
Karnataka Elections 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి మద్ధతు ప్రకటించిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఆయన నటించిన మూవీస్, షోస్, కమర్షియల్ యాడ్స్ ప్రసారాలను నిలిపివేయాలని జనతాదళ్ (సెక్యులర్) డిమాండ్ చేసింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ లేఖ రాసింది. మే 10న జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కిచ్చా ప్రదీప్ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి అయిన జేడీఎస్ ఈ మేరకు డిమాండ్ చేసింది. కిచ్చా సుదీప్ సినిమాల ప్రదర్శనకు అనుమతిస్తే ఓటర్లు ప్రభావితం అవుతారని ఈసీకి రాసిన లేఖలో జేడీఎస్ అభ్యంతరం తెలిపింది.
బుధవారం సీఎం బసవరాజు బొమ్మైతో కలిసి మీడియాతో మాట్లాడిన కచ్చా సుదీప్.. బీజేపీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. అయితే తనకు ఎంతో సన్నిహితులైన సీఎం బసవరాజు బొమ్మైకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థుల కోసం సుదీప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని వెల్లడించిన సీఎం బొమ్మై.. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీలోని తన మిత్రుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సుదీప్ ధృవీకరించారు.
సుదీప్ ప్రకటనను చూసి తాను షాక్‌కు గురైనట్లు నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇది తనను గాయపర్చినట్లు పేర్కొన్నారు. సుదీప్ బీజేపీకి మద్ధతు ప్రకటించడం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. సినీ తారలు చాలా మంది వస్తుంటారు.. పోతుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేస్తూ జేడీఎస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
కిచ్చా సుదీప్ సినిమాలను థియేటర్లు, టీవీలలో ప్రసారం చేయకుండా బ్యాన్ చేయాలంటూ శివమొగ్గకు చెందిన ఓ న్యాయవాది కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం లేఖ రాశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సుదీప్ పాల్గొన్న షోస్, కమర్షియల్ యాడ్స్ ప్రసారాలను కూడా నిలిపిస్తూ ఈసీ ఆదేశాలివ్వాలని ఆ లేఖలో ఈసీని కోరారు.
224 మంది సభ్యులతో కూడిన కర్నాటక అసెంబ్లీకి మే 10న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ ప్రకటించడం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి