Manipur Elections: ఎన్నికలకు ముందు మణిపూర్‌లో హింస.. కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు బాంబు పేలుళ్లు!

| Edited By: Team Veegam

Jan 20, 2022 | 8:36 PM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని ఇద్దరు కాంగ్రెస్ నేతల నివాసాల ముందు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో సహా రెండు శక్తివంతమైన బాంబులు పేలినట్లు పోలీసులు తెలిపారు.

Manipur Elections: ఎన్నికలకు ముందు మణిపూర్‌లో హింస.. కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు బాంబు పేలుళ్లు!
Blast
Follow us on

Manipur Elections 2022: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మణిపూర్‌లో హింస కొనసాగుతోంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని ఇద్దరు కాంగ్రెస్ నేతల నివాసాల ముందు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో సహా రెండు శక్తివంతమైన బాంబులు పేలినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్ల కారణంగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇంఫాల్ పశ్చిమ జిల్లా, ఇంఫాల్ తూర్పు జిల్లాలో జరిగిన పేలుళ్లలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని కంగ్లా సంగమ్‌షాంగ్‌లో కాంగ్రెస్ నాయకుడు రతన్‌కుమార్ నివాసం ముందు ఐఈడీ పేలుడు సంభవించింది. దీంతో ఆయన ఇంట్లో పార్క్ చేసిన వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సమ్రులో మాజీ ఎమ్మెల్యే సలాం జాయ్ నివాసం సమీపంలో రెండో పేలుడు సంభవించింది. కాంగ్రెస్ నాయకుడి నివాసం గేటు ముందు భాగం ధ్వంసమైంది. రతన్‌కుమార్‌, జాయ్‌ ఇద్దరూ వరుసగా ఖురాయ్‌, వాంగోయ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.

రెండు ప్రాంతాలకు చేరుకున్న భద్రతా బలగాలు దాడి చేసిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బాంబు పేలుళ్లకు నిరసనగా ఇరు ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. 60 సీట్ల మణిపూర్ అసెంబ్లీకి ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత రెండో హింసాత్మక ఘటన. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదిలావుంటే, జనవరి 9న, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని వాంగోయ్‌లో గుర్తుతెలియని దుండగులు, ఒక పోలీసు కమాండో సహా ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపారు. బుధవారం నాటి హింస మణిపూర్‌లో రెండు నెలల వ్యవధిలో జరిగిన ఆరో హింసాత్మక ఘటన. అయితే, ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. జనవరి 5న తౌబాల్ జిల్లాలోని లిలాంగ్ ఉసోపోక్పి సంగోమ్‌సంగ్‌లో జరిగిన శక్తివంతమైన IED పేలుడులో అస్సాం రైఫిల్స్ జవాన్ మరణించారు, మరొకరు గాయపడ్డారు. అంతకుముందు నవంబర్, డిసెంబర్‌లలో, ఇంఫాల్ దాని శివార్లలోని వేర్వేరు ప్రదేశాలలో మూడు శక్తివంతమైన IEDలను పేల్చారు. అయితే, ఎవరూ గాయపడలేదు. అయితే, తెల్లవారుజామున పేలుళ్లు జరిగాయి. నవంబర్ 13న, మయన్మార్ సరిహద్దులోని చురాచంద్‌పూర్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు పారామిలటరీ సిబ్బందితో పాటు అస్సాం రైఫిల్స్ కల్నల్, అతని భార్య, కుమారుడు మరణించారు.

Read Also…. Crime News: ఆసుపత్రి బయోగ్యాస్ ప్లాంట్‌లో పుర్రెలు, పిండాల ఎముకల కలకలం.. పోలీసుల విచారణలో సంచలనాలు!