5 state assembly election results 2022: మణిపూర్ రారాజు ఎవరు. ఆ రాష్ట్ర మణిహారం దక్కించుకునేదెవరు. ఓటర్లు ఇప్పటికే డిసైడ్ చేసినా ఫలితంగా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఓటర్లు. గత ఫలితాలు రిపీట్ అయినా కుర్చీ ఎక్కేంత వరకు ఏ పార్టీకి గ్యారెంటీ లేకపోవడం ఆసక్తిని పెంచుతోంది.
చరిత్రలోకి..
భారతదేశానికి ఈశాన్యభాగాన ఉంది మణిపూర్ రాష్ట్రం. రాజధాని ఇంఫాల్. 1947లో స్వతంత్ర రాజ్యం. మణిపూర్ ను మహారాజా ప్రబోధచంద్ర పరిపాలించి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించాడు. ఆ తర్వాత భారతదేశంలో విలీనమైంది. 1949 అక్టోబరులో మణిపూర్ రాజ్యాంగ శాసనసభ రద్దుచేయగా..1956 నుండి కేంద్ర పాలిత ప్రాంతమైంది. 1972లో మణిపూర్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది కేంద్రం. మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందీ ప్రాంతం. వివిధ జాతుల మధ్య వైరుధ్యాలు మణిపూర్ కు గొడ్డలిపెట్టు. ఎన్నో తరాలుగా మెయితి జాతి ప్రజలు ఉంటున్నా.. కొండ తెగలు కొట్టుకుంటుంటాయి. హిందూ, ముస్లింల మధ్య వైరుధ్యాలే కాదు.. నాగా, కుకీ తెగల మధ్య ఘర్షణలు ఇక్కడ నిత్యకృత్యం అయ్యాయి.
అప్పుడేం జరిగిందంటే..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్ చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. తృణముల్ కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మరో చోట గెలిచారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ కాదని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు గవర్నర్ నజ్మా హెప్తుల్లా. ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ మద్దతుతో అధికారం కాపాడుకుంది బీజేపీ ప్రభుత్వం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ఆ పీఠం ఎక్కడం చర్చనీయాంశమైంది.
ఈ సారి..
సిట్టింగ్ సిఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవిలు ఎన్నికల ఎత్తులు వేయడం ఉత్కంఠను పెంచుతోంది. ప్రధాని మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సైతం ఇక్కడ ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే పని చేయడం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓక్రం ఇబోబిసింగ్ చుక్కానిలా పని చేయగా.. సీపీఐకి సోటిన్ కుమార్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నుంచి లోసీ డిఖో, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) కు వై. జోయ్‌కుమార్ సింగ్, ఆ పార్టీ ఆధ్యక్షుడు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, జేడీ(యూ) పక్షాన హెచ్ తైతుల్ లు ప్రచారం చేయడం ఉత్కంఠను పెంచింది. మరోవైపు ఎన్సీపీ, శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలు కూడా పోటీలో ఉన్నాయి.
పొత్తులివే..
అధికార బీజేపీకి కేంద్రంలో, రాష్ట్రంలో మద్దతిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేశాయి. సిపిఐ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. జేడీయూ, శివసేన, రిపబ్లికన్ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
మణిపూర్ లో మొత్తం స్థానాలు – 60
బీజేపీ- 60
కాంగ్రెస్ (54) + సీపీఐ (2) = 56
నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) – 10
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) – 42
జేడీ (యూ) – 38
ఎన్సీపీ – 8
శివసేన – 9
రిపబ్లికన్‌పార్టీ – 9
తగ్గిన పోలింగ్..
మణిపూర్ లో సీట్లు 60 (1 ఎస్సీ, 19 ఎస్టీలకు రిజర్వుడు)
పోటీలో ఉన్న మొత్తం అభ్యర్ధులు- 265
మొత్తం ఓటర్లు.. 19,68,476
రెండు విడతలుగా పోలింగ్
28-02-2022 (38 స్థానాలకు), 05-03-2022 (22 స్థానాలకు)
మొదటి దశలో నమోదైన పోలింగ్… 78.03
రెండవ దశలో నమోదైన పోలింగ్… 78.49 శాతం
2017 ఎన్నికల్లో నమోదైన మొత్తం పోలింగ్… 86.63
తాజా రాజకీయం..
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అంశం ప్రచారం ప్రధాన అంశంగా మారింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు నిరాహారదీక్ష చేసింది ఇరోం షర్మిల. ఇటీవల పొరుగున ఉండే నాగాలాండ్‌లో తీవ్రవాదులుగా పొరబడిన సైనికులు సామాన్యులను హతమార్చిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఈ సంఘటనతో నిరసనల వెల్లువెత్తాయి. ఆ ప్రభావం మణిపూర్‌పై బలంగా పడింది. అన్ని పార్టీలు ప్రచారంలో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీనిచ్చాయి. ఉగ్రవాద సంస్థల ప్రభావం మణిపూర్లో తక్కువేం కాదు. క్రియాశీలంగా పనిచేస్తోన్న ఆరు నిషేధిత తీవ్రవాద సంస్థల కూటమి ‘కోర్కం ఇక్కడే ఉంది. ఈ స్థంస్థలు స్వతంత్ర మణిపూర్ సాధనే లక్ష్యంగా పోరాడుతున్నాయి. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్ధికి ఏదో ఒక తీవ్రవాద సంస్థ అండ ఉందనే చర్చ లేకపోలేదు. తమ 5 ఏళ్ల పాలనలో తీవ్రవాదం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని బీజేపీ ఊదరగొట్టింది. కోర్కం అనేక సార్లు బంద్ పిలుపునిచ్చి విజయవంతం చేసింది. ముఖ్యంగా కొండలోయ ప్రాంతాల్లో ఎవరికి ఓటు వేయాలో చెబుతూ గ్రామ పెద్దల నుంచి వీరు హామీ పత్రాలు తీసుకోవడం మాములు విషయం కాదు.
సర్వేలు ఏం చెప్పాయి..
అధిక శాతం సర్వేలలో బీజేపీవైపే మొగ్గు కనిపించింది. ఈ రాష్ట్రంలో పార్టీల కంటే అభ్యర్ధులకే ఓటర్లు అధికంగా ప్రాధాన్యత నివ్వడం ఎప్పటి నుంచో వస్తోంది. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. మొత్తం ఓటర్లలో పురుషులు 9,55,657 ఉండగా మహిళా ఓటర్లు 10,12,655 మంది. కానీ చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువ. గత ఎన్నికల్లో ఇద్దరు మహిళలే ఇక్కడ విజయం సాధించారు. ఇక తాజా ఎన్నికల్లో 17 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉండటం వారిలో వచ్చిన చైతన్యానికి నిదర్శనం. బీజేపీ-3, కాంగ్రెస్-4, సీపీఐ-1, ఎన్పీపీ-2, జేడీ (యూ)-1, ఎన్సీపీ-2, ఇతరులు 4 సీట్లల్లో రేసులో నిలిచారు.
బీజేపీ..
ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 21 సీట్లే వచ్చినా ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈసారి కనీసం 40 సీట్లు వస్తాయని సొంతంగానే అధికారంలోకి వస్తామని అంచనా వేస్తోంది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అంశాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో చేర్చకపోవడంపై విమర్శలు వచ్చాయి. అది ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక ఎన్‌పీపీ ఈసారి 42 స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టడంతో, పలు స్థానాల్లో బీజేపీ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
కాంగ్రెస్..
గత ఎన్నికల్లో 28 సీట్లు సాధించి రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయినా ఇతర పార్టీల మద్దతుతో అధికారం కైవసం చేసుకున్న బీజేపీని ఏం చేయలేకపోయింది. నాడు అధికార పీఠానికి మూడు సీట్ల దూరంలో నిలిచిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ధీమాతో ఉంది. కానీ కీలక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీ గూటికి చేరడం లోటే. కాంగ్రెస్ కురువృద్దుడు శాసనసభలో ప్రతిపక్షనేత ఓక్రం ఇబోబినే ఆపార్టీ ప్రధాన ప్రచారకర్తగా ఉంటూ గెలుపు వ్యూహ రచన చేశాడు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మణిపూర్ ప్రగతిశీల లౌకిక కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, జేడీఎస్ తలా ఒక స్థానంలో పోటీలో ఉండి మిగిలిన చోట్ల కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నాయి.
ఎన్‌పీపీ..
గత ఎన్నికల్లో దాదాపు 20 స్థానాలలో పోటీ చేసినా 9 స్థానాలలోనే బలమైన అభ్యర్ధులను నిలిపింది. వాటిలో 4 స్థానాలలో విజయం సాధించింది. అప్పుడు కింగ్ మేకర్‌గా నిలిచిన నేషనల్ పీపుల్స్ పార్టీ ఈ సారి అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో తామే పెద్దన్న పాత్ర పోషించాలని ఎత్తులు వేస్తోంది. ఈ సారి ఏకంగా 42 స్థానాలలో అభ్యర్ధులను నిలిపిన ఎన్‌పీపీకి పార్టీ అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మానే ప్రధాన ప్రచారకర్త. హిందూ మీటీ, ముస్లిం మీటీ-పంగల్ వర్గాలకు ఎస్టీ హోదా, నాగాల సమస్యలకు శాంతియుత పరిష్కారం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు వంటి అంశాలపై పెద్ద ఎత్తున్న ప్రచారం చేసింది. ఓటర్లను ఆకట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో తన పార్టీని జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేశాడు సంగ్మా. ఎంత మేరకు ఆయన ప్రభావం ఉందో చూడాలి.
నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్)..
కొండ ప్రాంత జిల్లాల్లో నాగాల ప్రాబల్యం ఎక్కువ. ఈ స్థానాల్లో ఎన్‌పీఎఫ్‌కు మంచి పట్టుంది. తమకు పట్టున్న 10 స్థానాలను ఎంచుకుని బరిలోకి దిగింది. ఎన్‌పీఎఫ్. ఈ సీట్లల్లో తమకు విజయావకాశాలు తక్కువగా ఉన్న చోట్ల బీజేపీ వర్గాలు ఎన్‌పీఎఫ్ అభ్యర్ధులకు మద్దతిచ్చాయనే వాదనుంది. ఇవేకాదు జనతాద్ (యునైటెడ్) పార్టీ కూడా 38 స్థానాల్లో పోటీ చేసి మెరుగైన ఫలితాల కోసం గురిపెట్టింది. కనీసం కింగ్ మేకర్‌గా నిలిచే స్థాయిలో సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది.
హైంగాంగ్ లో బీజేపీ నేత ఎన్ బీరేన్ సింగ్, తోంగ్జులో బీజేపీ నేత టి. బిస్వజిత్ సింగ్, వాంగ్ఖీలో బీజేపీ నేత ఓక్రం హెన్రీ సింగ్, బిష్ణుపూర్ లో బీజేపీ నేత కె గొవిందాస్, తౌబల్ లో కాంగ్రెస్ నేత ఓక్రం ఇబోబిసింగ్, నుంగ్బాలో కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సిఎం గైఖాంగమ్ గాంగ్ మీ, ఖుంద్రాక్పాంలో కాంగ్రెస్ నేత టి. లోకేశ్వర్ సింగ్, ఉరిపోక్ లో ఎన్పీపీ నేత, మాజీ డిప్యూటీ సిఎం వై. జోయ్‌కుమార్ సింగ్, యైస్కుల్ లో జేడీ (యూ) నేత, మాజీ పోలీస్ అధికారిణి థౌనోజామ్ బ్రిందా, సింగ్జామైలో అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత వై. ఖేమ్‌చంద్ సింగ్, స్పీకర్, నంబోల్ లో పిసిసి చీఫ్ ఎన్ లోకెన్ సింగ్, చౌరాచంద్‌పూర్ (ఎస్టీ)లో జేడీయూ నేత, మాజీ డిజిపి ఎల్‌ఎమ్ కౌటే, బిషెన్‌పూర్ లో జేడీయూ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ. నబకిషోర్ సింగ్ రేసులో నిలవడం విశేషం.
కమల వికాసం..
మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. వివాదాస్పద సాయుధ బలగాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్‌పీఏ) ఉపసంహరించుకుంటామని బీజేపీ ప్రకటించడంతో ఎంత మేరకు ఆ హామీని అమలు చేస్తుందో వేచి చూడాలి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు జనాలు. తిరుగుబాటు గ్రూపులతో చర్చలు జరపడం, మానవ హక్కుల ఉల్లంఘనలను పరిష్కరించడం ద్వారా సుస్థిర శాంతిపై దృష్టి పెడతానని చెప్పింది నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారు ఏంటి అనేది తేలాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ-9 తెలుగు.
Also read:
Viral Video: పాముతోనే ఆటలాడాలనుకున్నాడు.. దాని రియాక్షన్‌కు దిమ్మ తిరిగిపోయింది.. షాకింగ్ వీడియో..
Chilli Price: బంగారంతో పోటీ పడుతున్న ఎర్రబంగారం.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Andhra Pradesh: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్..