Goa Congress: ఎన్నికల ముంగిట.. గోవా కాంగ్రెస్‌లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రియాంకాగాంధీ రాష్ట్ర పర్యటన వేళ కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి రాజీనామాలు సమర్పిస్తున్నారు. పోర్వోరిమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మూకుమ్ముడి రాజీనామాలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ ఖౌంటేకు మద్దతు పలుకుతున్న వీరంతా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. మరోవైపు.. సౌత్ గోవా కాంగ్రెస్ నేత మోరెనో రెబెలో సైతం రాజీనామా చేయడం పార్టీని సంక్షోభంలోకి నెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అలిక్సో రెజినాల్డోకు టిక్కెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు మోరెనో. మొన్నటిదాకా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ అలిక్సోకు మళ్లీ టిక్కెట్ ఇవ్వడాన్ని ఖండిస్తున్నారు అలిక్సో. నాలుగున్నరేళ్లుగా క్యాడర్‌ను పట్టించుకోని అలిక్సో లాంటి నేతలకు అధిష్ఠానం పెద్దపీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ నేతలు.
కీలక సమయంలో ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం అధిష్ఠాన పెద్దలకు తలనొప్పిగా మారింది. పార్టీని వీడుతున్న నేతలంతా.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సరైన రీతిలో సమాయత్తం కావడం లేదని ఆరోపిస్తున్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని సైతం కొంతమంది నేతలు తప్పుబడుతున్నారు. ఈ పొత్తు పార్టీని ముంచడం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. ఇక.. పార్టీ నేతల్ని బుజ్జగించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పార్టీ గోవా ఇన్‌చార్జి చిదంబరం పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ గోవా కాంగ్రెస్‌లో నెలకొంటున్న పరిణామాలు పార్టీకి నష్టం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి.