీలక పదివి లేదు కనుకే రాజీనామా చేస్తున్నాను అనుకుంటున్నారు.. కానీ అది వాస్తవం కాదని పేర్కొన్నారు. తాను పదేళ్లుగా రేడిఘి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించానని.. ప్రస్తుతం అన్ని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానన్నారు. తనకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజీనామా విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేశానని.. సుధీర్ఘ కాలం ప్రజా సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలంటూ దేబశ్రీ రాయ్ లేఖలో పేర్కొన్నారు.
దేబశ్రీ రాయ్.. 24 పరగణాల జిల్లాలోని రేడిఘి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమెకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఇక భవిష్యత్ ప్రణాళికలపై కొందరు ప్రశ్నించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దేబశ్రీ తెలిపారు. అయితే నటి దేబశ్రీ రాయ్ బీజేపీలో చేరుతారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. 2019లోనే ఆమె బీజేపీలో చేరాలని భావించారు.. కానీ అప్పటి పరిస్థితుల్లో ఆమె వెనక్కి తగ్గారు. ఇటీవల చాలామంది నటీనటులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా.. ఈ నెల 27న బెంగాల్లో తొలిదశ పోలింగ్ జరగనుంది. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: