Tamilnadu Polls: శశికళ సంచలన నిర్ణయంతో అందరు షాక్.. చిన్నమ్మ సన్యాసం వెనుక వున్నదెవరో తెలుసా?

క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ఎవరున్నారు? ఈ చర్చ ఇపుడు తమిళనాడులో ఆసక్తిరేపుతోంది.

Tamilnadu Polls: శశికళ సంచలన నిర్ణయంతో అందరు షాక్.. చిన్నమ్మ సన్యాసం వెనుక వున్నదెవరో తెలుసా?
Follow us

|

Updated on: Mar 04, 2021 | 5:53 PM

Who is behind Sasikala’s retirement statement: రాజకీయ సమాలోచనలతో బిజీగా కనిపించిన తమిళనాడు చిన్నమ్మ శశికళ అనూహ్యంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ఆరో తేదీన జరగనుండగా దాదాపు అన్ని పార్టీలు పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాట్లు, ఎన్నికల ఎజెండాను సెట్ చేయడంలో బిజీగా వున్నాయి. మార్చి 3వ తేదీ వరకు ఇదే తరహా చర్చలతో బిజీగా కనిపించిన శశికళ మార్చి 3 సాయంత్రానికి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ఎవరున్నారు? ఈ చర్చ ఇపుడు తమిళనాడులో ఆసక్తిరేపుతోంది.

గత నెలలోనే నాలుగేళ్ళ జైలు శిక్షను ముగించుకుని బెంగళూరు నుంచి చెన్నై చేరిన చిన్నమ్మ.. వచ్చీ రావడంతోనే రాజకీయ సమాలోచనలు జరిపారు. ఒక దశలో అన్నా డిఎంకే పార్టీని తిరిగి తన గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పలువురితో ఓపెన్ మీటింగులు నిర్వహించారు. రహస్య సమాలోచనలు కొనసాగించారు. కానీ గత ఒకట్రెండు సంవత్సరాలలో పార్టీపై పూర్తి పట్టు సాధించిన ముఖ్యమంత్రి ఫళనిస్వామి.. గట్టిగా నిల్వడంతోపాటు.. తనకు తానే వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే అన్నా డిఎంకే ప్రభుత్వంలో తానే ముఖ్యమంత్రిని అని కూడా ప్రకటించేసుకున్నారు. ఇక్కడే పార్టీ వెలుపల వున్న చిన్నమ్మకు, పార్టీలో తనతోపాటే వున్నా.. ఎంతో కొంత అసంతృప్తితో వున్న పన్నీరు సెల్వంకు గట్టి సంకేతాలు పంపారు. దానికి పార్టీ ముఖ్యులు చాలా మంది వంత పాడారు కూడా. చివరికి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫళనిస్వామేనని పన్నీరు సెల్వం కూడా అంగీకరించారు.

మరోవైపు డిఎంకే, అన్నాడిఎంకేలకు పోటీగా నటుడు శరత్ కుమార్ చొరవతో కమల్ హాసన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ మూడో ఫ్రంట్ ఏర్పాటైంది. అసలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు శరత్ కుమార్‌ను ప్రోత్సహించిందే శశికళ అన్న ప్రచారం వుంది. జైలు నుంచి తిరిగి వచ్చిన శశికళను శరత్ కుమార్ కలిసిన తర్వాతనే థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనతో ఇతర చిన్నా చితకా పార్టీలతో మంతనాలు మొదలు పెట్టారు. ఈ సమాలోచనలు మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ దాకా చేరే వరకు థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన వెనుక శశికళ, అమె మేనల్లుడు దినకరన్ వున్నారనే అంతా అనుకున్నారు. అయితే.. థర్డ్ ఫ్రంట్‌లోకి దినకరన్ పార్టీ ఏఎంఎంకేని చేర్చుకుంటే అవినీతి ముద్ర పడుతుందన్న కమల్ హాసన్ ఒపీనియన్‌కే మిగిలిన థర్డ్ ఫ్రంట్ నేతలు ఓటేశాయి. దాంతో థర్డ్ ఫ్రంట్‌లోకి చిన్నమ్మ పార్టీ చేరికకు బ్రేక్ పడిపోయింది.

ఆ తర్వాత చిన్నమ్మ సలహాపై దినకరన్ బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే బీజేపీ పంథాలు గణనీయమైన మార్పు వచ్చింది. అసలే సీట్ల విషయంలో కొసరి కొసరి చర్చలు జరుపుతున్న అన్నా డిఎంకే అధినాయకత్వం ముందు షా పెద్ద బాంబే పేల్చారు. తమకు 60 సీట్లు ఇస్తే.. అందులో శశికళ వర్గానికి 30 సీట్లు కేటాయించి.. తమ గుర్తుపై పోటీకి ఒప్పిస్తామని ఆయన ఫళని స్వామికి తెలిపారు. ఈ ప్రతిపాదనతో ఉలిక్కి పడ్డ ఫళని స్వామి.. బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. పరిస్థితి చేరి దాటుతుందని, ఈ పరిణామాలు అంతిమంగా కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షమైన డిఎంకేకు లాభించే అవకాశాలున్నాయని గుర్తించిన బీజేపీ.. చిన్నమ్మతో రాజకీయ సన్యాసం ప్రకటన చేయించారని పలువురు అంఛనా వేస్తున్నారు.

శశికళ చేత బీజేపీనే రాజకీయ సన్యాసం చేయించినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటలు డీఎంకేకు లాభించి అధికారంలోకి వస్తే తమకు నష్టమని బీజేపీ భావించింది. రాజకీయ క్రీడ నుంచి శశికళను డ్రాప్‌ చేయించడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలకుండా కాపాడుకోవచ్చని, డీఎంకే దూకుడుకు కళ్లెం వేయవచ్చని వ్యూహం పన్నింది. శశికళ నిర్ణయం తనకే ఆశ్చర్యం కలిగించిందని టీటీవీ దినకరన్‌ అన్నారు. రాజకీయాల నుంచి వైదొలగినంత మాత్రాన ఆమె వెనకడుగు వేసినట్లు భావించరాదని వ్యాఖ్యానించారు.

సీట్ల సర్దుబాట్లన్ని ముగిసిన తర్వాత తెరచాటు రాజకీయాలతో చిన్నమ్మ బిజీగానే వుంటారని పలువురు భావిస్తున్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఫండింగ్ బాధ్యతలను చిన్నమ్మ చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందుకోసం అల్ రెడీ మంతనాలు ముగిసాయని పలువురు చెప్పుకుంటున్నారు. అమిత్ షా చెన్నైలో మకాం వేసినపుడు ఈ వ్యూహాలన్నీ ఖరారు అయ్యాయని భావిస్తున్నారు. డిఎంకేకు అధికారం దక్కకుండా చూడడంతోపాటు.. అన్నా డిఎంకే తన చేజారకుండా వుండేలా ద్విముఖ వ్యూహంతో కమలనాథులు ముందుకెళుతున్నట్లు విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.

ALSO READ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకరేపుతున్న ఐటీఐఆర్.. ఎవరి వాదన ఎలా వున్నా.. ఇప్పటి వరకు జరిగిందిదే!

ALSO READ:  విజయవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్.. మరికొన్ని రకాల వ్యాక్సిన్లకు త్వరలో అనుమతులు

ALSO READ: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం.. దానిపై వున్న నియంత్రణ ఎత్తవేత