Tripura Polls 2023: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. భారీ బందోబస్తు ఏర్పాట్లు.. బరిలో 259 మంది అభ్యర్థులు
ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం (ఫిబ్రవరి 16)నాడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అధికార బీజేపీ, లెఫ్ట్ - కాంగ్రెస్ కూటమి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది.
Tripura Assembly Polls 2023: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రం ముగిసింది. పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఆ రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం (ఫిబ్రవరి 16)నాడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అధికార బీజేపీ, లెఫ్ట్ – కాంగ్రెస్ కూటమి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. అక్కడ గత నెల రోజులుగా అక్కడ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీపీఎం తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీనియర్ నేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్, మాజీ సీఎం మానిక్ సర్కార్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధిర్ చౌదరి, దీపాదాస్ మున్షీ తదితరులు ప్రచారం నిర్వహించగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల బరిలో 259 మంది అభ్యర్థులు ఉండగా.. వీరిలో 20 మంది మహిళలు ఉన్నారు. బీజేపీ 55 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతుండగా.. దాని మిత్రపక్షం ఐపిఎఫ్‌టి ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ, ఐపిఎఫ్‌టి మధ్య ఒక స్థానంలో స్నేహ పూర్వక పోటీ నెలకొంటోంది.
సీపీఎం 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 13 స్థానాల్లో బరిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.. స్వతంత్ర అభ్యర్థులు 58 మంది పోటీ చేస్తున్నారు.
దాదాపు 28.13 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. మొత్తం 3328 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపనున్నారు.
అధికార బీజేపీ , కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. గిరిజనుల ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న త్రిపుర రాజకుటుంబీకుడు ప్రద్యోత్ కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తిప్రా గిరిజన రాష్ట్రం నినాదంతో ఈ పార్టీ రంగం లోకి దిగింది. మన భూమి .. మన పాలన అన్న ప్రద్యోత్ స్లోగన్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. త్రిపుర అసెంబ్లీలో 20 సీట్లు గిరిజనులకు కేటాయించారు. ఈ సీట్లలో తిప్రా కీలక పాత్ర పోషించబోతోంది.
మరిన్ని ఎన్నికల కథనాలు చదవండి..