Love Matter: మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని ఆగ్రహించిన ఉన్నత వర్గానికి చెందిన కొందరు.. ఇద్దరు యువకులను చితక బాదారు. గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ మెడలో వేసి ఊరంతా ఊరేగించారు. మొహంపై ఉమ్మి వేసి చావబాదారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జబల్‌పూర్ పరిధిలోని డామన్ ఖమారియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ మెహ్రా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే, ఇరువురూ మాట్లాడుకోవడం కోసం రాజ్ కుమార్ ఆ యువతికి మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే, ఆ ఫోన్‌ను గమనించిన యువతి తల్లిదండ్రులు.. ఫోన్ ఎక్కడిదంటూ నిలదీశారు. దాంతో అసలు వ్యవహారాన్ని తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లు చెప్పింది యువతి. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రేమికుడు రాజ్ కుమార్, అతని స్నేహితుడు మహేంద్రను పిలిపించారు.
కుటుంబ సభ్యులంతా వారిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇద్దరికీ గుండు కొట్టించారు. ఆపై బూట్లు, చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఈ ఘటన మే 22వ తేదీన జరుగగా.. ఆ తరువాత ఇరువర్గాలు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన తాజాగా వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం కాస్తా పోలీసుల వరకు వెళ్లడంతో 4 నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులైన పవన్, శివకుమార్, నాన్హే, గన్ శ్యామ్‌ను అరెస్ట్ చేసినట్లు టిఐ రితేష్ పాండే తెలిపారు.
Also read: