Karnataka Polls 2023: జంపింగ్ జపాంగ్‌.. కర్నాటకలో ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు పట్టిస్తోన్న రెబల్స్..

Karnataka Elections 2023: మరీ ముఖ్యంగా జేడీఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. ఇది కుమారస్వామికి మింగుడుపడని పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై జేడీఎస్ చీఫ్, హెచ్‌డీ కుమారస్వామి విరుచుకపడ్డారు.

Karnataka Polls 2023: జంపింగ్ జపాంగ్‌.. కర్నాటకలో ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు పట్టిస్తోన్న రెబల్స్..
Karnataka Elections 2023
Image Credit source: TV9 Telugu

Updated on: Apr 10, 2023 | 12:22 PM

Karnataka Polls 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం జోరందుకుంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆ రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 45 ఏళ్లలో అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి రాలేదు. అయితే ఈ ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెడుతూ మళ్లీ తాము అధికారంలోకి వస్తామని అధికార బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే కర్నాటక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. సీఎం బొమ్మైని ఇంటికి సాగనంపడం తథ్యమని కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు. అటు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కూడా కింగ్ మేకర్.. కాలం కలిసొస్తే కింగ్ కావాలని ఉవ్విళ్తూరుతోంది. అయితే తమ నేతలు.. చివరి క్షణంలో ఇతర పార్టీలకు జంప్ కావడం పట్ల ప్రధాన పార్టీలు ఆందోళ చెందుతున్నాయి. పార్టీ మారడం లేదా తిరుగుబాటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు కొందరు ఆశావహులు సన్నద్ధమవుతున్నారు.

మాజీ ఎంపీ, జేడీఎస్ బహిష్కృత నేత ఎల్ఆర్ శివరామె గౌడ్ గత వారం బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. మరో 10 రోజుల్లో పలువురు ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. కర్నాటక అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని ప్రజలు కోరుకుంటారని.. బీజేపీ సంపూర్ణ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. సీనియర్ జేడీఎస్ నేత ఏటీఆర్ రామస్వామి కూడా ఇటీవల బీజేపీలో చేరారు.

మరీ ముఖ్యంగా జేడీఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతుండటం కుమారస్వామికి మింగుడుపడని పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై జేడీఎస్ చీఫ్, హెచ్‌డీ కుమారస్వామి విరుచుకపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది నేతలు త్వరలోనే తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అభ్యర్థుల రెండో విడత జాబితాను సోమవారంనాడు విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల మధ్య సీట్ల కోసం గట్టి పోటీ నెలకొంటోంది. ఎవరికైనా ఒకరికే టిక్కెట్ ఇస్తే.. టిక్కెట్ దక్కని ఆశావహులు జేడీఎస్‌కు జంప్ కావొచ్చని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. అటు బీజేపీని కూడా జంపింగ్ జపాంగ్‌లు ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇవాళ సాయంత్రం పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కర్నాటక మాజీ సీఎం యడుయూరప్ప మీడియాకు తెలిపారు. టిక్కెట్ దక్కని ఆశావహులు ఇతర పార్టీలకు జంప్ కావొచ్చని బీజేపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

224 మంది సభ్యులతో కూడిన కర్నాటక అసెంబ్లీకి ఒకే విడతలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపడుతారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి