AIADMK Allots 20 Seats To BJP: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంపై గతకొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. నామినేషన్లకు దగ్గరపడుతుండటంతో.. ఆయా పార్టీల కేడర్లల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలోనే తమిళనాడులో బీజేపీ- ఏఐఏడీఎంకే మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. సీట్ల పంపణీపై ఇరు పార్టీల మధ్య కొద్ది రోజులుగా చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీకి పలు అసెంబ్లీ సీట్ల, ఒక ఎంపీ సీటును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు 20 సీట్లు కేటాయించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది.
ఈ మేరకు ఒప్పందంపై శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడులో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ సంతకాలు చేశారు. అనంతరం ఒప్పందం కాపీని రాత్రి మీడియాకు విడుదల చేశారు. అయితే బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల వివరాలను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో ఏఐఏడీఎంకే 43 సీట్లను పీఎంకే, బీజేపీలకు కేటాయించింది. కూటమిలోని మరో పార్టీ డీఎండీకే 25 సీట్లలో బరిలోకి దిగాలని యోచిస్తోంది. మొత్తానికి ఏఐఏడీఎంకే 170 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయిస్తోంది.
వారి మధ్య ఇంకా చర్చలే..
అయితే డీఎంకే.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తును శుక్రవారం ఖరారు చేసింది. సీపీఐకు ఆరు సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా తమ పార్టీకి గౌరవనీయమైన సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పేర్కొంటోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికే.. నాలుగు పార్టీలతో పొత్తును ఖరారు చేసింది. ఎండీఎంకేకు ఏడు, కాంగ్రెస్‌కు 22 సీట్లు ఇవ్వనున్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 30 సీట్ల కన్నా తక్కువ సీట్లను పార్టీ అంగీకరించదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Also Read: