Tamil Politics: చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ‘ఆ’ ఇద్దరు దూతలు.. ఒకరు బీజేపీ.. మరొకరెవరో తెలిస్తే షాకే!

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటున్న తరుణంలోనే మరోవైపు రాజకీయ సన్యాసం తీసుకున్న శశికళ వ్యూహంపై తమిళనాట చర్చలు ఊపందుకున్నాయి. అసలు ఆమె అకస్మాత్ నిర్ణయం వెనుక ఎవరున్నారు? అనే చర్చ జోరందుకుంది.

Tamil Politics: చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ‘ఆ’ ఇద్దరు దూతలు.. ఒకరు బీజేపీ.. మరొకరెవరో తెలిస్తే షాకే!
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 06, 2021 | 5:05 PM

Persons behind Sasikala sensational decision: అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మిగిలి వున్న తరునంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార అన్నాడిఎంకేతో బీజేపీ ఎట్టకేలకు సీట్ల సర్దుబాటును పూర్తి చేసుకోగా.. అటు విపక్ష డిఎంకే ఆధిపత్యాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ ఒంటరి పయనానికి రెడీ అవుతున్న సంకేతాలు అందుతున్నాయి. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ తాను సారథిగా వ్యవహరిస్తున్న మూడో ఫ్రంట్‌లోకి రావాలని మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. ఇవన్నీ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు రాజకీయ సన్యాసం తీసుకున్న శశికళ వ్యూహంపై తమిళనాట చర్చలు ఊపందుకున్నాయి. అసలు ఆమె అకస్మాత్ నిర్ణయం వెనుక ఎవరున్నారు? అనే చర్చ జోరందుకుంది.

రాజకీయాల నుంచి శశికళ అకస్మాత్తుగా తప్పుకోవడంలో ఇద్దరు దూతలు ప్రధాన పాత్ర పోషించినట్లు తాజాగా వెల్లడైంది. తమిళ రాజకీయ పరిశీలకులు శుక్రవారం ఈ విషయంపై పలు రకాల విశ్లేషణలను వెల్లడించారు. నిజానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావాలని శశికళ భావించారు. తాను ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో జైలు నుంచి రాగానే కుదిరితే అన్నాడీఎంకేను చెప్పుచేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. ఫళని స్వామి తాను మెతక మనిషిని కానని చాలా గట్టిగా చాటుకోవడంతో అన్నా డిఎంకేపై ఆధిపత్యం దక్కదని గ్రహించిన చిన్నమ్మ.. ఆ తర్వాత టీటీవీ దినకరన్‌ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం’ (ఏఎంఎంకే) ద్వారా ప్రజల్లోకి ఆశించారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 24న జయలలిత జయంతి నాడు బహిరంగంగా వెల్లడించారు. అయితే అన్నాడీఎంకే స్వాధీనంలోకి వచ్చే పరిస్థితులు కనపడలేదు. దినకరన్‌ వైఖరి ఇబ్బందికరంగా మారింది. దాంతో చిన్నమ్మ ఫ్యూచర్ ఏంటా అని మధన పడిపోయారు.

గత నెలలోనే నాలుగేళ్ళ జైలు శిక్షను ముగించుకుని బెంగళూరు నుంచి చెన్నై చేరిన చిన్నమ్మ.. వచ్చీ రావడంతోనే రాజకీయ సమాలోచనలు జరిపారు. ఒక దశలో అన్నా డిఎంకే పార్టీని తిరిగి తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పలువురితో ఓపెన్ మీటింగులు నిర్వహించారు. రహస్య సమాలోచనలు కొనసాగించారు. కానీ గత ఒకట్రెండు సంవత్సరాలలో పార్టీపై పూర్తి పట్టు సాధించిన ముఖ్యమంత్రి ఫళనిస్వామి.. గట్టిగా నిల్వడంతోపాటు.. తనకు తానే వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే అన్నా డిఎంకే ప్రభుత్వంలో తానే ముఖ్యమంత్రిని అని కూడా ప్రకటించేసుకున్నారు. ఇక్కడే పార్టీ వెలుపల వున్న చిన్నమ్మకు, పార్టీలో తనతోపాటే వున్నా.. ఎంతో కొంత అసంతృప్తితో వున్న పన్నీరు సెల్వంకు గట్టి సంకేతాలు పంపారు. దానికి పార్టీ ముఖ్యులు చాలా మంది వంత పాడారు కూడా. చివరికి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫళనిస్వామేనని పన్నీరు సెల్వం కూడా అంగీకరించారు.

మరోవైపు డిఎంకే, అన్నాడిఎంకేలకు పోటీగా నటుడు శరత్ కుమార్ చొరవతో కమల్ హాసన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ మూడో ఫ్రంట్ ఏర్పాటైంది. అసలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు శరత్ కుమార్‌ను ప్రోత్సహించిందే శశికళ అన్న ప్రచారం వుంది. జైలు నుంచి తిరిగి వచ్చిన శశికళను శరత్ కుమార్ కలిసిన తర్వాతనే థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనతో ఇతర చిన్నా చితకా పార్టీలతో మంతనాలు మొదలు పెట్టారు. ఈ సమాలోచనలు మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ దాకా చేరే వరకు థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన వెనుక శశికళ, అమె మేనల్లుడు దినకరన్ వున్నారనే అంతా అనుకున్నారు. అయితే.. థర్డ్ ఫ్రంట్‌లోకి దినకరన్ పార్టీ ఏఎంఎంకేని చేర్చుకుంటే అవినీతి ముద్ర పడుతుందన్న కమల్ హాసన్ ఒపీనియన్‌కే మిగిలిన థర్డ్ ఫ్రంట్ నేతలు ఓటేశాయి. దాంతో థర్డ్ ఫ్రంట్‌లోకి చిన్నమ్మ పార్టీ చేరికకు బ్రేక్ పడిపోయింది.

ఆ తర్వాత చిన్నమ్మ సలహాపై దినకరన్ బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే బీజేపీ పంథాలో గణనీయమైన మార్పు వచ్చింది. అసలే సీట్ల విషయంలో కొసరి కొసరి చర్చలు జరుపుతున్న అన్నా డిఎంకే అధినాయకత్వం ముందు షా పెద్ద బాంబే పేల్చారు. తమకు 60 సీట్లు ఇస్తే.. అందులో శశికళ వర్గానికి 30 సీట్లు కేటాయించి.. తమ గుర్తుపై పోటీకి ఒప్పిస్తామని ఆయన ఫళని స్వామికి తెలిపారు. ఈ ప్రతిపాదనతో ఉలిక్కి పడ్డ ఫళని స్వామి.. బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. పరిస్థితి చేరి దాటుతుందని, ఈ పరిణామాలు అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షమైన డిఎంకేకు లాభించే అవకాశాలున్నాయని గుర్తించిన బీజేపీ.. చిన్నమ్మతో రాజకీయ సన్యాసం ప్రకటన చేయించారని పలువురు అంఛనా వేస్తున్నారు. అరవై సీట్లను ఆశించిన బీజేపీ చివరికి అన్నా డిఎంకే ఇచ్చిన 20 సీట్లతో సర్దుకుపోయింది. ఇక అందులోంచి శశికళ వర్గానికి టిక్కెట్లు కేటాయించే పరిస్థితి లేదు.

ఈ పరిణామాలు ఒకవైపు కొనసాగుతుండగానే శశికళను ఇద్దరు వ్యక్తులు (దూతలు) కలుసుకోవడంతో ఆమె సడన్‌గా రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నారని తమిళనాట చెప్పుకుంటున్నారు. తమ కూటమి (అన్నాడిఎంకే-బీజేపీ) గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని పట్టుదలతో ఉన్న శశికళను బుజ్జగించేందుకు బీజేపీకి చెందిన ఒక దూత ఆమెతో స్వయంగా భేటీ అయ్యారు. మనం మనం కీచులాడుకుంటే ఓట్లు చీలిపోయి అధికార పీఠాన్ని డీఎంకే తన్నుకు పోగలదని హెచ్చరిస్తూనే రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని సూచించారు. ఇదే సమయంలో సమీప బంధువొకరు శశికళను కలిసుకోవడం కూడా ఆమె నిర్ణయంపై ప్రభావం చూపిందంటున్నారు. ఏఎంఎంకే ఒంటరిగా బరిలోకి దిగితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుంది, ఆన్నాడీఎంకే ఓటమి పాలైతే ఆ చెడ్డపేరు నీకు చుట్టుకుంటుందని సదరు బంధువు శశికళకు నచ్చచెప్పారు. అటు బీజేపీ సందేశం, ఇటు సమీప బంధువు హితబోధ.. వెరసి రాజకీయాల నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలన్న నిర్ణయానికి శశికళ వచ్చినట్లు తెలుస్తోంది.

టీటీవీ దినకరన్, మరికొందరు వెన్నుపోటుదారుల వల్లనే రాజకీయాల నుంచి శశికళ తప్పుకోవాల్సి వచ్చిందని స్వయానా ఆమె తమ్ముడు.. ‘అన్నా ద్రావిడర్‌ కళగం’ ప్రధాన కార్యదర్శి దివాకరన్‌ వ్యాఖ్యానించారు. తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకోవడం, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంను కూటమిగా మలుస్తూ అన్నాడీఎంకేను ఆహ్వానించడం వంటి అనుభవరాహిత్య ప్రకటనలకు పాల్పడిన దినకరన్‌తో చిన్నమ్మ విరక్తి చెందివుంటారని దివాకరన్ అభిప్రాయపడ్డారు.

సన్యాసం తాత్కాలికమేనా?

తమిళనాట రాజకీయాల్లో మరో జయలలితగా మారాలనుకున్న శశికళ ఉన్నట్లుండి రాజకీయ సన్యాసం తీసుకోవడం సంచలనం రేపింది. అయితే.. బీజేపి సందేశంతోనే ఆమె తాత్కాలికంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారని భావిస్తున్నారు. ఎన్నికలయ్యాక తన సత్తా ఏంటో చాటాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను, తన పార్టీ బరిలో వుంటే.. అది పరోక్షంగా జయలలిత స్థాపించిన అన్నా డిఎంకేకే ప్రతికూలంగా మారుతుందని, అది అంతిమంగా తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థులైన డిఎంకే లాభిస్తుందని అంఛనా వేసిన శశికళ తాత్కాలికంగా సైలెంటయ్యేందుకు సిద్దమయ్యారని సమాచారం. ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి ఆమె తన రాజకీయపరమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ALSO READ: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్స్.. కన్నడ నాట మరీ అధికం.. అమెరికాలోను అంతే!