Tamilnadu Elections: తమిళనాట రాజకీయ పార్టీల ప్రచారం వేగవంతం.. అన్ని సర్వేల్లో ఆ పార్టీనే విజేత!
ఏప్రిల్ ఆరో తేదీన పోలింగ్ జరగబోతున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల నేతల, శ్రేణులు యధాశక్తి ప్రజల్లో సంచరిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థలు.. ప్రజాభిప్రాయాన్ని (ఒపీనియన్ పోల్) సేకరించడంలో ఆసక్తి చూపిస్తున్నారు.
Tamilnadu Elections surveys showing DMK as winner: ఏప్రిల్ ఆరో తేదీన పోలింగ్ జరగబోతున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీలన్నీ తమతమ కూటముల ప్రాతిపదికన ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీ విధానాలకు అనుగుణంగా మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. మ్యానిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు రాజకీయ పార్టీల నేతల, శ్రేణులు యధాశక్తి ప్రజల్లో సంచరిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థలు.. ప్రజాభిప్రాయాన్ని (ఒపీనియన్ పోల్) సేకరించడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. దాదాపు 70 శాతం సర్వేలు తమిళనాట ద్రవిడ మున్నేగ్ర కజగం (డిఎంకే)దే అధికారమని చాటుతున్నారు. తాజాగా ఏబీపీ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలోనే అదే తేలడం విశేషం.
తమిళనాడులో గత పదేళ్ళుగా అన్నా డిఎంకే అధికారంలో వుంది. 2016లో రెండోసారి అధికార పగ్గాలను సాధించిన జయలలిత ఆ తర్వాత కొంత కాలానికే అనారోగ్యంతో మరణించారు. 2016 డిసెంబర్ 5వ తేదీన ఆమె మరణించారు. దాంతో తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకే అంటే 2018 ఆగస్టు 7వ తేదీన మరో తమిళ దిగ్గజ నేత, డిఎంకే అధినేత కరుణానిధి కూడా చనిపోయారు. తమిళనాట రాజకీయాలను రెండున్నర దశాబ్దాల పాటు శాసించిన జయలలిత, కురు వృద్ధ నేత కరుణానిధి మరణాలతో తమిళనాడులో కొత్త రాజకీయ శక్తులకు అవకాశం ఏర్పడింది. డిఎంకే పగ్గాలను అప్పటికే సీనియర్ నేతగా మారిన కరుణానిధి తనయుడు స్టాలిన్ చేపట్టగా.. జయలలిత పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. జయలలిత వారసురాలిగా ఆమె అనుంగ సహచరి శశికళ పార్టీ పగ్గాలను చేపట్టారు. కానీ ఆమెను దురదృష్టం వెన్నాడింది. అక్రమాస్తుల కేసులో ఏ1గా వున్న జయలలిత మరణించగా.. ఏ2గా వున్న శశికళకు నాలుగేళ్ళ కారాగార శిక్ష పడింది. దాంతో జైలు శిక్ష ను తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో ఆమెను అదుపులోకి తీసుకుని బెంగళూరు పరప్పన జైలుకు తరలించారు. అప్పటికే కొంత కాలం ఆమె రిమాండు మీద జైలులో వుండడంతోపాటు సత్ప్రవర్తన కూడా కలిసి రావడంతో ఆమె 2020 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే, శశికళ జైలుకెళ్ళడంతో అన్నా డిఎంకే మీద పూర్తి పట్టు సాధించారు ముఖ్యమంత్రి ఎడప్పాడి ఫళని స్వామి.. ఆయన డిప్యూటీ ఓ. పన్నీరు సెల్వం. దాంతో జైలు నుంచి తిరిగి వచ్చినా శశికళకు పార్టీ మీద పట్టు సాధించడం సాధ్యపడలేదు. దాంతో ఆమె వ్యూహాత్మకంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. మరోవైపు జయలలిత, కరుణానిధి బతికి వున్నంత కాలం రాజకీయాల మీద మాట్లాడేందుకు సైతం జంకిన కమల్ హాసన్ లాంటి వారి సొంత పార్టీలు స్థాపించి, మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్‌గా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచారు. దాంతో అన్నా డిఎంకే, బీజేపీ, పీఎంకే లాంటి పార్టీలతో ఒక అలయెన్స్, డిఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మరో అలయెన్స్‌తోపాటు కమల్ కూటమి కూడా తమిళనాడు బరిలో ప్రధానంగా నిలిచింది. దినకరన్ సారథ్యంలో నాలుగో కూటమి కూడా వుంది. అందులో హైదరాబాదీ పార్టీ ఎంఐఎం కూడా చేరింది. అయితే దాని ప్రభావంపై పెద్దగా చర్చలు జరగడం లేదు. ఈ క్రమంలో అన్నాడిఎంకే, డిఎంకే, కమల్ కూటమిల మధ్య తమిళనాట ప్రధాన పోటీ అని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.
ఈ క్రమంలో వెల్లడవుతున్న.. సర్వేలు విపక్ష డిఎంకే కూటమికే మెజారిటీ వస్తుందని అంఛనా వేస్తున్నాయి. తమ ఒపీనియన్ పోల్‌లో ఇదే తేలిందంటున్నాయి. తాజాగా ఏబీపీ సర్వే కూడా డీఎంకేకు పట్టం కట్టేందుకు తమిళ ఓటర్లు సిద్ధమయ్యారని ప్రకటించింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే, ఈ సారి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పరుగులు తీస్తోంది. ఆపార్టీ అభ్యర్థులు 170కు పైగా స్థానాల్లో పోటీచేస్తున్నారు. మిత్రపక్షాలు కొన్ని డీఎంకే ఉదయించే సూర్యుని గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వెలువడ్డ రెండు సర్వేలు రాష్ట్రంలో డీఎంకే అలయెన్స్ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ప్రకటించాయి. తాజాగా ఏబీపీ-సీ ఓటర్స్ సర్వే కూడా ఇదే తేల్చింది. మార్చి 17వ తేదీన ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే తమిళనాడులో డీఎంకే కూటమి 234 అసెంబ్లీ సీట్లకుగాను.. 161 నుంచి 169 స్థానాలు చేజిక్కించుకోవడం ఖాయం అని తేలింది. అధికార అన్నాడీఎంకే పార్టీకి 53 నుంచి 61 స్థానాలు దక్కనున్నాయి. కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం ఖాతా తెరవబోతున్నది. రెండు నుంచి ఆరు సీట్లను కమల్ పార్టీ గెలుచుకునే పరిస్థితి వుంది. అలాగే దినకరన్ పార్టీ (ఏఎంఎంకే)కి 1 నుంచి 5 సీట్ల వరకు దక్కవచ్చని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది.
అన్నా డిఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి, సిట్టింగ్ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డిఎంకే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి స్టాలిన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తమిళనాడు ప్రజలకు ఎన్నో ఉచిత హామీలతో రెండు కూటమిలు తమ మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ‘ఆల్ ఫ్రీ’ హామీలతో ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు. ప్రజలతో మమేకమయ్యే రీతిలో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. తమను ఆదరించాలని ఓటర్లకు విఙ్ఞప్తులు చేస్తున్నారు. మార్చి 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 46 నియోజకవర్గాల్ని కలుపుతూ సిట్టింగ్ సీఎం ఫళని స్వామి సుడిగాలి ప్రచార ప్రణాళిక రూపొందించారు. మక్కల్ నీది మయ్యం నేత కమల్ తాను పోటీ చేస్తున్న కోవై (కోయంబత్తూరు) సౌత్ నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం సాగిస్తున్నారు. రోడ్‌షోను తలపించే రీతిలో కాసేపు, మరికాసేపు నడుచుకుంటూ, ప్రజలతో ముచ్చటిస్తూ తనను ఆదరించడమే కాదు, మార్పు నినాదంతో మక్కల్ నీది మయ్యం అభ్యర్థులందర్ని గెలిపించాలని కోరారు. రాజకీయాలు తనకు వృత్తి కాదని, బాధ్యత అని నినదిస్తూ ప్రచారం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువొత్తియూరులో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు పొన్నేరి, మాధవరం, అంబత్తూరు, ఆవడి, పూందమల్లి, మధురవాయిల్ నియోజకవర్గాల్ని కలుపుతూ ఆయన పర్యటన సాగింది.
ALSO READ: కరోనా వైరస్ భవిష్యత్ మార్పులపై యుఎన్ఓ సంచలన హెచ్చరిక..
ALSO READ: ఆయుధాల తయారీలో దూకుడు మీదున్న భారత్.. దిగుమతులు తగ్గి.. లోకల్ మేకింగ్ మెరుగుదల
ALSO READ: ఆసక్తి రేపుతున్న తిరుపతి బై-ఎలక్షన్.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు.. ఇక ప్రచార సంరంభం