Kerala Election 2021: బీజేపీ టికెట్ ఇచ్చినా.. పోటీకి నిరాకరించిన యువ అభ్యర్థి.. ఎక్కడంటే?

|

Mar 15, 2021 | 8:15 PM

BJP - Manikuttan: దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి.. జంప్

Kerala Election 2021: బీజేపీ టికెట్ ఇచ్చినా.. పోటీకి నిరాకరించిన యువ అభ్యర్థి.. ఎక్కడంటే?
Kerala Election 2021
Follow us on

BJP – Manikuttan: దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి.. జంప్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలోనే భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి ఒకరు హ్యాండిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేయడానికి నిరాకరించారు. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సీటును ఎన్నికల సంఘం ఎస్టీలకు కేటాయించింది. కాగా పానియా తెగకు చెందిన 31 ఏండ్ల మణికుట్టన్‌ ఈ ప్రాంతంలో ఎంబీఏ చదివిన తొలి వ్యక్తి. ఈ నేపథ్యంలో బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మణికుట్టన్‌ పేరు కూడా ఉంది. దీంతో ఆయన ఆశ్చర్యపోయి తాను పోటీచేయనంటూ ప్రకటించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఎన్నికల్లో పోటీ చేయనంటూ మణికుట్టన్ స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా మణికుట్టన్ మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థిగా నా పేరును టీవీలో ప్రకటించడం చూసి ఆశ్చర్యపోయానని.. కొంత భయపడ్డానంటూ వెల్లడించారు. పానియా వర్గానికి చెందిన వారిని ఎన్నికల్లో నిలబెట్టడానికి బీజేపీ నన్ను ఎంచుకున్నందుకు నిజంగా సంతోషించానని.. నేను ఎన్నికల్లో పోటీ చేయనని బీజేపీ వారికి ఫోన్ ద్వారా వెల్లడించానని మణికుట్టన్‌ తెలిపారు. తాను సామాన్య వ్యక్తినని.. ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగం, కుటుంబమే తనకు ముఖ్యమంటూ తేల్చిచెప్పారు. తనకు రాజకీయాలంటే.. ముందునుంచి ఆసక్తి లేదని.. అందుకే బీజేపీ ఆఫర్‌ను సంతోషంగా నిరాకరిస్తున్నానంటూ మణికుట్టన్ తెలిపారు.

ఇదిలాఉంటే.. 140 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కేరళలో ఏప్రిల్​6న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ధర్మదామ్​ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పినరయి విజయన్​ నామినేషన్​ దాఖలు చేశారు. కన్నూర్​ కలెక్టర్​ కార్యాలయంలో విజయన్ నామినేషన్​దాఖలు చేశారు.

 

Also Read:

మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం.. త్వరలోనే పలు కీలక విమానాశ్రయాలు ప్రైవేటీకరణ..?

తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా యశ్వంత్ సిన్హా, టీఎంసీ జాతీయ కార్యవర్గ సభ్యుడుగా కూడా నియామకం