Tamilnadu Elections party wise alliances details: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్యే ప్రధాన పోటీ వుంటుందనుకుంటే మూడు, నాలుగు కూటములు కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో రిజిష్ట్రర్డ్ రాజకీయ పార్టీలు చాలా ఎక్కువ. దాంతో ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని పార్టీలు తమ తమ బలాబలాలను చూపిస్తే… ఎంతో కొంత సీట్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తాయి. ఇలాంటి సందర్భంలోనే పెద్ద పార్టీలకు పెద్ద పరేషాన్ ఎదురవుతుంది. ఎందుకంటే చిన్న పార్టీలను అలా వదిలిస్తే.. వారితో కలిగే డ్యామేజీ ఒక్కోసారి మేజిక్ ఫిగర్‌ను అందుకోవడంపై ప్రభావం చూపిస్తాయి. అందుకనే అధికారం పొందాలనుకునే పెద్ద పార్టీలు.. చిన్నా చితక పార్టీలను కూడా కలుపుకుని పోతూ కూటములుగా జట్టు కడుతూ వుంటాయి.
జాతీయ రాజకీయాల్లో గత ముప్పై ఏళ్ళుగా సింగిల్ పార్టీ పాలిస్తున్న పరిస్థితి లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా బీజేపీకి పూర్తి బలం వున్నా అలయెన్స్ ప్రభుత్వంగానే వుంది. ఎన్డీయే కూటమి ఇపుడు దేశాన్ని పాలిస్తోంది. గత ముప్పై ఏళ్ళ పరిపాలనను పరిశీలిస్తే.. 1991 నుంచి 1996 వరకు కొనసాగిన పీవీ నరసింహారావు ప్రభుత్వం మినహా ఆ తర్వాత దేశాన్ని సింగిల్ పార్టీ పాలించింది లేదు. 2019 ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బీజేపీ బంపర్ విక్టరీ సాధించినా.. అంతవరకు తమతో కొనసాగిన చిన్నా చితకా పార్టీలను బీజేపీ వదులు కోలేదు. అందుకు ఫ్యూచర్ పాలిటిక్స్‌లో వచ్చే మార్పులే కారణం కావచ్చు.
ఇక తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలల్లో నాలుగు ప్రధాన అలయెన్సులు కనిపిస్తున్నాయి. అన్నాడిఎంకే సారథ్యంలో ఒకటి, డిఎంకే నేతృత్వంలో మరొకటి.. మక్కల్ నీది మయ్యం అధ్యక్షతన ఇంకొకటి.. కాగా.. టిటికే దినకరన్ పార్టీ ఏఎంఎంకే అధ్వర్యంలో నాలుగో అలయెన్సు ప్రస్తుత ఎన్నికల్లో తమిళనాట తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నాయి తొలి మూడు కూటములు.
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) సారథ్యంలోని కూటమిలో పట్టల్ మక్కల్ కచ్చి (పీఎంకే), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తమిళ మానీల కాంగ్రెస్ (టీఎంసీ) పెరుంథలైవర్ మక్కల్ కట్చి (పీఎంకే), తమిజగ మక్కల్ మున్నే కజగమ్ (టీఎంఎంకే), పురట్చి భారతం పార్టీ (పీబీపీ), మూవేందర్ మున్నేట్ర కజగమ్ (ఎంఎంకే), ఆలిండియా మూవేందర్ మున్నానీ కజగమ్ (ఏఐఎంఎంకే) పాసుంపన్ దేశీయ కజగమ్ (పీడీకే) పార్టీలున్నాయి. ఇందులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అన్నా డిఎంకే 179 సీట్లకు పోటీ చేస్తోంది. ఆ తర్వాత పీఎంకే 23 సీట్లలోను, బీజేపీ 20 సీట్లలోను, మానీల కాంగ్రెస్ 6 సీట్లలోను పోటీ చేస్తుండగా.. మిగిలిన పార్టీలన్నీ ఒక్కో సీటు నుంచి పోటీకి దిగాయి.
ఇక ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డిఎంకే) సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రెస్సివ్ అలయెన్స్ మొత్తం 234 స్థానాలకు పోటీ పడుతోంది. ఇందులో డీఎంకే 173 సీట్లలో పోటీకి దిగింది. కాంగ్రెస్ పార్టీ 26, సీపీఐ 6, సీపీఎం 6, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగమ్ 6, విదుతలై చిరుతైగల్ కట్చి 6, కొంగునాడు మక్కల్ దేసీయ కట్చి 3, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 3, మనితనేయ మక్కల్ కట్చి 2, ఏఐఎఫ్ బీ 1, తమిజగ వజ్వురిమల్ కట్చి 1, మక్కల్ విదుతలై కచ్చి 1, అతి తమిజర్ పెరవాయ్ 1 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
ఇక సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) నేతృత్వంలో మూడో కూటమి కూడా మొత్తం 234 సీట్లలో పోటీకి దిగింది. ఇందులో కమల్ పార్టీ 143 సీట్లలో పోటీ చేస్తూ కమల్ హాసన్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది. అలయెన్స్‌లోని ఇందియా జననాయగ కట్చి 40 సీట్లలోను, ఆల్ ఇండియా సమథువా మక్కల్ కట్చి 37 సీట్లలోను, తమిలగ మక్కల్ జననాయక కట్చి 11 సీట్లలోను, జేడీ(ఎస్) 3 సీట్లలోను పోటీకి దిగాయి. ఇక టీటీకే దినకరన్ పార్టీ ఏఎంఎంకే సారథ్యంలోని నాలుగో కూటమి తమిళనాడులో మొత్తం 189 సీట్లలో పోటీ చేస్తోంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ (ఏఎంఎంకే) 116 సీట్లలోను, దేశీయ ముర్ పొక్కు ద్రవిడ కజగమ్ 60 సీట్లలోను, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 6 సీట్లలోను, ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) 3 సీట్లలోను, గోకుల మక్కల్ కట్చి 1 సీటులోను, మురుదు సెనయ్ సంగం 1 సీటులోను, విదుతలై తమిల్ పులిగల్ కట్చి 1 సీటులోను, మక్కల్ ఆర్సు కట్చి 1 సీటులోను పోటీకి దిగాయి. ఈ నాలుగు కూటములే కాకుండా సాగయమ్ అనే మరో కూటమి కూడా తమిళ పాలిటిక్స్‌లో కనిపిస్తోంది. సాగయమ్ కూటమిలో సాగయం అరసియల్ 20 సీట్లోను, తమిళనాడు యూత్ పార్టీ 15 సీట్లలోను, వలమన తమిజగ కట్చి 1 సీటులోను పోటీ చేస్తున్నాయి.