Battle for Bengal: నాలుగో దఫాలో 60 శాతం కొత్తముఖాలతో పోటీకి తృణమూల్..కులాల లెక్కలతో బీజేపీ పోటీకి రె’ఢీ’!

పశ్చిమ బెంగాల్ నాలుగో దఫా ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Battle for Bengal: నాలుగో దఫాలో 60 శాతం కొత్తముఖాలతో పోటీకి తృణమూల్..కులాల లెక్కలతో బీజేపీ పోటీకి రె'ఢీ'!
Battle For Bengal
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 03, 2021 | 7:31 PM

Battle for Bengal: పశ్చిమ బెంగాల్ నాలుగో దఫా ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపికలో పెద్ద కసరత్తే చేశాయి. తన ప్రభుత్వ వ్యతిరేక ఓటును తప్పించుకునేందుకు తృణమూల్ ఎన్నికలు జరగనున్న సాధనాల్లో 60 శాతం కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. మరోవైపు బీజేపీ కూడా అందుకు తగ్గట్టుగా కులం కార్డుతో పోటీకి సై అంటూ సిద్ధం అయింది. ఈ దఫా ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగిన రాజబొంగ్శిస్ వర్గానికి మెజారిటీ సీట్లు కేటాయించింది. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

బెంగాల్ లో నాలుగో దఫా ఎన్నికలు ఏప్రిల్ 10న జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న స్థానాల్లో హీట్ పెరిగిపోయింది. ఈ దఫా ఉత్తర బెంగాల్ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం ఈ విడతలో 44 సీట్లకు ఎన్నికలు జరగనుంది. వీటిలో 14 స్థానాలు రెండు ఉత్తర బెంగాల్ జిల్లాలు కూచ్ బీహార్, జల్పాయిగురిల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాలు కోల్ కతాకు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

జల్పాయిగురి జిల్లలో 5 చోట్ల, కూచ్ బీహార్ లో 9 చోట్ల ప్రజలు తమ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు.

మిగిలిన స్థానాలు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో హౌరాలో 9 స్థానాలు, హూగ్లీ లో 10 స్థానాలు, సౌత్ 24 పరిగణ జిల్లాలో 11 స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.

2016 ఎన్నికల్లో ఇలా..

బెంగాల్ అసెంబ్లీకి 2016లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 44 సీట్లకు గాను 39 సీట్లలో విజయాన్ని సాధించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) రెండు స్థానాల్లోనూ, బీజేపీ, కాంగ్రెస్, ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలు ఒక్కో స్థానంలోనూ విజయం సాధించాయి.

తృణమూల్ కు దెబ్బ..

అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని నమోదు చేసిన టీఎంసీకి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో ఈ 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఎంసీ 25 స్థానాలలోనూ, బీజేపీ 19 స్థానాల్లోనూ ముందంజ వేశాయి. మిగిలిన పార్టీలన్నీ ఇక్కడ పక్కకు జరిగిపోయాయి.

ప్రభుత్వ వ్యతిరేకత..

టీవీ 9 ఎలక్షన్ ఇంటిలిజెన్స్, రీసెర్చ్ వింగ్ ఈ దఫా ఎన్నికలు జరగనున్న 44 స్థానాలకు సంబంధించి చేసిన విశ్లేషణలో ఆసక్తి కర విషయాలు కనిపించాయి. ఇక్కడ అన్నిచోట్లా తృణమూల్ కు ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుదిబండగా మారే అవకాశం ఉన్నట్టు స్పష్టం అయింది. దీంతో టీఎంసీ అధినాయకత్వం ఈ 44 స్థానాల్లో ఎక్కువ శాతం కొత్తముఖాలను బరిలోకి దించింది.

కూచ్ బీహార్ జిల్లాలో..

ఇక్కడ 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 6 స్థానాల్లో కొత్తవారికి మమతా అవకాశం ఇచ్చారు. ఇక్కడి 9 సీట్లలోనూ 7 సీట్లలో 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మమతా బెనర్జీ జాగ్రత్త పడ్డారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా కొత్తవారిని బరిలో దింపుతున్నారు.

జలపాయిగురి జిల్లాలో..

ఈ జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీకి గట్టి పట్టుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లోనూ బీజేపీ హవా కనిపించింది. దీంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు 4 గురు కొత్తవారిని తృణమూల్ కాంగ్రెస్ పోరులో నిలిపింది.

సౌత్ 24 పరాగణ జిల్లాలో..

ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న 11 స్థానాల్లోనూ అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీ తన సత్తా చాటింది. అయినప్పటికీ మమతా బెనర్జీ ఈసారి ఎన్నికల్లో ఇక్కడ కూడా 5 గురు కొత్తవారిని ఎన్నికల్లో నిలబెట్టారు.

హౌరా జిల్లాలో..

హౌరా జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. టీఎంసీకి ఇక్కడ గట్టి పెట్టె ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ 9 సీట్లలోనూ 8 సీట్లలో టీఎంసీ ముందంజలోనే ఉంది. కానీ, ఇక్కడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లలో 7 సీట్లకు పూర్తిగా కొత్తవారిని ఎంపిక చేశారు మమతా బెనర్జీ.

హుగ్లీ  జిల్లాలో..

పది స్థానాల్లో హుగ్లీ జిల్లాలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ 2019 ఎన్నికల్లో 4 సీట్లలో టీఎంసీ లీడింగ్ లోఉంది. ప్రస్తుత ఎన్నికల కోసం మొత్తం పది స్థానాలకు గాను 5 స్తానాల్లో కొత్త వారిని ఎంపిక చేశారు.

ఇలా మొత్తమ్మీద తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎదుర్కోవడం కోసం నాలుగో దఫా ఎన్నికలు జరగనున్న 44 స్థానాల్లో 27 స్థానాలకు కొత్తవారిని ఎంపిక చేసి గెలుపు కోసం ప్రయత్నం చేస్తోంది.

తృణమూల్ కాంగ్రెస్ తరపున నాలుగో దఫా ఎన్నికల్లో బరిలో ఉన్న కొందరు  ప్రముఖులు..

కూచ్ బీహార్ జిల్లాలోని దిన్హాతా నియోజకవర్గంలో ఉదయం గుహ, సౌత్ 24 పరిగణ జిల్లాలోని టోలీగంజ్ నియోజకవర్గం నుంచి మంత్రి అరూప్ బిస్వాస్, అదే జిల్లా బెహలా నియోజకవర్గ నుంచి మంత్రి పార్త్ ఛటర్జీ, హౌరా జిల్లా శిబి పూర్ నియోజకవర్గంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారి, ఇక హుగ్లీ జిల్లాలోని సింగూర్ అసెంబ్లీయే సీటుకు మమతా బెనర్జీ సింగూర్ పోరాటంలో తోడుగా నిలిచిన బిచారం మన్నా బరిలో ఉన్నారు.

 బీజేపీ తరఫున ఈ దఫా ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రముఖులు వీరే..

టోలీగంజ్ లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, చూచురాలో ఎంపీ లాకెట్ చటర్జీ, దిన్హాతాలో ఎంపీ నిషిత్ ప్రమానిక్, డోమ్ జూర్ లో మాజీ మంత్రి, టీఎంసీ నాయకుడు రాజీబ్ బెనర్జీ, చండితాలా నియోజకవర్గం నుంచి నటుడు యాష్ దాస్ గుప్తా, జాదవ్ పూర్ నుంచి మాజీ కౌన్సిలర్ రింకు నాస్కార్, బాలీ నియోజకవర్గం నుంచి టీఎంసీ మాజీ ఎమ్మెల్యే బైశాలి దాల్మియా పోటీలో ఉన్నారు.

లెఫ్ట్-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ కూటమి తరఫున పోటీలో ఉన్న ప్రముఖులు..

చండితాలా నియోజకవర్గం నుంచి మాజీ ఎంపి, సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎండి సలీం, బాలీ స్థానం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి డిప్షితా ధార్, జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి వామపక్ష మాజీ ఎంపీ, సిట్టింగ్ శాసనసభ్యుడు సుజాన్ చక్రవర్తి, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్దుల్ మన్నన్ చాంప్ దాని స్థానం నుంచి, వామపక్ష యువ నాయకుడు శతరూప్ ఘోష్, బెహాలా వెస్ట్‌కు చెందిన కౌన్సిలర్ నిహార్ భక్ట్ బెహలా స్థానం నుంచి, భంగార్ నుండి ఎండి నౌషద్ సిద్దిఖీ, ఐఎస్ఎఫ్ నాయకుడు అబ్బాస్ సిద్దిఖీ సోదరుడు, ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు డెబా ప్రసాద్ రాయ్ ఉత్తర బెంగాల్‌లోని అలీపూర్‌దువార్స్‌ నియోజకవరాగం నుంచి పోటీలో నిలిచారు. నాలుగో దఫా ఎన్నికలు జరగనున్న స్థానాల్లో వర్గాల వారీగా విశ్లేషిస్తే.. ముస్లింలు 20 శాతం, షెద్యూల్ కులాలు 24 శాతం, షెడ్యూల్ తెగలు 4 శాతం ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు జరగనున్న 44 నియోజకవర్గాల వారీగా చూస్తే వీటిలో 18 స్థానాల్లో 20 శాతం ముస్లింలు, 12 సీట్లలో 20 శాతం రాజబొంగ్షి, మూడు సీట్లలో 20 శాతం తేయాకు తోటల కార్మికులు ఉన్నారు. బీజేపీ పూర్తిగా రాజబొంగ్షి, తేయాకు తోటల కార్మికుల ఓట్ల పై ఆధార పడింది. సౌత్ 24 పరాగణాల జిల్లాలో ముస్లిం ఓటు శాతం అధికంగా ఉంది. అయితే, అక్కడ అబ్బాస్ సిద్దిఖీ బీజేపీ కి అనుకూలంగా ఉంటుందని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. అక్కడి మైనార్టీ ఓట్లను అబ్బాస్ సిద్దిఖీ చీలుస్తారని భావిస్తున్నారు.

ఇక దక్షిణ బెంగాల్ లో అంఫాన్ తుపాను సమయంలో జరిగిన అవకతవకల పై బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేసింది అన్ని ప్రచార సభల్లోనూ బీజేపీ నాయకులు ఇదే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా సీట్ల కేటాయింపు స్ట్రాటజీ కూడా బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. జాదవ్ పూర్ లెఫ్ట్ పార్టీలకు పట్టు ఉన్న ప్రాంతం. ఇక్కడ లెఫ్ట్ పార్టీల తరఫున గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రింకు నస్కర్ ను నిలబెట్టడం కలిసొస్తుందని లెక్కలు కడుతున్నారు. 2014 లో లోక్ సభ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా..2015 లో కోల్ కతా మునిసిపల్ ఎన్నికల్లో ఆమె ఆమె విజయం సాధించారు. ఇక అధికార తృణమూల్ కాంగ్రెస్ మాత్రం 60 శాతం కొత్త ముఖాలను ఎన్నికల బరిలో నిలబెట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎదుర్కోగలం అనే ధీమాలో ఉంది.