Proddatur Youth Street Fight: పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన కొందరు యువకులు బరితెగిస్తున్నారు. రోడ్లపై రెచ్చిపోతూ వీరంగం సృష్టిస్తున్నారు. కరోనా టైంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కడప, హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలు ఇప్పుడు వైరల్ మారాయి.
కడపజిల్లా ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డులో మద్యం మత్తులో యువకులు హల్ చల్ చేశారు. దాదాపు 10 మంది వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై రాళ్లు, కాళ్లతో దాడి చేశారు. ఇదే క్రమంలో గోపవరం సచివాలయం కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేష్‌పై విచక్షణరహితంగా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు వెంకటేష్. ప్రస్తుతం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని చంచల్‌గూడలో చిన్నపాటి గొడవతో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు.. పరస్పరం పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ యువకులు రోడ్లపైకి విచక్షణారహితంగా వ్యవహరిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ఫ్యూ ఉన్న సమయంలో యువకులు బరితెగిస్తుండటంతో పోలీసుల నిఘాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.