ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖజిల్లా మండపేటకు చెందిన నందమూరి హర్షవర్థన్ చౌదరి ఎంటెక్ పూర్తిచేశాడు. హర్షవర్థన్ తన బామ్మకు క్యాన్సర్ రావడంతో చికిత్స నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కి తీసుకువచ్చాడు. శాలివాహననగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బంధువుల ఇంటికి వచ్చిన హర్షవర్ధన్ గురువారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని టెర్రస్‌పై నిలబడి ఫోన్‌లో చాటింగ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా తన చేతిలోని హెడ్‌ఫోన్ కింద పడిపోయింది. దాని కోసం టెర్రస్ చివరి నుంచి కిందకు చూస్తుండగా అదుపుతప్పి కిందకు పడిపోయాడు. గేటు పై పడటంతో తలపగిలి అక్కడికక్కడే చనిపోయాడు. నెలరోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన అతడు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.