Tirupati By-Election becoming interesting one: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక తేదీ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రహసనాన్ని వేగవంతం చేశాయి. అధికార వైసీపీ ఏకంగా అభ్యర్థిని డిక్లేర్ చేసేసింది. డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్ సభ బరిలోకి దింపాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలుగు రాష్ట్రాలలో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో తిరుపతి లోక్‌సభ సీటుతోపాటు తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనా సోకి మరణించడంతో తిరుపతికి, సిట్టింగ్ ఎమ్మెల్య నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు చోట్ల అధికార పార్టీకి చెందిన సభ్యులే మరణించడంతో.. ఆ సీట్లను కోల్పోవద్దన్న కృత నిశ్చయంతో అధికార పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
తిరుపతి లోక్‌సభ నుంచి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఒకరికి టిక్కెట్ దక్కవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి గురుమూర్తి పేరు తెరమీదికి వచ్చింది. అనుకున్నట్లుగానే వైసీపీ అధిష్టానం డా.గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మినే రంగంలోకి దింపాలని నిర్ణయించింది. జనసేనతో కలిసి పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ తామే బరిలో నిలుస్తామని ప్రకటించింది. అభ్యర్థి ఎంపికను వేగవంతం చేసింది.
తాజాగా ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన ప్రకారం తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ మార్చ 23న జారీ అవుతుంది. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ మూడో తేదీ దాకా ఉపసంహరణలకు అవకాశం వుంటుంది. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మే రెండో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాన్ని వెల్లడిస్తారు. కాగా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి సర్వేపల్లి, గూడూరు (ఎస్సీ రిజర్వుడు), సూళ్ళూరుపేట (ఎస్సీ), వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు (ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కాగా.. తిరుపతి లోక్‌సభ సీటు చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. 1952లో ఈ ఎంపీ సీటుకు తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి రెండు సార్లు అంటే 1952, 1957 ఎన్నికల్లో తిరుపతి నుంచి మాఢభూషి అనంతశయనం అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునే సీ.దాస్ ఎంపీగా తిరుపతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రెండు సార్లు 1971, 1977లలో కాంగ్రెస్ పార్టీ తరపున టీ. బాలకృష్ణయ్య, 1980లో పసల పెంచలయ్య (కాంగ్రెస్) తిరుపతి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1984లో తిరుపతి ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీకి దక్కింది. చింతామోహన్ టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు.
ఇదే చింతా మోహన్ 1989, 1991లలో కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996 మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీగా గెలిచారు. 1998లో తిరిగి టీడీపీలో చేరిన చింతామోహన్ తిరుపతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరుపతి సీటు బీజేపీకి దక్కింది. టీడీపీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ తరపున తిరుపతి ఎంపీగా నందిపాకు వెంకటస్వామి గెలుపొందారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ తిరుపతి ఎంపీగా గెలుపొందారు. 2014లో వెలగపల్లి వరప్రసాద రావు, 2019లో బల్లి దుర్గాప్రసాద్ రావు వైసీపీ తరపున గెలుపొందారు. మొత్తమ్మీద తిరుపతి నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఘనత చింతా మోహన్‌కు దక్కింది. ఆయన మొత్తమ్మీద ఆరు సార్లు (రెండు సార్లు టీడీపీ తరపున, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున) తిరుపతి ఎంపీగా విజయం సాధించారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు 47.84 శాతంతో 5 లక్షల 80 వేల 376 ఓట్లు సాధించారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కారుమంచి జయరామ్ బీజేపీ తరపున పోటీ చేసి 44.76 శాతంతో మొత్తం 5 లక్షల 42 వేల 951 ఓట్లు సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ పోటీ చేసి కేవలం 33 వేల 333 ఓట్లు సాధించగలిగారు. కొత్తపల్లి సుబ్రహ్మణ్యం (సిపిఎం) 0.92 శాతంతో 11 వేల 168 ఓట్లు సాధించారు. నోటాకు 2.94 శాతంతో 35 వేల 420 ఓట్లు పడ్డాయి.
2019లో జరిగిన సాధారణ ఎన్నికలల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున బల్లి దుర్గా ప్రసాద్ రావు పోటీ చేసి విజయం సాధించారు. దుర్గా ప్రసాద్ రావు 55.03 శాతంతో ఏడు లక్షల 22 వేల 877 ఓట్లు సాధించారు. ఆయన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పనబాక లక్ష్మపై 2 లక్షల 28 వేల 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పనబాక లక్ష్మకి 37.65 శాతంతో 4 లక్షల 94 వేల 501 ఓట్లు పడ్డాయి. నోటాకు 1.96 శాతంతో 25 వేల 781 ఓట్లు రాగా.. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చింతా మోహన్‌కు 1.84 శాతంతో 24 వేల 39 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి శ్రీహరి రావుకు 1.60 శాతంతో 20 వేల 971 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బి. శ్రీహరి రావుకు 1.22 శాతంతో 16 వేల 125 ఓట్లు పడ్డాయి.
కాగా ఈసారి ఉప ఎన్నికలో తిరుపతిలో త్రిముఖ పోటీ జరగే అవకాశం వుంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలతో బీజేపీ-జనసేన కూటమి పోటీ పడబోతోంది. తిరుపతి ఏరియాలో కాపు సామాజిక వర్గం ఓట్లు బాగానే వుండడంతో జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. అధికార వైసీపీకి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా వున్న నేపథ్యంలో తిరుపతిని వైసీపీనే నిలబెట్టుకుంటుందని, ఆ పార్టీ అభ్యర్థి డా. గురుమూర్తి ఉప ఎన్నికలో విజయం సాధిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.